'ఏఐ'ని 'సూపర్' అనకపోతే దేశద్రోహమేనా ట్రంప్ సారూ.?
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది.
By: A.N.Kumar | 9 Oct 2026 4:00 PM ISTరేపు ఉదయాన్నే మీ ఫోన్‌లోని గూగుల్ అసిస్టెంట్‌నో, అలారమ్‌నో 'ఏఐ' అని పిలిస్తే.. మీరు దేశద్రోహం చేసినట్లే పరిగణిస్తారేమో జాగ్రత్త.. "మన డిజిటల్ అసిస్టెంట్లను 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' అని చులకనగా పిలవకూడదు.. 'సూపర్ ఇంటెలిజెన్స్' అని సాష్టాంగ నమస్కారం చేయాలి. అలా అననివారు మన శత్రువర్గమే" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాంబు పేల్చినట్లు నెట్టింట వార్తలు హోరెత్తుతున్నాయి. రేపు పొద్దున మన వీధి చివర ఉన్న 'సూపర్ మార్కెట్'కి పోయి సామాన్లు తెచ్చినంత సులువుగా.. సాంకేతికతకు 'సూపర్' అనే బిరుదులు తగిలించేస్తే ప్రపంచంలో ఆధిపత్యం వచ్చేస్తుందా? లేక ఇదంతా టెక్నాలజీ ప్రపంచంలోకి ప్రవేశించిన కొత్త రకం పొలిటికల్ గిమ్మిక్కా? అన్నది చర్చనీయాంశమవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ప్రపంచాన్ని శాసిస్తోంది. అయితే ఈ ఏఐకి ఏ పేరు పెట్టాలనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున పొలిటికల్ పొగలు రాజుకుంటున్నాయి. "ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనకండి నాయనా.. 'సూపర్ ఇంటెలిజెన్స్' అనండి. అలా అననివారు మన శత్రువులే" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించాడు. సాంకేతిక ప్రపంచంలోకి రాజకీయ నినాదాలు ప్రవేశిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ఇది మంచి అవకాశం ఇచ్చింది.
ఏఐ వేరు.. సూపర్ ఇంటెలిజెన్స్ వేరు.. పేరు మారితే పప్పులు ఉడుకుతాయా?
టెక్నికల్‌గా చూస్తే.. ప్రస్తుతం మనం వాడుతున్న ఏఐ మీ ఫోన్‌లో వాతావరణం చెప్పడానికో చిన్నచిన్న బొమ్మలు గీయడానికో పనికొచ్చే ఒక సాధనం. కానీ 'సూపర్ ఇంటెలిజెన్స్' అనేది మానవ మేధస్సును అన్ని రంగాల్లోనూ దాటేసే భవిష్యత్ భావన. ఇప్పుడు సాధారణ ఏఐని తీసుకెళ్లి 'సూపర్ ఇంటెలిజెన్స్' అని పిలిస్తే.. సైకిల్‌కి 'సూపర్ సోనిక్ జెట్' అని పేరు పెట్టి రాకెట్ వేగంతో వెళ్తుందని నమ్మించడమే అవుతుంది. పేరు మార్చినంత మాత్రాన సాంకేతికతలోని లోపాలు లేదా సామర్థ్యాలు మాయమైపోవు కదా? అదే జరుగుతోంది ఇప్పుడు..
చైనాతో పోటీ.. మాటల వేగం సరిపోతుందా?
అమెరికా-చైనాల మధ్య సాంకేతిక ఆధిపత్య పోరు ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. అడ్వాన్స్‌డ్ చిప్స్, భారీ డేటా సెంటర్లు, జాతీయ భద్రత కలగలిసి వ్యూహాత్మక యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీని పెద్ద పెద్ద పేర్లతో ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టడం పొలిటికల్ లీడర్లకు అలవాటే. కానీ రేసులో గెలవాల్సింది పరిశోధనలు, ఆవిష్కరణలు, మౌలిక వసతులతోనే కానీ.. కేవలం బిరుదులు ఇచ్చుకోవడం వల్ల కాదు..
'పదం' మారకపోతే శత్రువులా?
ఒక సాంకేతిక పదాన్ని ఎలా వాడాలో శాస్త్రవేత్తలు, నిపుణులు నిర్ణయిస్తారు. నామకరణాల పై ఆంక్షలు విధించడం, మాట వినకపోతే "నువ్వు నా శత్రువువి" అనడం ప్రజాస్వామ్యానికే కాకుండా శాస్త్రీయ స్వేచ్ఛకు కూడా విరుద్ధం. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఓపెన్ ఏఐ, ఎన్‌విడియా వంటి దిగ్గజాలు వేల కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నది పరిశోధనల కోసం.. ప్రభుత్వం రూపొందించే నిఘంటువుల కోసం కాదన్నది గుర్తుంచుకోవాలి.
పేరులో ఏముంది? నిజమైన శక్తి సామర్థ్యంలోనే ఉంది. 'ఏఐ' అని పిలిచినా 'సూపర్ ఇంటెలిజెన్స్' అని పిలిచినా అంతిమంగా సమాజానికి, మానవాళికి ఎంత ఉపయోగపడిందనేదే ముఖ్యం. రాజకీయ నాయకులు పేర్లు మారుస్తూ కాలం గడపవచ్చు గానీ టెక్ ప్రపంచం మాత్రం నిజమైన ఆవిష్కరణల వైపే మొగ్గు చూపుతుంది.
