అసలే చైనా.. అందుకే అన్నీ చెత్తబుట్టలో వేసి అమెరికాకు వచ్చిన ట్రంప్!
అంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేపుతుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగింపులో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది.
By: A.N.Kumar | 16 May 2026 11:15 PM ISTఅంతర్జాతీయ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం రేపుతుండే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన ముగింపులో ఒక ఆసక్తికరమైన ఘట్టం చోటుచేసుకుంది. బీజింగ్‌లో మూడు రోజుల పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఎంతో స్నేహపూర్వకంగా చర్చలు జరిపిన ట్రంప్ బృందం.. తిరుగు ప్రయాణమయ్యే సమయంలో తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది.
“చైనా నుంచి ఏ వస్తువూ విమానంలోకి రాకూడదు!”
ట్రంప్ బృందం తిరుగు ప్రయాణానికి సిద్ధమై ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానం ఎక్కుతున్న సమయంలో అమెరికా భద్రతా సిబ్బంది మైక్ ద్వారా స్పష్టమైన, కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. చైనాకు సంబంధించిన ఏ వస్తువునూ విమానంలోకి అనుమతించవద్దు అంటూ ప్రకటించారు. అంతేకాదు చైనా పర్యటనలో అక్కడ అధికారికంగా వైట్‌హౌస్ సిబ్బందికి, ప్రతినిధులకు అందించిన వస్తువులన్నింటినీ భద్రతా సిబ్బంది అక్కడికక్కడే సేకరించారు. అనంతరం వాటిని ఎయిర్‌పోర్టులోనే ఏర్పాటు చేసిన చెత్తబుట్టల్లో పడేసినట్టు తెలుస్తోంది.
చెత్తబుట్టలోకి చేరిన వస్తువులు ఇవేనా?
అమెరికా మీడియా కథనాల ప్రకారం.. చెత్తబుట్టలో వేసిన వస్తువుల జాబితాలో ఇవి ఉన్నాయి. చైనా అధికారులు ఇచ్చిన అధికారిక ప్రెస్ పాస్‌లు.. ప్రతినిధుల గుర్తింపు బ్యాడ్జీలు.. వైట్‌హౌస్ సిబ్బందికి చైనాలో వాడటం కోసం అందించిన తాత్కాలిక ‘బర్నర్ ఫోన్లు’ , గుర్తింపు పిన్లు పడవేశారు.“చైనా అధికారులు ఇచ్చిన ప్రతిదాన్ని అమెరికా సిబ్బంది సేకరించి, ఎయిర్‌ఫోర్స్ వన్ ఎక్కే ముందు చెత్తబుట్టలో వేసేశారు. చైనాలో ఇచ్చిన ఏ వస్తువూ విమానంలోకి తీసుకెళ్లకూడదని స్పష్టం చేశారు.” అని ఎమిలీ గూడిన్ అనే న్యూయార్క్ పోస్ట్ ప్రతినిధి తెలిపారు.
ట్రంప్‌కు ఇచ్చిన కానుకల పరిస్థితి ఏంటి?
ఈ ఘటనలో అందరినీ ఆకర్షిస్తున్న మరో ముఖ్యమైన అంశం.. ట్రంప్‌కు చైనా ప్రభుత్వం ఇచ్చిన అధికారిక కానుకల పరిస్థితి ఏంటనేది. సాధారణంగా దేశాధినేతలకు ఇచ్చే బహుమతులను నేరుగా విమానంలోకి తీసుకెళ్లనివ్వరు. వాటిని ప్రత్యేక భద్రతా తనిఖీల కోసం పంపుతారు లేదా నిబంధనల ప్రకారం భద్రపరుస్తారు. అయితే ఈ కానుకలను కూడా మిగతా వస్తువుల్లాగే పక్కన పెట్టేశారా లేదా అనేదానిపై ఇంకా పూర్తి స్పష్టత రాలేదు.
స్పైవేర్ భయమే కారణమా?
అధికారికంగా అందించిన వస్తువులను ఇలా బహిరంగంగా చెత్తబుట్టలో వేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గూఢచర్య భయాలే దీనికి ప్రధాన కారణం.
చైనా నుంచి అందించిన ఎలక్ట్రానిక్ వస్తువులు, గుర్తింపు కార్డులు లేదా బ్యాడ్జీలలో రహస్య సర్వైలెన్స్ పరికరాలు, మైక్రో చిప్‌లు లేదా స్పైవేర్ ః ఉండే ప్రమాదం ఉందని అమెరికా భద్రతా సంస్థలు అనుమానించినట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా అమెరికా-చైనా మధ్య సాంకేతిక యుద్ధం , సైబర్ దాడుల ఆరోపణలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో అమెరికా సీక్రెట్ సర్వీస్ ఈ స్థాయి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది.
పర్యటనలో తెరవెనుక ఉద్రిక్తతలు
పైకి ట్రంప్, షీ జిన్‌పింగ్‌ల సమావేశాలు సానుకూల వాతావరణంలో సాగినట్లు కనిపించినా తెరవెనుక ఇరు దేశాల భద్రతా బృందాలు, ప్రెస్ సిబ్బంది మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
ఒబామా కాలం నుంచే కొనసాగుతున్న సంప్రదాయం!
అమెరికా అధ్యక్షుల చైనా పర్యటనల్లో ఇలాంటి భద్రతా ఉద్రిక్తతలు కొత్తేమీ కాదు. 2016లో బరాక్ ఒబామా హాంగ్‌జౌలో జరిగిన G20 సదస్సుకు హాజరైనప్పుడు కూడా అమెరికా-చైనా సిబ్బంది మధ్య ఎయిర్‌పోర్టు రన్‌వేపైనే వాగ్వాదం జరిగింది. ఆ సమయంలో ఓ చైనా అధికారి అమెరికా ప్రతినిధులతో “ఇది మా దేశం.. మా విమానాశ్రయం” అంటూ ఘాటుగా మాట్లాడిన వీడియో అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది.
ఏది ఏమైనా చైనా ఇచ్చిన వస్తువులను విమానం ఎక్కేముందే చెత్తబుట్టలో పారేయడం ద్వారా అమెరికా తన భద్రత విషయంలో ఎంత కఠినంగా ఉంటుందనే విషయాన్ని చైనాపై ఉన్న నమ్మకరాహిత్యాన్ని మరోసారి స్పష్టం చేసింది.
