Begin typing your search above and press return to search.

అక్రమంగా ఉన్న మనోళ్లను తీసుకొని బయలుదేరిన ఫ్లైట్

అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ ఆపరేషన్ ఇప్పుడు సాగుతోంది. సీ17 ఎయిర్ క్రాఫ్ట్ లో అమెరికా నుంచి ఇండియాకు తరలిస్తున్నారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 4:21 AM GMT
అక్రమంగా ఉన్న మనోళ్లను తీసుకొని బయలుదేరిన ఫ్లైట్
X

రెండోసారి అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న డొనాల్డ్ ట్రంప్.. తాను చెప్పిన ప్రతి మాటను అక్షరాల చేతల్లో చేసి చూపిస్తున్నాడు. అమెరికాలో తిష్ట వేసుకొని ఉన్న లక్షలాది అక్రమ వలసల్నివారి దేశాలకు పంపుతామని చెబుతున్న ఆయన.. ఆ మాటకు తగ్గట్లే తీసుకుంటున్న చర్యల గురించి తెలిసిందే. ఇప్పటికే పలు దేశాలకు తమ దేశంలో ఉన్న అక్రమ వలసల్ని ఆయా దేశాలకు పంపిన ట్రంప్.. తాజాగా భారతదేశానికి చెందిన మనోళ్లు.. అమెరికాలో అక్రమంగా ఉన్న వారిలోని కొందరిని ఒక ప్రత్యేక విమానంలో భారత్ కు పంపారు.

అమెరికా చరిత్రలోనే అతి పెద్ద బహిష్కరణ ఆపరేషన్ ఇప్పుడు సాగుతోంది. సీ17 ఎయిర్ క్రాఫ్ట్ లో అమెరికా నుంచి ఇండియాకు తరలిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో దాదాపు 125 మందికి పైనే భారతీయుల్ని తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు పైలెట్లు ఉండే ఈ విమానంలో అక్రమంగా వలస ఉన్నవారిని భారత్ కు పంపిస్తున్నారు. ఈ విమానం భారత్ కు చేరుకునేందుకు 24 గంటల సమయం పడుతుందని చెబుతున్నారు.

అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్.. తాను అధ్యక్ష బాధ్యతల్ని చేపట్టిన రోజు నుంచి అక్రమ వలసలపై చర్యల్ని ముమ్మరం చేశారు. మొదట 538 మందిని అరెస్టు చేసి.. వారి స్వదేశాలకు పంపేశారు. మరో 5 వేల మంది అక్రమ వలసదారుల్ని ఆయా దేశాలకు పంపేందుకు పెంటగాన్ సిద్ధమవుతోంది. అమెరికాలో అక్రమ వలసల్ని వారి దేశాలకు పంపేందుకు భారీగా ఖర్చు అవుతున్నా.. ఆ దేశం పట్టించుకోవటం లేదు.

అక్రమ వలసదారుల విషయంలో భారత్ స్పష్టంగా ఉండటంతో పాటు.. అక్రమ వలసలకు తాము వ్యతిరేకంగా పేర్కొన్నారు. వీసా గడువు ముగిసినా.. అనేక రకాల ఇతర ఇష్యూలతో అమెరికాలో అక్రమంగా ఉన్న వారి విషయంలో తమ దేశానికి తిరిగి వచ్చేందుకు వీలు కల్పిస్తామని భారత్ చెప్పటం తెలిసిందే. ఒక అంచనా ప్రకారం అమెరికాలో భారత్ కు చెందిన అక్రమ వలసల సంఖ్య దాదాపు 7,25,000 మంది ఉన్నట్లుగా చెబుతున్నారు. వీరిలో 18వేల మందిని భారత్ కు పంపేందుకు జాబితాను సిద్ధం చేశారని చెబుతున్నారు. అమెరికాలో అక్రమంగా ఉన్న విదేశీయుల్లో తొలుత మెక్సికో.. తర్వాత సాల్వెడార్ మూడో స్థానంలో భారతీయులే ఉన్నట్లు చెబుతున్నారు.