కాంగ్రెస్ గ్యారంటీలపై 'ట్రంప్' కన్ను !
‘కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశంలోని మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో మాత్రమే కాదు.
By: Garuda Media | 16 Sept 2026 9:20 AM IST‘కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దేశంలోని మహారాష్ట్ర, రాజస్థాన్, బీహార్ రాష్ట్రాలలో మాత్రమే కాదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కాపీ కొడుతున్నాడని’ కర్ణాటక ముఖ్యమంత్రి డీకె శివకుమార్ అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ గ్యారంటీ పథకాలు ఇతర రాష్ట్రాలకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయి. మా ఆలోచనలు భారత్ లోనే కాకుండా ప్రపంచం అంతా తెలుస్తున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ బలం అని అన్నారు.
2026 మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లు హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్ రెండింటిలో గెలిస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి అమెరికన్ పౌరుడికి 5 వేల డాలర్లు ట్రంప్ డివిడెండ్ ఇస్తానని ఇటీవల టెక్సాస్ లో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ డల్లాస్‌లో రిపబ్లికన్ మిడ్‌టర్మ్ కన్వెన్షన్‌లో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమ పథకాలను అమెరికా కూడా కాపీ కొడుతుందని కర్ణాటక సీఎం డీకె శివకుమార్ ప్రకటించడం గమనార్హం.
గత ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారంటీలు ఇచ్చి ప్రజలను ఆకట్టుకుని అధికారంలోకి వచ్చింది. సిద్దరామయ్య మూడేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనంతరం ఇటీవల ఆయనను మార్చి ఆయన స్థానంలో డీకే శివకుమార్ కు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు అప్పగించింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటకలో గృహాలక్ష్మి పథకం కింద 1.24 కోట్ల మంది మహిళలకు రూ.2 వేల చొప్పున నెలకు రూ.2,400 కోట్లు వారి ఖాతాలలో జమచేస్తుంది.
గృహాజ్యోతి పథకం కింద 1.64 కోట్ల ఇండ్లకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తున్నది. అన్నభాగ్య పథకం కింద 5 కిలోల బియ్యం, శక్తి పథకం కింద మహిళలకు ప్రభుత్వ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నది. దీంతో పాటు నిరుద్యోగులలో గ్రాడ్యుయేట్లకు రూ.3 వేలు, డిప్లొమా హోల్డర్లకు రూ.1500 యువనిధి పథకం కింద రెండేళ్ల పాటు సాయం అందిస్తుంది. ఈ పథకాలనే సీఎం శివకుమార్ ట్రంప్ ప్రతిపాదనతో పోల్చి కాపీ కొడుతున్నట్లు చెబుతున్నారు.
అయితే పథకాల అమలు వల్ల ప్రభుత్వం మీద ఆర్థిక వత్తిడి పెరిగిందని, ఇది అభివృద్ధి పనులపై ప్రభావం చూపుతుందని విమర్శలు వస్తున్నాయి. రోడ్లు, ఇతర ప్రాజెక్టుల పనులు మందగించాయని, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆలస్యం అవుతుందని అంటున్నారు. ఇది రాష్ట్రం దివాళా తీసే స్థితికి తీసుకువస్తుందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ ఆరోపిస్తుంది. కానీ ప్రభుత్వ పథకాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చేయూత ఇస్తున్నాయని కాంగ్రెస్ వాదిస్తున్నది.
