'ట్రంప్ కార్డ్' పై కీలక అప్ డేట్... ఎలా సైన్ అప్ చేయాలంటే..?
రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో పెను మార్పులు చేసి సందడి చేసిన ట్రంప్.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం "ట్రంప్ కార్డు" అంటూ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 12 Jun 2025 12:03 PM ISTరెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో పెను మార్పులు చేసి సందడి చేసిన ట్రంప్.. అమెరికా పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం "ట్రంప్ కార్డు" అంటూ సరికొత్త పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... 5 మిలియన్ డాలర్లు చెల్లించి ఈ కార్డును సొంతం చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్ సైట్ (trumpcard.gov) ను ట్రంప్ ప్రారంభించారు.
అవును... ప్రభుత్వానికి ఐదు మిలియన్ డాలర్లు చెల్లించిన తర్వాత అమెరికా పౌరసత్వం పొందే మార్గాన్ని అందించే "గోల్డ్ కార్డ్" కోసం సైన్ అప్ చేయడానికి వలసదారులు తమ ఆసక్తిని నమోదు చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. ఐదు మిలియన్ డాలర్లకు ట్రంప్ కార్డు వస్తోంది అని ట్రూత్ లో ఓ పోస్ట్ పెట్టారు.
ఈ కార్డు ద్వారా ప్రపంచలోనే గొప్ప మార్కెట్ కలిగిన తమ దేశంలోకి ప్రవేశించవచ్చని ఆ పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా వెయిటింగ్ లిస్ట్ కు సంబంధించిన లింక్ ను కూడా ట్రంప్ ఆ పోస్టులో యాడ్ చేశారు. ఈ సందర్భంగా ప్రారంభించిన వెబ్ సైట్ లో పౌరసత్వం కావాలనుకునేవారు.. పేరు, పుట్టిన దేశం, ఉద్యోగమా వ్యాపారమా వంటి వివరాలు నమోదు చేయాలి!
కాగా... ఏప్రిల్ లో ట్రంప్ తొలిసారిగా గోల్డ్ కార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. 5 మిలియన్ డాలర్లు చెల్లించగలిగితే నేరుగా పౌరసత్వాన్ని అందజేస్తారు. ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులను ఆకర్షించేందుకు దీన్ని ప్రవేశపెట్టారు. దీనికోసం రిజిస్టర్ చేసుకున్న రెండు వారాలలోపు అందుబాటులోకి వస్తుందని అంటున్నారు.
