ట్రంప్ నుంచి మరో సీజ్ ఫైర్ పోస్టు.. కండిషన్స్ అప్లై!
అవును... 2023 అక్టోబర్ నుంచి గాజాను గడగడలాడించేస్తున్న ఇజ్రాయెల్ ను సీజ్ ఫైర్ కు ఒప్పించినట్లు ట్రంప్ తెలిపారు.
By: Tupaki Desk | 2 July 2025 10:22 AM ISTభారత్ – పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపాను, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేయించాను.. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. ప్రపంచ శాంతి కోసం తాను ఎన్నో సంఘర్షణలకు చరమగీతం పాడాను అని చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మరో కాల్పుల విరమణ ఒప్పందం చేసినట్లు ప్రకటించారు. కాకపోతే కండిషన్స్ అప్లై!
అవును... 2023 అక్టోబర్ నుంచి గాజాను గడగడలాడించేస్తున్న ఇజ్రాయెల్ ను సీజ్ ఫైర్ కు ఒప్పించినట్లు ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా.. గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ చేయడానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన 'ట్రూత్'లో పోస్టు చేశారు. అయితే ఆ షరతులు ఏమిటి, ఎలాంటివి అనేది మాత్రం వెల్లడించలేదు.
ఈ సందర్భంగా.. గాజాకు సంబంధించి ఇజ్రాయెల్ తో తమ ప్రతినిధులు సుదీర్ఘ, ఫలవంతమైన చర్చలు జరిపారని చెప్పిన ట్రంప్.. 60 రోజుల కాల్పుల విరమణ ఖరారు చేయడానికి అవసరమైన షరతులకు ఇజ్రాయెల్ అంగీకరించిందని.. ఈ సమయంలో యుద్ధాన్ని పూర్తిగా ముగించేందుకు అన్ని పక్షాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు.
ఈ ప్రాంతంలో శాంతి కోసం కృషి చేస్తున్న ఈజిప్ట్, ఖతార్ లు తుది ప్రతిపాదన చేస్తాయని చెప్పిన ట్రంప్... ఇది పశ్చిమాసియాకు మంచిదని ఆశిస్తున్నట్లు తెలిపారు. హమాస్ సైతం ఈ డీల్ కు ఒప్పుకుంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక వేళ హమాస్ అంగీకరించకుంటే మాత్రం ఈ సమస్య మరింత జటిలం అవుతుందని ట్రంప్ వెల్లడించారు!
అంటే... గాజాపై కాల్పుల విరమణ విషయంలో ఇప్పటికే ఇజ్రాయెల్ ఒప్పుకోగా.. హమాస్ నిర్ణయం కోసం వెయిటింగ్ అన్నమాట. మరి ట్రంప్ చేసిన ప్రకటనకు హమాస్ అంగీకరిస్తుందా.. లేక, ఇజ్రాయెల్ సైన్యం చేతిలో పాలస్తీనా ప్రజలను ఇంకా బలిపశువులను చేయడానికే నిశ్చయించుకుంటుందా అనేది వేచి చూడాలి!
కాగా... 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్ లోకి చొరబడిన హమాస్ ఉగ్రవాదులు.. సుమారు 1,200 మందిని ఊచకోత కోసిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో.. సుమారు 251 మందిని బందీలుగా తీసుకెళ్లారు. దీంతో అప్పటినుంచి హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ పై అవిరామంగా విరుచుకుపడుతోంది.
ఈ నేపథ్యంలో... హమాస్ అగ్రనేతలను, కీలక కమాండర్లను, వేల మంది మిలిటెంట్లను హతమార్చింది! హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటి వరకు 56,647 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. ఇక ఈ ఐడీఎఫ్ దాడులతో పలు పట్టణాలు నామారూపాల్లేకుండా పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కాంక్రీట్ శిథిలాలుగా మారాయి.
