మొజ్తబా కూడా చనిపోయాడు: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇక, ఇరాన్‌కు కొత్త నాయకుడు ఎవరు అన్న ప్రశ్న తెరమీదికి వచ్చినప్పుడు.. అయతొల్లా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా పేరు బయటకు వచ్చింది.
By: Garuda Media | 28 March 2026 6:39 PM ISTఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం చేస్తున్న అమెరికా.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని గత నెల 28నే దాడులతో చంపేసిన విషయం తెలిసిందే. ఇక, ఆ తర్వాత.. కీలక నాయకులు సహా.. దేశాన్ని నడిపించే సైనిక నేతలు కూడా అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో కన్నుమూశారు. ఇక, ఇరాన్‌కు కొత్త నాయకుడు ఎవరు అన్న ప్రశ్న తెరమీదికి వచ్చినప్పుడు.. అయతొల్లా ఖమేనీ రెండో కుమారుడు మొజ్తబా పేరు బయటకు వచ్చింది.
ఆయన అధికార పగ్గాలు తీసుకున్నారని.. పాలన సాగిస్తున్నారని ఇరాన్ చెబుతున్నా.. ఆయన ఎక్కడా బయటకు రాలేదు. అధికారికంగా కూడా ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. అంతేకాదు.. ఆయన పేరు, సంతకంతో కూడిన ప్రకటన కూడా వెలుగు చూడలేదు. దీంతో ప్రపంచం యావత్తు మొజ్తబా ఖమేనీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే.. ఈ వ్యవహారంపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారని.. ప్రస్తుతం కోమాలో ఉన్నారని చెప్పారు.
అంతర్జాతీయ మీడియా కూడా ఖమేనీ గాయపడ్డారని.. బ్రిటన్‌లో చికిత్స తీసుకుంటున్నారని చెప్పాయి. అయితే.. ఇరాన్ మాత్రం ఈ విషయంలో ఆచి తూచి వ్యవహరించింది. తామంతా.. మొజ్తబా ఖమేనీ నాయకత్వంలోనే పనిచేస్తున్నామన్నామని ఇరాన్ అధికారులు పేర్కొన్నారు. ఇలా.. మొజ్తబా ఖమేనీ వ్యవహారంపై అనేక సందేహాలు.. నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో అనూహ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ చనిపోయారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్ ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. గత నెల 28న జరిపిన దాడుల్లోనే మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని.. ఇటీవలే ఆయన కన్నుమూశారని (హీ డెడ్ రీసెంట్లీ) అని తెలిపారు. దీంతో ఇరాన్ ప్రస్తుతం తీవ్రమైన నాయకత్వ సంక్షోభంలో ఉందన్నారు.
అంతేకాదు., అక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అయితే.. దీనికి కూడా ఆయన ఆధారాలు చూపించలేదు. కానీ, ట్రంప్ వంటి నాయకుడు ప్రకటించారంటే అది వాస్తవమే అయి ఉంటుందని అమెరికా మీడియా పేర్కొంటోంది. ఇరాన్ దీనిపై ఇంకా మౌనం వీడలేదు.
