అమెరికన్ మార్కెట్లోకి కొత్త బ్రాండ్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఇప్పుడు టెక్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
By: Tupaki Desk | 17 Jun 2025 3:00 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబం ఇప్పుడు టెక్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. మొబైల్ ఫోన్ల తయారీ రంగంలోకి ప్రవేశించేందుకు ప్రణాళికలు రచించింది. ఈ మేరకు 'ట్రంప్' పేరును మొబైల్ ఫోన్ సర్వీసులకు ఉపయోగించేందుకు అధికారికంగా లైసెన్స్ పొందినట్టు ఎరిక్ ట్రంప్ వెల్లడించారు.
-అమెరికాలోనే తయారీ, మెరుగైన సేవలు
ఈ ఫోన్లు పూర్తిగా అమెరికాలోనే తయారవుతాయని, దేశీయ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇస్తామని ఎరిక్ ట్రంప్ స్పష్టం చేశారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇది 'మేడ్ ఇన్ USA' ఉత్పత్తులకు ఒక పెద్ద ప్రోత్సాహకం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
-'T1' పేరుతో బంగారు రంగులో
'T1' పేరిట విడుదల కాబోయే ఈ మొబైల్ ఫోన్ బంగారు రంగులో లభ్యం కానుందని సమాచారం. ఈ ఫోన్‌ను 2025 ఆగస్టు నెల నుండి మార్కెట్లో అందుబాటులోకి తేనున్నారు. దీని ధర 499 అమెరికన్ డాలర్లుగా ఉండనుంది.
-చైనా బ్రాండ్లకు ప్రత్యామ్నాయం?
ఇప్పటికే చైనీస్ బ్రాండ్లపై నిషేధం, ఆంక్షలు ఉన్న నేపథ్యంలో ఈ ట్రంప్ మొబైల్ ఫోన్లు అమెరికా మార్కెట్‌లో మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, డిజైన్ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
టెక్ రంగంలో ట్రంప్ ఫ్యామిలీకి ఇది తొలి ప్రాయోగిక ప్రణాళిక కావడం విశేషం. రాజకీయంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ట్రంప్ పేరు, ఇప్పుడు టెక్నాలజీ రంగంలోనూ దూసుకెళ్లబోతుందనడంలో సందేహం లేదు.
