బ్రెజిల్ 'చక్రవర్తి' మాటలకు ట్రంప్ స్ట్రోక్ తగిలేసింది!
ఇటీవల 14 దేశాలకు ట్రంప్ టారిఫ్ లేఖలు రాసిన ట్రంప్... ఆయా దేశాలపై 25% నుంచి మొదలై 40% వరకూ టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు.
By: Tupaki Desk | 10 July 2025 12:20 PM ISTఇటీవల 14 దేశాలకు ట్రంప్ టారిఫ్ లేఖలు రాసిన ట్రంప్... ఆయా దేశాలపై 25% నుంచి మొదలై 40% వరకూ టారిఫ్ లు విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే 'బ్రిక్స్' అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరించారు. దీనిపై స్పందించిన బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా స్పందిస్తూ.. ట్రంప్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో.. బ్రెజిల్ కు ట్రంప్ తనదైన స్ట్రోక్ ఇచ్చేశారు.
అవును... అమెరికా విధానాలకు వ్యతిరేకంగా వ్యవహరించే 'బ్రిక్స్' అనుకూల దేశాలపై అదనంగా 10 శాతం సుంకం విధిస్తానంటూ ట్రంప్ హెచ్చరికలపై స్పందించిన లూలా డిసిల్వా... ప్రపంచం మునుపటిలా లేదు. అందువల్ల మనకు చక్రవర్తి అవసరం లేదు. మన దేశాలు సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్నాయి. ట్రంప్ సుంకాలను జారీ చేస్తే.. ఇతర దేశాలకు అదే చేసే హక్కు ఉందని అన్నారు. దీంతో.. ట్రంప్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.
ఇందులో భాగంగా... బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ను ప్రస్తుత అధ్యక్షుడు లూలా డిసిల్వా వేధిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. స్వేచ్ఛా ఎన్నికలపై బ్రెజిల్ దాడులు చేస్తోందని ఆరోపిస్తూ.. దీనికి ప్రతీకారం తీర్చుకుంటే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. ఈ కారణంతో ఆ దేశంపై 50 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని ట్రంప్ తెలిపారు.
ఈ సందర్భంగా లూలాను ఉద్దేశించి రాసిన లేఖలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... బోల్సోనారోపై దేశం అనుసరిస్తున్న విధానాన్ని తప్పు పట్టారు. ఆయనపై జరుగుతున్న విచారణ కూడా ఆపేయాలని అన్నారు. బ్రెజిల్ వాణిజ్య విధానాలపై అమెరికా దర్యాప్తు ప్రారంభించనున్నట్లు తెలిపారు. మరోవైపు.. బోల్సోనారోకు మద్దతుగా బ్రెజిల్ లోని అమెరికా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
ఇందులో భాగంగా... బోల్సోనారో, ఆయన కుటుంబసభ్యులు వాషింగ్టన్ కు బలమైన భాగస్వాములని పేర్కొంటూ.. వారిపై, ఆయన అనుచరులపై జరుగుతున్న రాజకీయ హింస సిగ్గు చేటని.. ప్రజాస్వామ్య సంప్రదాయాలను అగౌరవపరచడమేనని విమర్శించింది. ఇలా ట్రంప్ రాసిన లేఖ, తమదేశంలోని అమెరికా రాయబార కార్యాలయం రాసిన లేఖలపై బ్రెజిల్ ఘాటుగా స్పందించింది.
ఇందులో భాగంగా... ఏకపక్షంగా టారిఫ్ లను పెంచిన చర్యను ఆర్థికచట్టాలకు అనుగుణంగా ఎదుర్కొంటామని లూలా 'ఎక్స్' వేదికగా స్పందించారు. మరోవైపు రాయబార కార్యాలయం రాసిన లేఖను బ్రెజిల్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో... ఈ ప్రకటనపై విచారణకు రావాలని అమెరికా రాయబారిని ఆదేశించింది. ఈ తాజా పరిస్థితులు ఎలాంటి పరిణామలకు దారి తీస్తాయనేది వేచి చూడాలి!
