ట్రంప్, ఎలాన్ మస్క్ బిజినెస్ డీల్ కుదరలేదేమో.. అందుకే డివోర్స్!
అవును... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రంప్ - మస్క్ మధ్య వైరానికి వారి మధ్య బిజినెస్ డీల్ కుదరలేదా అనే చర్చ తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 8 Jun 2025 11:23 AM ISTనిన్నమొన్నటి వరకూ ప్రాణస్నేహితులుగా ఉన్నారు.. ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ అవ్వడానికే మస్కే ప్రధాన కారణం అనే మాటలు వినిపించిన పరిస్థితి! ఇక అటు వైట్ హౌస్ లోనూ, బయట కార్యక్రమాల్లోనూ అవిభక్త కవలల్లా కలిసి తిరిగారు ట్రంప్ - ఎలాన్ మస్క్ ధ్వయం! కట్ చేస్తే... నువ్వెంతంటే నువ్వెంత అనే స్థాయిలో మాటల యుద్ధాలు బహిరంగంగా మొదలైపోయాయి.
డొనాల్డ్ ట్రంప్ రెండోసారి గెలవడానికి తానే కారణం అని ఎలాన్ మస్క్ అంటే... అతని బ్రెయిన్ సరిగ్గా లేదు, తన గెలుపుకు తానే కారణం, మస్క్ లేకపోయినా తన ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.. అతడు ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలు, ఆర్థిక సహాయాలు అన్నీ పారదర్శకంగా జరిగాయా లేదా అనే విషయాలపై పరిశీలన అవసరం అని ట్రంప్ పేర్కొన్నారు.
ఈ సమయంలో "ది అమెరికా పార్టీ" అంటూ అనధికారికంగా కొత్త పార్టీ ప్రకటనను తెరపైకి తెచ్చారు ఎలాన్ మస్క్. దీనిపై లైట్ తీసుకున్న ట్రంప్.. తనకు ఇప్పుడు మస్క్ గురించి ఆలోచించేటంత ఖాళీ లేదని.. తాను బిజీగా ఉన్నానని చెబుతున్నారు. మరోపక్క మస్క్ గనుక డెమోక్రాట్లకు మద్దతు తెలిపితే అత్యంత తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ట్రంప్ నుంచి మాస్ వార్నింగ్ వచ్చేసింది.
సెక్స్ కుంభకోణంలో నిందితుడైన ఎప్ స్టెన్ కు సంబంధించిన దర్యాప్తు ఫైళ్లలో ట్రంప్ పేరుందని ఆరోపించిన మస్క్.. అందువల్లే దర్యాప్తులో వెల్లడైన విషయాలు బహిరంగంగా బయటపెట్టలేదని అన్నారు. కాకపోతే ఆ ట్వీట్ ను కాసేపటికి డిలీట్ చేశారు. ఈ స్థాయిలో సాగుతున్న యుద్ధం వెనుక అసలు కారణం అంగీకారం కుదరని బిజినెస్ ఒప్పందం అనే చర్చ తాజాగా తెరపైకి వచ్చింది.
అవును... ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ట్రంప్ - మస్క్ మధ్య వైరానికి వారి మధ్య బిజినెస్ డీల్ కుదరలేదా అనే చర్చ తెరపైకి వచ్చింది. ఆ కారణానికి బలం చేకూర్చే పలు విషయాలు తెరపైకి వచ్చాయి. వాస్తవానికి గత ఏడాది జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ కోసం ఎలాన్ మస్క్ 300 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు చెబుతారు.
అంత ఖర్చు చేసిన వ్యక్తి కచ్చితంగా రిటన్స్ ఎక్కువగానే ఆశించే అభిప్రాయం ఉందని అంటారు. అయితే.. ఆ విషయంలో ట్రంప్ నుంచి మస్క్ కు సంపూర్ణ మద్దతు రాలేదు సరికదా.. పన్నులు పెంచే విషయం కూడా తెరపైకి రావడంతో ఎలాన్ మస్క్ పూర్తిగా హర్ట్ అయ్యారని అంటున్నారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ హర్ట్ అవ్వడానికి గల కారణాలు ఈ విధంగా ఉన్నాయి!
వాస్తవానికి 2030 నాటికి 50% ఎలక్ట్రిక్ వాహనాలు ఉండాలని జో బైడెన్ ప్రభుత్వం పాలసీ తీసుకుంది! ఇది ఇప్పుడు కొనసాగితే టెస్లా కార్లకు భారీ డిమాండ్ వచ్చేంది. అయితే.. బైడెన్ ఎలక్ట్రిక్ కార్ల పాలసీని ట్రంప్ రద్దు చేశారు. దీంతో.. ఎలక్ట్రిక్ కార్ల విషయంలో ఎలాన్ మస్క్ ఆశలు ఆవిరయ్యాయి. ఇది వీరి మధ్య గ్యాప్ కు తొలి అడుగుగా చెబుతారు.
ఇదే సమయంలో సుమారు 500 బిలియన్ డాలర్లతో ఓపెన్ ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్ బ్యాంక్ సంయుక్త భాగస్వామ్యంతో "స్టార్ గేట్" అనే వెంచర్ ప్రారంభమైంది. ఈ భారీ ప్రాజెక్టును డొనాల్డ్ ట్రంప్ ఆవిష్కరించారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన రెండు రోజుల్లోనే ఇంత భారీ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. అయితే.. ఇందులో మస్క్ లేరు!
వీటికితోడు మస్క్ మిత్రుడు జారెడ్ ఐజాక్ మన్ ను యూఎస్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అధిపతిగా నామినేషన్ ను ట్రంప్ రద్దు చేశారు! ఈ వివాదం తీవ్రమైంది. దీనిపై మస్క్ చాలా కోపంగా ఉన్నారు. ఇలా... ఎలాన్ మస్క్ – డొనాల్డ్ ట్రంప్ మధ్య నేటి రచ్చకు బిజినెస్ డీల్స్ కారణమనే చర్చ తెరపైకి వచ్చింది.
ఈ నేపథ్యంలోనే.. రాకెట్ కంపెనీ స్పేస్ ఎక్స్, దాని ఉపగ్రహ యూనిట్ స్టార్ లింక్ తో సహా మస్క్ వ్యాపారాలతో యూఎస్ ప్రభుత్వ ఒప్పందాలను రద్దు చేసుకుంటానని డొనాల్డ్ ట్రంప్ సూచించారు. దీంతో.. స్పేస్ కు వ్యోమగాములను పంపగల ఏకైక యూఎస్ అంతరిక్ష నౌక అయిన స్పేస్ ఎక్స్ డ్రాగన్ అంతరిక్ష నౌకను రద్దు చేస్తానని మస్క్ బెదిరించాడు. ఈ విధంగా ప్రస్తుతం వీరి మధ్య వార్ నడుస్తోంది!
