ఇండియానే ఉదాహరణ.. అమెరికా ఎన్నికలపై ట్రంప్ సంచలన మార్పులు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు కొనసాగింపుగా తాజాగా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు
By: Tupaki Desk | 26 March 2025 2:22 PM ISTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవీకాలంలో తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలకు కొనసాగింపుగా తాజాగా ఎన్నికల ప్రక్రియలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇకపై ఓటు నమోదు చేసుకోవాలంటే అమెరికా పౌరసత్వం రుజువు తప్పనిసరి చేస్తూ ఆయన కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ట్రంప్.. భారత్ - బ్రెజిల్ వంటి దేశాలు ఎన్నికల విధానంలో అనుసరిస్తున్న పద్ధతులను ఉదాహరణగా చూపడం విశేషం.
అమెరికా ఎన్నికల ప్రక్రియలో అనేక లోపాలున్నాయని ట్రంప్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. "స్వయంపాలనలో మనం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నప్పటికీ, ఆధునిక- అభివృద్ధి చెందిన దేశాలు తమ ఎన్నికల ప్రక్రియలో అమలు చేస్తున్న ప్రాథమిక నిబంధనలను పాటించడంలో అమెరికా విఫలమైంది," అని ఆయన అన్నారు. ముఖ్యంగా భారత్ - బ్రెజిల్ దేశాలు ఓటరు గుర్తింపు కోసం బయోమెట్రిక్ డేటాబేస్‌ను ఉపయోగిస్తున్నాయని, కానీ అమెరికా మాత్రం పౌరసత్వం కోసం కేవలం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోందని ఆయన విమర్శించారు. జర్మనీ, కెనడా వంటి దేశాలు ఓట్ల లెక్కింపులో పేపర్ బ్యాలెట్ పద్ధతిని అవలంబిస్తున్నాయని కూడా ఆయన గుర్తు చేశారు.
కొత్త ఉత్తర్వుల ప్రకారం.. అమెరికాలో ఓటు వేయాలంటే ఇకపై ఓటర్లు తప్పనిసరిగా తమ పౌరసత్వాన్ని ధృవీకరించే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా యూఎస్ పాస్‌పోర్ట్ లేదా జనన ధ్రువీకరణ పత్రం వంటివి తప్పనిసరిగా చూపించాలి. అంతేకాకుండా ఎన్నికల ప్రక్రియను మరింత పటిష్టం చేసేందుకు ట్రంప్ మరికొన్ని కఠినమైన నిబంధనలను కూడా తీసుకువస్తున్నారు. అమెరికా పౌరులు కాని వ్యక్తులు ఎన్నికల నిధుల కోసం విరాళాలు ఇవ్వడాన్ని నిషేధిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఎన్నికల రోజు వరకు పోస్ట్ ద్వారా వచ్చే ఓట్లను మాత్రమే లెక్కించాలని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం చాలామంది అధికారులు ఎన్నికల రోజు తర్వాత కూడా వచ్చే బ్యాలెట్ ఓట్లను పరిగణలోకి తీసుకుంటున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలు తీసుకురావడం తన బాధ్యత అని ట్రంప్ గతంలోనూ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. "మోసాలు , లోపాలు లేని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన .. నిజాయితీగల ఎన్నికలను నిర్వహించడం మన కర్తవ్యం. అసలైన విజేతను నిర్ణయించడానికి ఈ మార్పులు చాలా అవసరం," అని ఆయన అభిప్రాయపడ్డారు. 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత ట్రంప్ ఎన్నికల విధానంపై తీవ్రమైన అనుమానాలు వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన తీసుకుంటున్న తాజా నిర్ణయాలు అమెరికా రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.
