జోహ్రాన్ మమ్దానీ పౌరసత్వం రద్దు దిశగా ట్రంప్?
అమెరికా రాజకీయాల్లో మళ్లీ ఒక కొత్త సంచలనం చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 3 July 2025 10:06 AM ISTఅమెరికా రాజకీయాల్లో మళ్లీ ఒక కొత్త సంచలనం చోటు చేసుకుంది. న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో భారత సంతతికి చెందిన జోహ్రాన్ మమ్దానీ విజయం దాదాపు ఖరారవుతుందని అంచనా వేస్తున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ఈ రాడికల్ కమ్యూనిస్టును (కమ్యూనిస్టును) మేము సహించము. ఇతను న్యూయార్క్‌ను నాశనం చేయాలనుకుంటున్నాడు. నేను అమెరికా అధ్యక్షుడిగా ఉండగా అలాంటి అవకాశం ఇవ్వను" అని ట్రంప్ హెచ్చరించారు. అంతేకాకుండా మమ్దానీ పౌరసత్వాన్ని రద్దు చేయాలనే ప్రయత్నాన్ని కూడా ఆయన పరోక్షంగా ప్రస్తావించారు.
-మమ్దానీ ఎవరు?
33 ఏళ్ల జోహ్రాన్ మమ్దానీ రాజకీయాల్లో వేగంగా ఎదుగుతున్న యువ నాయకుడు. ఆయన ఉగాండా రాజధాని కంపాలాలో జన్మించారు. ఏడేళ్ల వయసులో అమెరికాకు వలస వచ్చి 2018లో అమెరికా పౌరసత్వం పొందారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్న మమ్దానీకి న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికయ్యే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.
-ట్రంప్ హెచ్చరికలు
ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో "ఈ కమ్యూనిస్టు పిచ్చివాడిని మేము సహించము. ఇతను న్యూయార్క్‌ను నాశనం చేయాలనుకుంటున్నాడు. నేను అన్ని వ్యవస్థల నియంత్రణలో ఉన్నాను. ఈ న్యూయార్క్‌ను మళ్లీ 'హాట్'గా, గొప్పగా మార్చుతాను!" అని పోస్ట్ చేశారు. అంతేకాకుండా మమ్దానీ అమెరికా పౌరసత్వాన్ని రద్దు చేయాలన్నది ఆయన వ్యాఖ్యల్లో ప్రధానాంశం. మమ్దానీని అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందని ట్రంప్ పరోక్షంగా పేర్కొన్నారు.
-ట్రంప్‌కు ఈ అధికారం ఉందా?
ఒకసారి అమెరికా పౌరసత్వం లభించిన తర్వాత దాన్ని రద్దు చేయడం చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఇది ప్రధానంగా న్యాయవ్యవస్థ ఆధీనంలో ఉంటుంది. మమ్దానీ లాంటి నేచురలైజ్డ్ సిటీజన్ పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే, జాతీయ భద్రతను నష్టపరిచే చర్యల్లో నేరుగా పాల్గొన్నట్టు నిరూపణ అవసరం. కేవలం ఒక నాయకుడిపై అభిప్రాయ భేదం వల్ల పౌరసత్వాన్ని రద్దు చేయడం సాధ్యం కాదు.
-రాజకీయ ప్రేరణలేనా?
ట్రంప్ మమ్దానీపై చేస్తున్న వ్యాఖ్యలు ఆయన వలస విధానాలకు వ్యతిరేకంగా ఉన్న నాయకులను లక్ష్యంగా చేసుకున్న కుట్రగా విమర్శకులు భావిస్తున్నారు. మమ్దానీ ప్రస్తుత స్థితిలో ఒక అభివృద్ధిశీల, యువ నాయకుడిగా ఉన్నారు. న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైతే వలసదారుల హక్కుల కోసం మరింత పోరాటం చేస్తారన్న అభిప్రాయంతో ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారన్న మాట.
మమ్దానీ పౌరసత్వం రద్దు చేయడం అనేది న్యాయపరంగా చాలా కష్టమైన పని. ఇది పూర్తిగా కోర్టుల అధీనంలో ఉంటుంది. ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొంత మైనస్ పాయింట్లను సృష్టించవచ్చు కానీ, చట్టపరంగా వాటికి ఆధారం ఉండదు. అయితే, ఇది మమ్దానీకి మద్దతుగా ఉన్నవారిలో ఆందోళన కలిగిస్తుంది. ఇదే విషయంలో రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాల్లో మరో కొత్త మలుపు రావచ్చు.