Begin typing your search above and press return to search.

అపర శాంతి దూత డొనాల్డ్ ట్రంప్

మొత్తానికి అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి పీఠం అధిరోహించిన నాలుగు నెలల తేడాలోనే డొనాల్డ్ ట్రంప్ కి అపర శాంతి దూత బిరుదు దక్కింది.

By:  Tupaki Desk   |   10 May 2025 7:40 PM IST
అపర శాంతి దూత డొనాల్డ్ ట్రంప్
X

మొత్తానికి అమెరికా ప్రెసిడెంట్ గా రెండోసారి పీఠం అధిరోహించిన నాలుగు నెలల తేడాలోనే డొనాల్డ్ ట్రంప్ కి అపర శాంతి దూత బిరుదు దక్కింది. నిజానికి ట్రంప్ కి ఈ బిరుదు కొద్దిగా ముందే రావాల్సి ఉంది. ఆయన అమెరికా ప్రెసిడెంట్ గా మరోసారి ఎన్నిక కాక ముందు నుంచే ఒక మాట పదే పదే చెబుతూ వచ్చారు.

తాను శ్వేత సౌధం ఎక్కగానే ఉక్రెయిన్ రష్యాల మధ్య యుద్ధాన్ని ఆపేయిస్తాను అని ప్రకటించారు. ఆయన అలాగే ప్రెసిడెంట్ అయ్యాక అదే పని మీద ఉన్నారు. రష్యా ప్రెసిడెంట్ పుతిన్ తో ఫోన్ కలిపారు. ఇక ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ తో చర్చలు జరిపారు. అయితే జెలెన్ స్కీ మాత్రం ససేమిరా అన్నారు. ట్రంప్ ఆగ్రహించినా ఆయన తగ్గలేదు

మరో వైపు రష్యా కూడా యుద్ధాన్ని కొనసాగించడంతో మూడేళ్ళుగా అక్కడ రావణ కాష్టంగా సమరం సాగుతూనే ఉంది. ఇంతలో మరో అవకాశం వచ్చింది. అదే భారత్ పాక్ ల మధ్య సమరం. గత నెల 22న పాక్ ప్రేరేపిత ఉగ్ర మూకలు పహిల్గాం లో సృష్టించిన మారణహోమంలో ఏకంగా పాతిక మందికి పైగా అమాయకులు చనిపోయారు

దానికి ప్రతిగా భారత్ ఈ నెల 7న చేసిన ఆపరేషన్ సింధూర్ పాక్ లో ప్రకంపనలు పుట్టించింది. ఆ మీదట పాక్ నుంచి కౌంటర్ ఎటాక్ స్టార్ట్ అయింది. దాంతో భారత్ కూడా అలెర్ట్ అయి యుద్ధానికి సిద్ధమైంది. అలా గత మూడు నాలుగు రోజులుగా తీవ్ర ఉద్రిక్తల నడుమ సాగిన ఈ వార్ ని ఎట్టకేలకు అమెరికా జోక్యం చేసుకుని అపేయించింది అన్న పేరుని ట్రంప్ సంపాదించారు.

తన మధ్యవర్తిత్వానికి పాక్ భారత్ రెండూ ఆమోదం తెలిపి యుద్ధం నుంచి తప్పుకున్నాయని కాల్పుల విరమణను ప్రకటించాయని ఇది సంతోషకరమని ట్రంప్ పేర్కొన్నారు. ఇదంతా తన ప్రయత్నం అని ఆయన చెప్పుకున్నారు. ఒక రాత్రి అంతా రెండు దేశాల మధ్య చర్చలకే సమయం వెచ్చించామని ఆయన చెప్పారు. ఇలా శాంతిని స్థాపించామని ప్రాంతీయంగా సంఘర్షణలు నివారించామని ఆయన ప్రకటించుకున్నారు.

నిజానికి ఇదే మధ్యవర్తిత్వానికి చైనా కూడా సిద్ధపడింది. అయితే చైనా భారత్ కి ప్రత్యర్థిగా ఉంది. పాక్ కి మిత్రుడుగానూ ఉంది. దంతో భారత్ వైపు నుంచి స్పందన రాలేదు. అదే ట్రంప్ విషయం తీసుకుంటే ఆయన రెండు దేశాలకూ మిత్రుడిగా ఉన్నారు కాబట్టి సాధ్యపడింది అని అంటున్నారు. పైగా ఆయన చెప్పిన దానికి ఉభయులూ అంగీకరించడం ద్వారా అమెరికా తమకు నిజమైన మిత్రుడు అని నిరూపించారు అని అంటున్నారు. ఇక పాక్ లోని కీలక్ అధికారులు మాజీ పాలకులు కూడా అమెరికా జోక్యాన్ని రెండు రోజుల ముందు నుంచే కోరుకుంటూ వచ్చారు.

అలా భారత్ తో తమకు యుద్ధం చేతకవడం లేదని తాము దిక్కుతోచని స్థితిలోకి వెళ్ళామని బావురుమన్న పాక్ కి అమెరికా పెద్దన్న మాదిరిగా పంచాయతీ చేయడానికి ముందుకు వచ్చింది. భారత్ విషయానికి వస్తే అమెరికాతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాని వల్లనే ఇపుడు కాల్పుల విరమణ అన్నది సాధ్యమైంది అని అంటున్నారు.

అమెరికా ప్రెసిడెంట్ అయ్యాక అనేక వివాదస్పద నిర్ణయాలు తీసుకుంటూ సొంత దేశంలోనే అతి తక్కువ సమయంలోనే కొంత అసంతృప్తిని మూటకట్టుకున్న ట్రంప్ కి అంతర్జాతీయంగా రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాల మధ్య యుద్ధం తారస్థాయికి చేరకుండా ఆపిన ఘనత దక్కడంతో ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు అయింది. ఇక నోబెల్ బహుమతి విషయంలో ట్రంప్ పేరుని పరిశీలిస్తారా అంటే వేచి చూడాల్సి ఉంది.