ఎన్ని ప్రూఫ్ లు చూపించినా ఫేక్ అంటే ఎలా ట్రంప్ & కో..!?
అవును... ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం విషయంలో ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందనే ప్రచారం జరుగుతుంది.
By: Tupaki Desk | 24 July 2025 11:39 AM ISTఅమెరికా అధ్యక్షుడు రెండోవిడత పాలనలో ట్రంప్ కు ఎదురవుతున్న అతిపెద్ద సమస్యల్లో ఎప్ స్టీన్ కుంభకోణం ఒకటనే సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం ట్రంప్ ను వెంటాడుతుంది. అటు మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ ఈ విషయమే ట్రండింగ్ లో ఉంటుంది. ఈ సమయంలో.. ప్రతీ ఆరోపణకూ వైట్ హౌస్ సమర్థించాల్సి వస్తోంది! ఈ సందర్భంగా.. అది ఫేక్ ప్రచారం అని కొట్టిపరేస్తోంది!
అవును... ఎప్ స్టీన్ సె*క్స్ కుంభకోణం విషయంలో ట్రంప్ పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యి అన్నట్లుగా ఉందనే ప్రచారం జరుగుతుంది. ఈ సందర్భంగా... అందులో ఉన్న పేర్లు, ఆ ఫైల్స్ మొత్తం విడుదల చేయాలంటే లోలోన ఏదో టెన్షన్ అని అంటున్నారు! అలా అని వదిలేద్దామంటే... ఎన్నికల్లో ఈ మేరకు హామీ ఇచ్చిన విషయాన్ని అటు ప్రజలు, ఇటు మీడియా గుర్తు చేస్తోంది.
ఈ క్రమంలో... ఎప్ స్టీన్ ఫైల్స్ లో తన పేరు ఉందన్న విషయం ట్రంప్ కు తెలుసంటూ కథనాలొస్తున్నాయి. అందుకే ఇంత కీలకమైన విషయాన్ని టైం వేస్ట్ సబ్జెక్ట్ గా ట్రంప్ కొట్టిపారేస్తున్నారని చెబుతున్నారు. ఈ సమయంలో.. ఆ కథనాలన్నీ ఫేక్ అని.. ఎప్ స్టీన్ విషయంలో ఇప్పటికే ట్రంప్ పై జరుగుతున్న తప్పుడు ప్రచారాల కొనసాగింపని వైట్ హౌస్ ప్రతినిధి పేర్కొన్నారు.
తాజాగా ఈ విషయంపై స్పందించిన వైట్ హౌస్ ప్రతినిధి... ఎప్ స్టీన్ ఫైల్స్ విషయంలో ట్రంప్ కు వ్యతిరేకంగా డెమోక్రటిక్ పార్టీ నేతలు, లిబరల్ మీడియా ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలకు "తన పేరుందనే విషయం ట్రంప్ కు తెలుసు" అనేది కొనసాగింపు తప్ప మరొకటి కాదని అన్నారు.
మరోవైపు ఎప్ స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరు పలుమార్లు హైప్రొఫైల్ వ్యక్తులతో కలిసి ఉందని.. అటార్నీ జనరల్ పామ్ బాండీ కూడా ఫిబ్రవరిలో జరిగిన ఓ రొటీన్ బ్రీఫింగ్ సందర్భంగా ఎప్ స్టీన్ ఫైల్స్ లో ట్రంప్ పేరున్న విషయాన్ని ఆయనకు వివరించారని తాజాగా వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలో... ఈ కథనాన్ని అమెరికా మీడియాలో చాలా సంస్థలు ప్రచురించాయి!
కాగా... జెఫ్రీ ఎప్ స్టీన్ కు, ట్రంప్ కు మధ్య గొప్ప స్నేహం ఉందంటూ, అందులోని పలు విషయాలను బయటపెడుతూ వాల్ స్ట్రీట్ జర్నల్ వరుస కథనాలు ప్రచురిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... వాల్ స్ట్రీట్ జర్నల్ తోపాటు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్ పై 10 బిలియన్ డాలర్లకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావా వేసిన సంగతి తెలిసిందే.
ఈ విధంగా గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా ఎప్ స్టీన్ ఫైల్స్ పై అమెరికా మీడియాలో కథనాలు రావడం.. కొన్నింటిలో ఫోటోలు, వీడియో సాక్ష్యాలతో సహా కథనాలు వస్తుండటంతో.. వాటిని కవర్ చేయడం వైట్ హౌస్ కు పెద్ద పనిగా మారిందనే కామెంట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి!!
