Begin typing your search above and press return to search.

స్టీల్ పై సుంకం రెట్టింపు.. భారత్ పై ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్ ఎంతంటే?

ప్రపంచదేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. భారత్ పై సుమారు 26% సుంకాలను విధించిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   31 May 2025 8:00 PM IST
స్టీల్  పై సుంకం రెట్టింపు.. భారత్  పై ట్రంప్ నిర్ణయం ఎఫెక్ట్  ఎంతంటే?
X

ప్రపంచదేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్.. భారత్ పై సుమారు 26% సుంకాలను విధించిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరుదేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ సమయంలో స్పందించిన ట్రంప్.. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని అన్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తాజాగా ఉక్కుపై సుంకాలు రెట్టింపు చేశారు.

అవును... తాజాగా ఉక్కు రంగంపై సుంకాల దెబ్బ కొట్టారు ట్రంప్! ఇందులో భాగంగా... అమెరికా దిగుమతి సుంకాన్ని 25 నుంచి 50 శాతానికి పెంచారు. ఈ కొత్త నిర్ణయం అమెరికన్ ఉక్కుకు కొత్త బలాన్ని ఇస్తుందని ట్రంప్ నమ్ముతున్నారని అంటున్నారు. తాజాగా ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. సుంకాల పెంపు నిర్ణయం దేశీయ ఉక్కు వ్యాపారాన్ని పెంచుతుందని అన్నారు.

ఇదే సమయంలో.. ఈ కొత్త టారిఫ్ లు బుధవారం నుంచి అమల్లోకి రానున్నాయని అంటున్నారు. ఇదే సమయంలో.. అల్యూమినియం సుంకం కూడా ఇదే విధంగా పెరగనుందని అంటున్నారు. నివేదికల ప్రకారం.. మార్చి నెలలో చైనాలో మెట్రిక్ టన్ను ఉక్కు ధర %392, యూరప్ లో $690 ఉండగా.. అమెరికాలో $984గా ఉంది.

ఇలా ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై సుంకాలను రెట్టింపు చేయాలన్న అమెరికా అధ్యక్షుడి నిర్ణయం భారతదేశ 4.56 బిలియన్ డాలర్ల విలువైన లోహ ఎగుమతులపై ప్రభావం చూపనుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ (జీ.టీ.ఆర్.ఐ) నివేదిక వెల్లడించింది. 2025 ఆర్థిక సంవత్సరంలో భారత్ $4.56 బిలియన్ల విలువైన ఉక్కు, ఇనుము, అల్యూమినియం ఉత్పత్తులకు యూఎస్ కు ఎగుమతి చేసింది.

ఇందులో ఇనుము, ఉక్కుతో చేసిన వస్తువులు 587.5 మిలియన్ డాలర్లు కాగా.. ఇనుము లేదా ఉక్కుతో తయారు చేసినవి 3.1 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇదే సమయంలో.. అల్యూమినియం, దాని సంబంధిత వస్తువులు 860 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో.. సుంకాలు రెట్టింపు చేయడంతో.. భారతదేశం మార్కెట్ లో కొనసాగడం సవాలుగా మారవచ్చని అంటున్నారు!

కాగా... ఇప్పటికే అమెరికా, భారత్ మధ్య మొదటి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయుష్ గోయల్.. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ తో సమావేశమయ్యారు. ఈ క్రమంలో.. ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్ నాటికి తొలి దశ అగ్రిమెంట్ ఖరారు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది.