Begin typing your search above and press return to search.

యూఎస్ సుప్రీంకోర్టులో ట్రంప్ కు ఇది భారీ విజయం!

అయితే... జన్మతః పౌరసత్వం (బర్త్ రైట్ సిటిజన్ షిప్) ను రద్దు చేస్తూ గతంలో ట్రంప్‌ జారీచేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు.

By:  Tupaki Desk   |   28 Jun 2025 9:15 AM IST
యూఎస్  సుప్రీంకోర్టులో ట్రంప్  కు ఇది భారీ విజయం!
X

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా వలసదారులపై పలు ఆంక్షలు విధిస్తూ సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్రమంలో ప్రధానంగా జన్మతః పౌరసత్వం (బర్త్ రైట్ సిటిజన్ షిప్)ను రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. ఇది తీవ్ర సంచలనంగా మారింది.

ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై రకరకాల ఆందోళనలు నెలకొన్నాయి! ఆ సమయంలో.. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ని వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలు కావడంతో కోర్టులు ఇంజక్షన్‌ ఆర్డర్లు జారీ చేశాయి. దీనిపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... తన ఆదేశాలను న్యాయస్థానాలు నిలిపివేయడాన్ని సవాల్‌ చేస్తూ అక్కడి సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

ఇందులో భాగంగా.. ఎగ్జిక్యూటివ్‌ విభాగాన్ని రాజ్యాంగపరమైన విధులు నిర్వహించకుండా ఇవి అడ్డుకుంటున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ పిటిషన్ పై విచారణ చేపట్టిన అమెరికా సుప్రీంకోర్టు.. ఆ దేశ న్యాయశాఖ వాదనతో ఏకీభవించింది. ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ లను నిలిపివేసి జాతీయ స్థాయిలో ప్రభావితం చూపే అధికారం వ్యక్తిగత న్యాయమూర్తులకు లేదని స్పష్టం చేసింది.

అయితే... జన్మతః పౌరసత్వం (బర్త్ రైట్ సిటిజన్ షిప్) ను రద్దు చేస్తూ గతంలో ట్రంప్‌ జారీచేసిన ఆదేశాల చట్టబద్ధతపై మాత్రం న్యాయస్థానం స్పష్టత ఇవ్వలేదు. ఏది ఏమైనా... అమెరికా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ట్రంప్ కు భారీ విజయంగానే అభివర్ణిస్తున్నారు.

కాగా... అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన వారికి మాత్రమే కాకుండా.. ఆ దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ అక్కడి పౌరసత్వం లభిస్తుంది. దీనినే బర్త్ రైట్ సిటిజన్ షిప్ అంటారు. అమెరికా గడ్డపై పుట్టినవారంతా ఈ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది.

ఈ క్రమంలో... అమెరికా, కెనడా, మెక్సికో సహా 30కిపైగా దేశాల జన్మతః పౌరసత్వాన్ని కల్పిస్తున్నాయి. అయితే, 1868 నుంచి ఇప్పటివరకు ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగినప్పటికీ.. రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం డొనాల్డ్ ట్రంప్‌ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్ తో దానికి బ్రేక్‌ పడింది. వాట్ నెక్స్ట్ అనేది వేచి చూడాలి!