ఇరాన్ పై దాడి... ట్రంప్ నిర్ణయం చెప్పిన వైట్ హౌస్!
పశ్చిమసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది.
By: Tupaki Desk | 20 Jun 2025 10:52 AM ISTపశ్చిమసియాలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాల గగనతలాలు క్షిపణులు, డ్రోన్లు, యుద్ధ విమానాలతో నిండిపోతున్నాయి. ఈ సమయంలో ఈ వార్ లో యూఎస్ ఎంట్రీ ఉంటుందని అంటున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేసినట్లు వైట్ హౌస్ వెల్లడించింది.
అవును... గత రెండు రోజులుగా ఇరాన్ పైనా, ఆ దేశ సుప్రీం లీడర్ ఖమేనీ పైనా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేస్తోన్న సంగతి తెలిసిందే. అతడు ఎక్కడ ఉన్నాడో తెలుసు.. అతడ్ని అంతమొందించడం పెద్ద విషయం కాదు.. కాకపోతే ఇప్పుడు చంపాలనుకోవడం లేదంటు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బేషరతుగా లొంగిపోవాలని కోరారు.
దీనికి ఖమేనీ నుంచి స్ట్రాంగ్ కౌంటర్స్ వచ్చాయి. లొంగిపోయే ప్రసక్తే లేదని తెలిపింది. ఈ యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఇస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రివర్స్ లో వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంలోకి అమెరికా ఎంట్రీ ఉంటుందనే చర్చ బలంగా మొదలైంది. ఈ సమయంలో వైట్ హౌస్ నుంచి ఓ సమాచారం విడుదలయ్యింది.
ఇందులో భాగంగా... ఇరాన్ పై సైనిక దాడి ప్రారంభించాలా వద్దా అనే దానిపై అధ్యక్షుడు ట్రంప్ రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ గురువారం వెల్లడించింది. ఈ సందర్భంగా స్పందించిన వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్.. 'సమీప భవిష్యత్తులో ఇరాన్ తో చర్చలు జరిగే అవకాశం ఉందా లేదా అనే దాని ఆధారంగా, రాబోయే రెండు వారాల్లోపు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటాను అని ట్రంప్’ అన్నారని తెలిపారు!
ఇదే సమయంలో... ఇరాన్ తో దౌత్యపరమైన పరిష్కారానికే ప్రెసిడెంట్ ట్రంప్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. ఆ దేశం అణ్వాయుధం కలిగి ఉండకుండా నిరోధించడమే అధ్యక్షుడి తొలి ప్రాధాన్యమని ఆమె అన్నారు. అదేవిధంగా... అధ్యక్షుడు ఎల్లప్పుడూ దౌత్యపరమైన పరిష్కారం కోసమే ఆలోచిస్తారని, ఆయన ప్రధాన శాంతికర్త అని ఆమె చెప్పుకొచ్చారు.
సుమారు వారం రోజులకు పైగా జరుగుతున్న ఇజ్రాయెల్, ఇరాన్ ల మధ్య భీకర యుద్ధం నేపథ్యంలో.. వాషింగ్టన్, టెహ్రాన్ ల మధ్య మాటల దాడి పెరిగిన క్రమంలో వైట్ హౌస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది!
