ఇరాన్ సైన్యం పూర్తిగా ఛిద్రమైంది.. మధ్యప్రాచ్య బుల్లీ ముగిసిందన్న ట్రంప్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
By: A.N.Kumar | 10 Jun 2026 11:56 PM ISTమధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ జె. ట్రంప్ ఇరాన్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సైనిక శక్తి దాదాపు పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆ దేశం ఇకపై ప్రాంతీయంగా బెదిరింపులకు పాల్పడే పరిస్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్' ద్వారా ట్రంప్ ఈ ఘాటు ప్రకటన విడుదల చేశారు.
నిర్వీర్యమైన నౌకాదళం, వైమానిక దళం
ట్రంప్ తన ప్రకటనలో ఇరాన్ రక్షణ విభాగాల ప్రస్తుత స్థితిని తీవ్రంగా ఎండగట్టారు. "ఇరాన్ సైన్యం ప్రస్తుతం ఒక అస్తవ్యస్తమైన ముఠాగా మారింది. వారి నౌకాదళం, వైమానిక దళం వంటి కీలక విభాగాలు ఇప్పుడు ఉనికిలోనే లేవు. వారు పూర్తిగా ఓడిపోయారు" అని ట్రంప్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఇరాన్ నాయకత్వంపై విరుచుకుపడుతూ.. "ఇరాన్ కేవలం మాటలకే పరిమితం, చేతల్లో శూన్యం. ఇన్నాళ్లూ మధ్యప్రాచ్యాన్ని భయపెట్టిన ఆ 'బుల్లీ' రౌడీయిజం ఇక ముగిసిపోయింది!" అని వ్యాఖ్యానించారు. అమెరికా వైమానిక దళాలు ఇటీవల ఇరాన్ రక్షణ స్థావరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
అవకాశాన్ని జారవిడుచుకున్నారు.. భారీ మూల్యం తప్పదు
రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు, అణు ఒప్పందాల అంశాన్ని ప్రస్తావిస్తూ ఇరాన్ తీసుకున్న ఆలస్య నిర్ణయాలే దానికి ఈ గతి పట్టించాయని ట్రంప్ విమర్శించారు. గతంలో తాము ప్రతిపాదించిన ఒప్పందం ఇరాన్‌కు ఎంతో ప్రయోజనకరంగా ఉండేదని దానికి వారు అంగీకరించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని గుర్తుచేశారు. చర్చల పేరుతో ఇరాన్ ఎక్కువ సమయం వృథా చేసిందని, ఇప్పుడు దానికి ఆ దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని హెచ్చరించారు. "మేము వారికి ఒక గొప్ప అవకాశం ఇచ్చాం.. కానీ వారు ఆలస్యం చేశారు. ఇప్పుడు దాని పర్యవసానాలను అనుభవించాల్సిందే" అని హెచ్చరించారు.
అంతర్జాతీయ రాజకీయాల్లో తీవ్ర కలకలం
అమెరికా హెలికాప్టర్‌ను కూల్చివేయడానికి ప్రతిచర్యగా యుఎస్ బలగాలు ఇరాన్ సరిహద్దుల్లోని రాడార్, వైమానిక రక్షణ వ్యవస్థలపై విరుచుకుపడిన మరుసటి రోజే ట్రంప్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ పరిణామాలు గల్ఫ్ రీజియన్‌లో శాంతి భద్రతలను మరింత ప్రమాదంలోకి నెట్టేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనే దానిపై ప్రపంచ దేశాల నిఘా వర్గాలు నిశితంగా గమనిస్తున్నాయి.
