వైట్ హౌస్‌లో ఆసక్తికర ఘటన.. ట్రంప్ కు గిఫ్టుగా తన తాత బర్త్ సర్టిఫికెట్..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఒక అరుదైన బహుమతి లభించింది.
By: Tupaki Desk | 7 Jun 2025 1:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో ఒక అరుదైన బహుమతి లభించింది. జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ స్వయంగా తనతో తెచ్చిన ఈ కానుక, ట్రంప్ పూర్వీకుల గురించి, ఆయన జర్మనీ మూలాల గురించి గుర్తు చేసింది. అది మరేంటో కాదు ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ పుట్టిన తేదీ ధ్రువపత్రం (బర్త్ సర్టిఫికెట్). అమెరికా పర్యటనకు వచ్చిన జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, అధ్యక్షుడు ట్రంప్‌తో సమావేశమైనప్పుడు ఈ ప్రత్యేక బహుమతిని అందజేశారు. "ట్రంప్ తాత పేరు ఫ్రెడ్రిక్. ఇది ఆయన బర్త్ సర్టిఫికెట్. ఆయన 1869లో బ్రాండెన్‌బర్గ్ సమీపంలో జన్మించారు" అని మెర్జ్ ఈ సర్టిఫికెట్ ట్రంప్‌కు అందజేస్తూ వివరించారు. ఈ అనూహ్య కానుకతో ట్రంప్ ఆశ్చర్యపోయి, జర్మన్ నాయకుడికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ బహుమతి కేవలం ఒక పత్రం మాత్రమే కాదు.. ట్రంప్ కుటుంబానికి, అమెరికా వలస చరిత్రకు మధ్య ఉన్న అనుబంధానికి ఒక ప్రత్యక్ష సాక్ష్యం.
ట్రంప్ తాత ఫ్రెడరిక్ ట్రంప్ 1869 మార్చి 14న జర్మనీలోని కాల్‌స్టాడ్ట్ అనే చిన్న గ్రామంలో జన్మించారు. 16 సంవత్సరాల వయస్సులో 1885లో మెరుగైన భవిష్యత్తును వెతుక్కుంటూ ఆయన ఒంటరిగా అమెరికాకు వలస వచ్చారు. అమెరికాకు చేరుకున్న తర్వాత, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందు ఆయన అనేక చిన్న చిన్న పనులు చేశారు. అలస్కాలోని గోల్డ్ రష్ సమయంలో హోటళ్లు, రెస్టారెంట్లు నడిపి ధనవంతుడయ్యారు. ఆ తర్వాత న్యూయార్క్‌కు తిరిగి వచ్చి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డారు. 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూ మహమ్మారి కారణంగా న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ఫ్రెడరిక్ ట్రంప్ మరణించారు. ఆయన జీవిత ప్రయాణం "అమెరికన్ డ్రీమ్" కు ఒక ఉదాహరణగా నిలిచింది.
వైట్ హౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో ట్రంప్, మెర్జ్‌లు అనేక ముఖ్యమైన అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం, వాణిజ్య సంబంధాలు, జర్మనీలో అమెరికా సైనికుల మోహరింపు వంటి విషయాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, మెర్జ్ జర్మనీకి చాలా సమర్థవంతమైన ప్రతినిధి అని ప్రశంసించారు. జర్మనీలో అమెరికా సైనికులు కొనసాగుతారని హామీ ఇచ్చారు. జర్మనీ తన రక్షణ ఖర్చులను పెంచడాన్ని స్వాగతించారు. నార్డ్ స్ట్రీమ్ 2 పైప్‌లైన్ (రష్యా నుండి జర్మనీకి గ్యాస్ పైప్‌లైన్) ఒక తప్పుడు నిర్ణయం అని మెర్జ్ అభివర్ణించారు. ఈ సమావేశం కేవలం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడమే కాకుండా, రెండు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసుకోవడానికి, కీలకమైన అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కోవడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు.
