3 రోజులు.. 6 షరతులు.. హార్వర్డ్ వర్సిటీ పై ట్రంప్ షాకింగ్ నిర్ణయం!
రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ విదేశీ ఉద్యోగులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులను టార్గెట్ చేసి పాలన సాగిస్తున్నారు ట్రంప్!
By: Tupaki Desk | 23 May 2025 11:16 AM ISTహార్వర్డ్ యూనివర్శిటీ అంతర్జాతీయ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని నిషేధిస్తూ ట్రంప్ సర్కార్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకొంది. యూనివర్సిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కొనసాగిస్తోన్న దర్యాప్తులో భాగంగా ఈ నిర్ణయమని తెలిపింది. దీంతో.. ఈ నిర్ణయం ఇక్కడ అడ్మిషన్స్ పొందిన భారతీయులతో సహా విదేశీ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
అవును... రెండోసారి ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ విదేశీ ఉద్యోగులతో పాటు అంతర్జాతీయ విద్యార్థులను టార్గెట్ చేసి పాలన సాగిస్తున్నారు ట్రంప్! ఇప్పటికే చదువుకుంటూ పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే విదేశీయులైన మధ్యతరగతి విద్యార్థులను టార్గెట్ చేసి, బహిష్కరణ నిర్ణయాల వరకూ వెళ్లిన ట్రంప్.. తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ విషయంలో ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఇందులో భాగంగా.. ఈ వర్సిటీలో విదేశీ విద్యార్థులను చేర్చుకోవడానికి ఉన్న అనుమతిని రద్దు చేశారు! ఈ మేరకు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్.. వర్సిటీకి లేఖ పంపారు. దీంతో... హార్వర్డ్స్ లో అడ్మిషన్స్ పొందిన భారతీయులు సహా, విదేశీ విద్యార్థులు మరో వర్సిటీకి బదిలీకావాల్సి ఉంటుంది. అలాకానిపక్షంలో.. అమెరికాలో చట్టపరమైన హోదా కోల్పోయే ప్రమాదం ఉంది.
వేల మంది విద్యార్థులపై తీవ్ర ప్రభావం!:
అగ్రరాజ్యం అనే అహంకారంతో తీసుకున్నారా.. లేక, తీసుకుంటున్న ప్రతీ నిర్ణయానికీ ‘అమెరికా ఫస్ట్’ అనే ట్యాగ్ లైన్ తగిలిస్తూ తనను తాను స్థానికంగా సమర్థించుకునే ప్రక్రియలో భాగంగా ఈ ఆలోచన చేశారా అనే సంగతి అలా ఉంచితే... ట్రంప్ సర్కార్ తాజా నిర్ణయంతో వేలాది మంది విదేశీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
ప్రస్తుత ఏడాది హార్వర్డ్స్ లో 6,800 మంది విదేశీ విద్యార్థులు నమోదు చేసుకున్నారు. అంటే.. యూనివర్శిటీలోని మొత్తం విద్యార్థుల్లో ఈ సంఖ్య 27%. వీరిలో ఎక్కువమంది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. ఇక వీరిలో భారతీయ విద్యార్థుల సంఖ్య 788 అని హార్వర్డ్స్ వెబ్ స్టైట్ ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో.. ట్రంప్ తాజా నిర్ణయంతో వీరి భవితవ్యం గందరగోళంలో పడింది!
అంటే.. ఈ సెమిస్టర్ తో డిగ్రీలు పూర్తి చేసిన విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేట్ గా బయటకు రావాల్సి ఉండటంతో పాటు... చదువు మధ్యలో ఉన్నవారు అయితే తప్పనిసరిగా మరో ఇనిస్టిట్యూట్ కు మారాల్సి ఉంటుంది. లేదంటే.. ట్రంప్ రూల్స్ ప్రకారం వారు అమెరికాలో చట్ట్పరమైన హోదాను కోల్పోయే ప్రమాదం ఉంది!
3 రోజులు.. 6 షరతులు:
తాజాగా హార్వర్డ్స్ కు డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ రాసిన లేఖలో.. ఈ హోదాను పునరుద్ధరించుకునేందుకు ఓ అవకాశం కల్పించారు! దీనికోసం 72 గంటల వ్యవధిలో అడిగిన సమాచారాన్ని అందించాలని పేర్కొన్నారు. అవేమిటనేవి ఇప్పుడు చూద్దామ్..!
* గత ఐదేళ్లలో హార్వర్డ్స్ లో చదువుతున్న విద్యార్థుల్లో క్యాంపస్ లోపల.. లేదా, వెలుపల జరిపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు సమర్పించాలి.
* గత ఐదేళ్లలో నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ పాల్పడిన హింసాత్మక చర్యలకు సంబంధించిన రికార్డులను అందించాలి.
* ఇదే సమయంలో... ఇతర విద్యార్థులు లేదా యూనివర్సిటీ సిబ్బందిని ఎవరైనా నాన్ ఇమిగ్రెంట్ స్టూడెంట్స్ బెదిరించి ఉంటే.. ఆ వివరాలు ఇవ్వాలి.
* వలసేతర విద్యార్థులు క్యాంపస్ లో కానీ బయట కానీ ఇతర హక్కులను హరించిన ఘటనలు చోటు చేసుకుంటే ఆ రికార్డులూ అందించాలి.
* గత ఐదేళ్లలో ఈ యూనివర్సిటీలోని వలసేతర విద్యార్థుల క్రమశిక్షణ రికార్డులను సమర్పించాలి.
* హార్వర్డ్స్ లోని వలసేతర విద్యార్థులు ఏదైనా ఆందోళనల్లో పాల్గొంటే.. ఆ ఆడియో, వీడియో ఫుటేజ్ లను ప్రభుత్వానికి సమర్పించాలి.
స్పందించిన యూనివర్సిటీ!:
ట్రంప్ సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంపై యూనివర్సిటీ స్పందించింది. ఇది ప్రభుత్వం తీసుకున్న చట్టవిరుద్ధ చర్య అని అభివర్ణించింది. 140 కంటే ఎక్కువ దేశాల నుంచి వచ్చిన అంతర్జాతీయ విద్యార్థులు, ప్రొఫెసర్లకు ఆతిథ్యం ఇచ్చే హార్వర్డ్స్ సామర్థ్యాన్ని కొనసాగించడానికి తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని.. యూనివర్సిటీని అపరిమితంగా సుసంపన్నం చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది.
