ఇరాన్‌తో భగ్గుమన్న ఉద్రిక్తతలు.. అమెరికా సంచలన నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి.
By: Tupaki Desk | 13 Jun 2025 1:00 AM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో అణు ఒప్పందం కుదుర్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చాయి. "అదో ప్రమాదకరమైన ప్రాంతం" అని పేర్కొన్న ట్రంప్, తమ సైనిక కుటుంబాలను , దౌత్య సిబ్బందిని అక్కడి నుండి తరలిస్తున్నామని తెలిపారు. వారికి ఆ ప్రాంతాన్ని వీడాలని నోటీసులు జారీ చేసినట్లు ఆయన వెల్లడించారు.
"అది ప్రమాదకరమైన ప్రాంతం. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని వారికి నోటీసులు జారీ చేశాం. ఏం జరుగుతుందో చూడాలి" అని ట్రంప్ పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలు తగ్గాలంటే ఇరాన్ అణ్వాయుధాన్ని కలిగి ఉండకూడదని ఆయన హెచ్చరించారు. అణు చర్చలు విఫలమైతే, ఇరాన్‌పై దాడులు చేస్తామని ట్రంప్ పదేపదే హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే.
బుధవారం ఓ ఇంటర్వ్యూలో కూడా యురేనియం శుద్ధి చేయడాన్ని టెహ్రాన్ ఆపేస్తుందనే నమ్మకం తనకు లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదే హెచ్చరించారు. ఈ హెచ్చరికల నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా కువైట్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. అందులో తమ సిబ్బందిని ఎక్కడికీ తరలించడం లేదని పేర్కొంది. అయితే, కువైట్ అధికారులు మాత్రం దీనికి భిన్నంగా ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో అత్యవసరం కాని అమెరికా సిబ్బంది ఆ ప్రాంతాన్ని వీడాలని కోరింది.
ఇదిలావుండగా ఇరాన్‌తో అణుఒప్పందం కుదుర్చుకోవాలని ట్రంప్ కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారు. దీనిపై ఉన్నతస్థాయి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే ఆ చర్చలు విఫలం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు, ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతోందని పలు మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యూఎస్ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
