జెలెన్ స్కీ-పుతిన్... నూనె-వెనిగర్.. కలపలేం: ట్రంప్
ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా అధ్యక్షులు జెలెన్ స్కీ-పుతిన్ లను ఇదే విధంగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.
By: Tupaki Desk | 23 Aug 2025 4:00 PM ISTప్రాణ స్నేహితులను పాలు-నీళ్లతో పోల్చుతాం... వీరిని ఎంతకూ విడదీయలేం. అలాగే ఇద్దరు బద్ద శత్రువులను ఉప్పు-నిప్పుతో పోల్చుతాం.. వీరిని అసలు కలపడం సాధ్యం కాదని అర్థం. ఇప్పుడు ఉక్రెయిన్-రష్యా అధ్యక్షులు జెలెన్ స్కీ-పుతిన్ లను ఇదే విధంగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఔను మరి.. ఆ రెండు దేశాల మధ్య మూడున్నరేళ్లుగా యుద్ధం సాగుతోంది. ఈ సమయంలో ప్రపంచమంతా ఎంతోకొంత మారింది...! కానీ, పుతిన్-జెలెన్ స్కీల మధ్య వైరం మాత్రం ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు.
యుద్ధం ప్రారంభంలోనే..
2022 ఫిబ్రవరిలో మొదలైంది రష్యా-ఉక్రెయిన్ యుద్ధం. పుతిన్-జెలెన్ స్కీ భేటీ అవుతారంటూ అప్పట్లోనే పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. తటస్థ దేశం దీనికి వేదిక అవుతుందని భావించారు. కానీ, అలాంటిదేమీ లేదు. ఇప్పుడు ట్రంప్.. ఆ ఇద్దరు బద్ధ విరోధులను కలవడం అంటే సాధ్యం కాదనే అర్థం వచ్చేలా మాట్లాడారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రయత్నాలపై రెండు వారాల్లో ముఖ్య నిర్ణయం తీసుకుంటామని, కానీ, పుతిన్-జెలెన్ స్కీ సమావేశం నూనె-వెనిగర్ లను కలపడం అంత కష్టమని వ్యాఖ్యానించారు.
యుద్ధం ముగిస్తారా? మా ఫ్యాక్టరీపై దాడి చేస్తారా...?
యుద్ధం ముగింపులో పుతిన్-జెలెన్ స్కీ కలిసి పనిచేస్తారా? అన్నది తనకు స్పష్టత లేదని... మున్ముందు వారి మధ్య సమావేశానికి తాను హాజరవుతానో లేదోనని ట్రంప్ పేర్కొన్నారు. కాగా, తాజాగా రష్యా డ్రోన్లతో పెద్దఎత్తున ఉక్రెయిన్ పై విరుచుకుపడింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన ఫ్యాక్టరీ దెబ్బతిన్నది. దీనిపై ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు రష్యాపై భారీ ఆంక్షలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను యుద్ధం ముగించాలని చూస్తుంటే.. పుతిన్ మాత్రం భిన్నంగా వెళ్తున్నారని అన్నారు.
రెండు వారాల సమయంలో...
మూడున్నరేళ్ల యుద్ధం ముగింపుపై పుతిన్-జెలెన్ స్కీ ఏమనుకుంటున్నారనేది స్పష్టత రావడానికి తనకు రెండు వారాలు పడుతుందని ట్రంప్ అన్నారు. వారిద్దరూ ఓ ఒప్పందం చేసుకోకుంటే తానే నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. అది భారీ ఆంక్షలా? సుంకాలా? ఒకవేళ రెండూ కావొచ్చన్నారు. కాగా, ట్రంప్.. ఇప్పటికే పుతిన్ తో అలస్కాలో సమావేశం అయ్యారు. యూరోప్ దేశాల అధినేతలతో కలిసి జెలెన్ స్కీతో కూడా భేటీ అయ్యారు. ఇక మిగిలింది పుతిన్-జెలెన్ స్కీలను కూర్చోబెట్టడమే. ఆ పని చేస్తున్నామని ప్రకటించారు. త్రైపాక్షిక సమావేశానికి తాము సిద్ధమేనని జెలెన్ స్కీ చెప్పారు.
