Begin typing your search above and press return to search.

51వ రాష్ట్రం తర్వాత.. ఉన్న 50 రాష్ట్రాల్ని సక్కగా చూసుకో ట్రంప్

అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలకు అదనంగా 51వ రాష్ట్రంగా అమెరికాలో కలిసిపోవాలంటూ పొరుగున ఉన్నసంపన్న కెనడాను అడిగేసేంత బరితెగింపు ట్రంప్ సొంతం.

By:  Tupaki Desk   |   11 Jun 2025 9:38 AM IST
51వ రాష్ట్రం తర్వాత.. ఉన్న 50 రాష్ట్రాల్ని సక్కగా చూసుకో ట్రంప్
X

పెడసరి ట్రంప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొండితనానికి మించిన మూర్ఖత్వం.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా జరిగిపోవాలనన పంతం ఆయనకు ఎంత ఎక్కువన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ 2.0 షురూ అయిన తర్వాత పరిస్థితుల్లో వచ్చిన మార్పుల గురించి తెలిసిందే. వెనుకా ముందు చూసుకోకుండా దూకుడుగా నిర్ణయాలు తీసుకోవటం.. వాటి కారణంగా తలెత్తే తలనొప్పుల్ని బలవంతంగా అణిచేయటం.. అవసరమైతే ఎంతటి బెదిరింపులకైనా సిద్దమవటం లాంటివి ట్రంప్ పాలనలో అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.

అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలకు అదనంగా 51వ రాష్ట్రంగా అమెరికాలో కలిసిపోవాలంటూ పొరుగున ఉన్నసంపన్న కెనడాను అడిగేసేంత బరితెగింపు ట్రంప్ సొంతం. అమెరికా సంయుక్త రాష్ట్రాలుగా పేర్కొనే 50 రాష్ట్రాల్ని సరిగా చూసుకోవటం మీద ఫోకస్ కంటే.. మరో దేశాన్ని అమెరికాలో కలిపేసుకోవటంపై ట్రంప్ కు ఉండే ఆసక్తిని ప్రపంచం ఇప్పటికే చూసింది. అక్రమవలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. అందులో భాగంగా లాస్ ఏంజెల్స్ లో ఇటీవల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అవి కాస్తా నిరసనల వరకు వెళ్లటమేకాదు.. ప్రస్తుతం ఆ నగరంలో పరిస్థితి రచ్చ రచ్చగా మారింది.

అంతేకాదు.. అక్రమ వలసదారుల్ని ఏరివేసేందుకు అన్న సాకుతో ఆరున్నర దశాబ్దాల తర్వాత సదరు రాష్ట్రం అనుమతి లేకుండా కేంద్ర బలగాల్ని పంపిన ట్రంప్ వైనాన్ని తీవ్రంగా తప్పు పడుతున్నారు. ఇక్కడో విషయాన్ని ప్రస్తావించాలి. ట్రంప్ ది రిపబ్లికన్ పార్టీ. లాస్ ఏంజెలెస్ ఉండేది క్యాలిఫోర్నియా రాష్ట్రంలో. ఆ రాష్ట్రం ప్రస్తుతం డెమోక్రాకట్ల ఏలుబడిలో ఉంది. అందుకే.. ట్రంప్ తన తెంపరితనాన్ని ప్రదర్శించారు. రాష్ట్రాలు తమకు కేంద్ర బలగాల్ని పంపాలన్నప్పుడు పంపాలే తప్పించి.. ముందుస్తు సమాచారం లాంటివి కూడా ఇవ్వకుండా ఏకాఏకిన పంపటం మంచి సంప్రదాయం కాదు.

ఇదే విషయాన్ని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసమ్ మండిపడుతున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ తన చర్యను తప్పు పట్టటం ట్రంప్ కు అస్సలు నచ్చలేదు. వెంటనే బెదిరింపులకు దిగారు. గవర్నర్ ను అరెస్టు చేయిస్తానని.. ఆ రాష్ట్రానికి నిధులు నిలిపివేస్తానంటూ హెచ్చరించారు. ట్రంప్ హెచ్చరికలకు మిగిలిన దేశాలు అయితే బెదరుతాయేమో కానీ.. అమెరికాలోని రాష్ట్ర గవర్నర్ ఎందుకు తగ్గుతారు. అందుకే ఆయన కూడా ట్రంప్ తీరుకు ఏ మాత్రం తగ్గకుండా స్పందించారు. కాలిఫోర్నియా నుంచి పన్నుల రూపంలో ఫెడరల్ ప్రభుత్వానికి వెళ్లే 8 వేల కోట్ల డాలర్ల నిధుల్ని ఆపేస్తామని చెప్పటమే కాదు.. చట్టవిరుద్ధంగా ఫెడరల్ బలగాల్ని పంపిన ట్రంప్ తీరుపై కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.

ఇంతకాలం ఫెడరల్ ప్రభుత్వంలో పెద్దన్నలా వ్యవహరిస్తున్న తీరుపై ఉన్న అంతర్గతంగా ఉన్న అసంత్రప్తి తాజా ఎపిసోడ్ తో బద్ధలైంది. క్యాలిఫోర్నియాలో అపరిమితమైన సంపద ఉన్నట్లే.. ఆ రాష్ట్రాన్ని ఆశ్రయించిన వలసలూ అధికమే. ఈ రాష్ట్రంలో ఉండే శ్వేతజాతి అమెరికన్లకు వలసలపై ఆగ్రహావేశాలు ఉన్నాయి. దీన్ని గుర్తించి.. సరిదిద్దే విషయంలో డెమోక్రాట్లు విఫలం కావటం.. దాన్ని అసరాగా చేసుకొని ట్రంప్ చెలరేగిపోవటం మొదలైంది. ట్రంప్ లాంటోళ్లకు అవకాశం రావటానికి డెమోక్రాట్ల వైఫల్యాలు కూడా కారణమే.

మరోవైపు లాస్ ఏంజెల్స్ నగరంలో మొదలైన నిరసనలు.. ఆగ్రహావేశాలు.. ఇతర ప్రాంతాలకు విస్తరించాయి. మరి.. లాస్ ఏంజెల్స్ కు పంపినట్లే 2 వేల మంది కేంద్ర బలగాలు.. 600 మంది మెరైన్ సిబ్బంది తరహాలోనే.. గొడవలు జరిగే ప్రతి చోటకు ఆయా రాష్ట్రాల గవర్నర్ అనుమతి లేకుండానే పంపుతారా? అన్నది ప్రశ్న. అదే జరిగితే.. కాలిఫోర్నియా గవర్నర్ మాదిరే.. ఇతర రాష్ట్రాల గవర్నర్లు రచ్చ రచ్చ చేసే వీలుంది. అదే జరిగితే.. అమెరికాలో51వ రాష్ట్రంగా కెనడా కలవటం కాదు.. ఇప్పుడున్న 50 రాష్ట్రాలతో కూడిన ఫెడరల్ ప్రభుత్వంతో కిందామీదా పడే పరిస్థితి నెలకొని ఉంటుందన్నది మర్చిపోకూడదు. ఇలాంటి వేళలోనూ ట్రంప్ తన తెంపరితనాన్నే ప్రదర్శిస్తారా? లేదంటే.. పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తారా? అన్నది చూడాలి.