Begin typing your search above and press return to search.

ట్రంప్ వార్నింగ్ కు భయపడ్డ మస్క్.. వెనక్కి తగ్గినట్టేనా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య కొనసాగుతున్న వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది.

By:  Tupaki Desk   |   2 July 2025 10:28 AM IST
ట్రంప్ వార్నింగ్ కు భయపడ్డ మస్క్.. వెనక్కి తగ్గినట్టేనా?
X

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య కొనసాగుతున్న వాగ్వాదం కొత్త మలుపు తిరిగింది. ఇటీవల ట్రంప్ చేసిన తీవ్ర వ్యాఖ్యల పట్ల మస్క్ ఎలా స్పందిస్తారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆయన స్పందన కొంత ఆశ్చర్యాన్ని కలిగించింది.

-ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు

ట్రంప్ ఇటీవల ఒక ప్రకటనలో మస్క్ లాంటి వ్యక్తులు ప్రభుత్వ రాయితీల ద్వారానే మనుగడ సాగిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "ప్రపంచంలో ఎవరూ పొందని ప్రోత్సాహకాలు ఇతగాడికి దక్కాయి. ఇవి నిలిపేస్తే ఇతని వ్యాపార సామ్రాజ్యం కూలిపోతుంది" అని ఆయన అన్నారు. అంతేకాదు "మస్క్ దేశానికి భద్రతా సమస్యగా మారతాడు. అవసరమైతే ఆయనను దేశనిర్బంధం చేయాలి" అనే రీతిలో కూడా వ్యాఖ్యలు రావడం గమనార్హం.

-మస్క్ స్పందన.. సున్నితంగా కానీ స్పష్టంగా

ఇలాంటి తీవ్ర ఆరోపణల మధ్య మస్క్ తొలుత స్పందిస్తూ "ఈ విషయాన్ని మరింత పెద్దదిగా చేయాలనిపిస్తోంది. కానీ నేను ప్రస్తుతం ఏమీ చేయదలచుకోవట్లేదు" అని ట్వీట్ చేశారు. ఆయన స్పందనలో ఒక రకమైన వ్యంగ్యం, శాంతికి అవకాశమిచ్చే తీరు కనిపించింది.

గతంతో పోలిస్తే మస్క్ ఈసారి చాలా మెచ్చుకోదగ్గ నిగ్రహంతో స్పందించడం విశేషం. ఈ వివాదం మరింత ముదిరితే, రాజకీయంగా కానీ, వ్యాపారంగా కానీ ప్రభావం చూపే అవకాశం ఉంది. మస్క్ తన ట్వీట్ ద్వారా తన స్థిరమైన మానసిక స్థితిని చాటినట్టుగా పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

-వ్యాపార ప్రభావం?

ఈ వివాదం మధ్య టెస్లా షేర్ల ధరల్లో స్వల్ప హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలు ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలను నిరాకరించే దిశగా ఉండవచ్చన్న అనుమానాలు పెట్టుబడిదారుల్లో కలకలం రేపుతున్నాయి.

టెక్నాలజీ ప్రపంచంలో అగ్రగామిగా వెలుగుతున్న ఎలాన్ మస్క్ ప్రస్తుతం రాజకీయంగా కొంత వెనక్కి తగ్గినట్టుగా కనిపిస్తున్నా, ఇది తాత్కాలికమా? లేక వ్యూహాత్మకమా? అనే దానిపై స్పష్టత లేదు. అయితే ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. మస్క్ రాజకీయంగా నడిచే మార్గం ఇక నుంచి మరింత సవాళ్లతో కూడినదిగా మారే అవకాశం ఉంది.