అరబ్ దేశాల సంపద చూసి ట్రంప్ అచ్చెరువు.. కొంపదీసి కన్ను పడలేదా?
ప్రపంచానికి పెద్దన్న అమెరికా అన్న విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన జీవితం ఆ దేశంలోనే ఉంటుందన్న మాట వినిపిస్తుంటుంది
By: Tupaki Desk | 15 May 2025 10:29 AM ISTప్రపంచానికి పెద్దన్న అమెరికా అన్న విషయంలో ఎవరికి ఎలాంటి సందేహం లేదు. అత్యంత ఖరీదైన.. విలాసవంతమైన జీవితం ఆ దేశంలోనే ఉంటుందన్న మాట వినిపిస్తుంటుంది. సహజంగానే బిలియనీర్ అయిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఆశ్చర్యపోయేంతటి పరిస్థితి ఉంటుందా? అంటే.. చాలామంది లేదని చెబుతారు. కానీ.. వాస్తవం ఏమంటే.. ఆయన తాజా అరబ్ దేశాల పర్యటన సందర్భంగా ఆ దేశాల్లోని సంపద చూసి అచ్చెరువు చెందుతున్న పరిస్థితి.
ప్రపంచంలోనే అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థకు.. బలమైన సైన్యానికి అధిపతి అయిన ట్రంప్.. అరబ్ దేశాల సంపదను చూసి ఆశ్చర్యానికి గురి కావటమే కాదు.. ఒక దశలో ఆయన నోటి నుంచి వచ్చిన మాట చూస్తే.. ఆయన ఎంత అసూయకు గురయ్యారన్న భావన కలుగక మానదు. ఇంతకూ ట్రంప్ ఏమన్నారు? ఏ సందర్భంలో అన్నారన్నది చూస్తే.. ఖతార్ ఎమిర్ ను పొగడ్తలతో ముంచెత్తి.. ఖతారీ ప్యాలెస్ లోని పాలరాయిని చూసి అద్భుతమంటూ.. ‘‘దీనిని సొంతం చేసుకోవటం ఎంతో ఖర్చుతో కూడుకున్నది కావొచ్చు’’ అన్నమాట చూస్తే.. పెద్దన్న పాడు కన్ను అరబ్ దేశాల మీద పడిందా? అన్న భావన రావటం ఖాయం.
సౌదీ అరేబియాలోని ధగధగ మెరిసే విమానాలపైనా ఆయన ప్రశంసలు కురిపిస్తూ.. వాటితో పోలిస్తే తన ఎయిర్ ఫోర్సు వన్ విమానం ఎంతో చిన్నదని.. అకట్టుకునేదిగా లేదని పేర్కొనటం గమనార్హం. గల్ఫ్ దేశాలు అత్యాధునిక బోయింగ్ 747 లను వాడుతున్నాయని.. తాను నాలుగు దశాబ్దాల నాటి విమానాల్ని వాడుతున్నట్లుగా పేర్కొన్నారు. తన విమానాన్ని మార్చటానికి తానెంతో ఆసక్తిగా ఉన్న విషయాన్ని ఆయన తన మాటల్లో చెప్పేశారు.
అంతేకాదు ఖతార్ ఆయనకు ఇచ్చేందుకు సిద్ధమైన విలాసవంతమైన విమానాన్ని తీసుకోవటానికి ఆయన ఎంతో ఆసక్తిని చూపుతున్నారు. అమెరికా నిబంధనల ప్రకారం.. దాని భద్రత నిబంధనల వేళ.. ఇలాంటి ఖరీదైన బహుమతుల్ని స్వీకరించే విషయంలో పరిమితులు ఉన్నాయి. అంతేకాదు.. ఖతార్ రాజ కుటుంబం తనకు బహుమతిగా ఇచ్చే విమానాన్ని ఎయిర్ ఫోర్సు వన్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించాలన్న ఆలోచనలో ఉన్నారు. అయితే.. ఇందుకోసం కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
అందుకు భారీగా ఖర్చు అవుతుంది. వీటికి ఇప్పుడున్న నిబంధనలు ఒప్పుకోవు. అయితే.. వాటిని పట్టించుకోకుండా ఖతార్ రాజకుటుంబం ఇచ్చే బహుమతిని తీసుకోవాలన్న ఆసక్తి ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అరబ్ దేశాల సంపద చూసి ట్రంప్ కన్ను కుడితే మాత్రం.. ఆ దేశాలకు కొత్త కష్టాలు ఖాయమని చెప్పక తప్పదు. ఎందులో అయినా సరే తాను.. తన దేశం మాత్రమే ముందు ఉండాలనే ట్రంప్ మీద అరబ్ దేశాల పర్యటన ఎలాంటి ప్రభావాన్నిచూపిందన్న విషయం రానున్న రోజుల్లో వెల్లడి కావటం ఖాయం.
