ట్రంప్, మస్క్ రోమాన్స్ ముగిసిందా?
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతు పలికిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ట్రంప్ పాలకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 28 May 2025 11:00 PM ISTముందుగ మురిస్తే పండుగ కాదంటారు.. ఇప్పుడు ఈ ఇద్దరు అగ్రరాజ్యపు నేత, వ్యాపారవేత్త విషయంలో అక్షరాల సూట్ అవుతుంది. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవంటారు. పైగా తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అనే పే...ద్ద మనుషులు కలిసి పనిచేయడం కష్టమంటారు. ఒకరేమో కరుడుగట్టిన జాతీయవాది ట్రంప్.. రెండొకరు ఏమో డబ్బుల పరమావధిగా మానవత్వం చూడని అపర కుబేరుడు.. ఈ ఇద్దరు మేధావులు అమెరికా కోసం కలిశారు. అధికారం సాధించారు. వారు కోరుకున్నట్టే అమెరికాలో గెలిచారు. అధికారం పంచుకున్నారు. వారిద్దరే ట్రంప్, మస్క్ లు.. డోజ్ అని ప్రభుత్వ వ్యవస్థ ప్రక్షాళన చేయమని మస్క్ కు అంతులేని అధికారాలు ఇచ్చారు అధ్యక్షుడు ట్రంప్. మస్క్ కూడా మొదట్లో హడావుడి చేసి సంస్కరణలు చేపట్టారు. కానీ తర్వాత ఇప్పుడిప్పుడే ఈ ఇద్దరికి చెడుతోంది. ఒకరి అభిప్రాయాలు ఇంకొకరికి నచ్చడం లేదు. తాజా పరిణామాలు చూస్తుంటే.. ట్రంప్, మస్క్ రోమాన్స్ ముగిసినట్టేనని చెప్పకతప్పదు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు గట్టి మద్దతు పలికిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్, ట్రంప్ పాలకవర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ మస్క్‌ను డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) విభాగానికి అధిపతిగా నియమించారు. ఈ విభాగం ప్రభుత్వ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం, అనవసర ఖర్చులను తగ్గించడం లక్ష్యంగా పనిచేస్తుంది. అయితే, ట్రంప్ పరిపాలన ఇటీవల ప్రతిపాదించిన ఒక బిల్లుపై మస్క్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, వారిద్దరి మధ్య ఉన్న సంబంధాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ బిల్లుకు కేటాయించిన భారీ బడ్జెట్ DOGE లక్ష్యాలకు విరుద్ధమని మస్క్ గట్టిగా వాదించారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి DOGE చేసిన ప్రయత్నాలు ఈ కొత్త ఖర్చులతో వృధా అవుతాయని మస్క్ నిరాశ వ్యక్తం చేశారు. ఈ బహిరంగ విభేదం అనేక అంతర్జాతీయ మీడియా సంస్థలలో వారిద్దరి మధ్య ఉన్న 'బ్రొమాన్స్' ముగిసిందా అనే ఊహాగానాలకు దారితీసింది. జూన్ 1న ప్రసారం కానున్న ఒక ఇంటర్వ్యూలో మస్క్ ఈ విషయంపై మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రతిపాదిత బిల్లు దేశ ద్రవ్యలోటును పెంచుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్నికల సమయంలో దేశ ద్రవ్యలోటును తగ్గిస్తానని ట్రంప్ ప్రజలకు హామీ ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పెట్టుబడిదారులలో ఆందోళన కలిగిస్తోంది. ఈ కారణాల వల్ల కూడా మస్క్ ఈ బిల్లుపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ట్రంప్ రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, మస్క్‌ను DOGE అధిపతిగా నియమించి, ప్రభుత్వ విభాగాలలో సమూల మార్పులు తీసుకురావడానికి, అనవసర ఖర్చులను తగ్గించడానికి అధికారం ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా, DOGE అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించాలని కూడా సిఫార్సు చేసింది. ప్రభుత్వ వ్యవహారాలలో మస్క్ జోక్యంపై గతంలో విమర్శలు వచ్చినా, ట్రంప్ వాటిని కొట్టిపారేశారు. అయితే, తాజా బిల్లుపై మస్క్ వ్యతిరేకత నేపథ్యంలో ట్రంప్-మస్క్ సంబంధాలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి.
