Begin typing your search above and press return to search.

ఆఫ్రికన్ల వీసాల రద్దు.. ట్రంప్ మరో సంచలనం

ముఖ్యంగా డిపోర్టేషన్ విషయంలో తమ ప్రవర్తన మార్చుకోని దక్షిణ సూడాన్‌కు చెందిన వారి వీసా

By:  Tupaki Desk   |   7 April 2025 3:00 AM IST
ఆఫ్రికన్ల వీసాల రద్దు.. ట్రంప్ మరో సంచలనం
X

అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. సరైన పత్రాలు లేకుండా దేశంలో నివసిస్తున్న వారిని స్వదేశాలకు పంపించే ప్రక్రియను ఆయన ప్రభుత్వం ముమ్మరం చేసింది. అక్రమంగా అమెరికాకు వచ్చిన ఆఫ్రికా పౌరులన ఇటీవల తమ దేశాలకు తిరిగి పంపారు. అయితే ఇటీవల అమెరికాకు అక్రమంగా వచ్చిన పలువురు ఆఫ్రికా దేశాల పౌరులను వారి స్వస్థలాలకు తిరిగి పంపడానికి ప్రయత్నించగా, ఆయా దేశాలు వారిని స్వీకరించడానికి నిరాకరించాయి. దీంతో ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం ఆ దేశాల పౌరులకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే వారి వీసాలను రద్దు చేస్తోంది.

ఈ మేరకు యూఎస్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో శనివారం కీలక ప్రకటన చేశారు. ఇమిగ్రేషన్ చట్టాల అమలును వేగవంతం చేసే ప్రయత్నాలలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా డిపోర్టేషన్ విషయంలో తమ ప్రవర్తన మార్చుకోని దక్షిణ సూడాన్‌కు చెందిన వారి వీసా అపాయింట్‌మెంట్లను రద్దు చేయడంతో పాటు కొత్త వీసాల జారీ ప్రక్రియను కూడా నిలిపివేస్తున్నట్లు రూబియో తెలిపారు. దీంతో దక్షిణ సూడాన్‌కు చెందిన ఏ ఒక్క పౌరుడు కూడా ఇకపై వీసాపై అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదని ఆయన తేల్చి చెప్పారు.

"దక్షిణ సూడాన్ పాస్‌పోర్ట్‌దారులకు అమెరికాలో ఉన్న అన్ని వీసాలకు కూడా విలువలేదు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. వారు అమెరికాలోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. దక్షిణ సూడాన్ ట్రంప్ పరిపాలన విధానానికి సహకరించినప్పుడు మాత్రమే ఈ కఠిన నియమాలను సమీక్షిస్తాం" అని మార్కో రూబియో తన ప్రకటనలో పేర్కొన్నారు.

ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దాదాపు ఎనిమిది వేల మంది అక్రమ వలసదారులను అరెస్టు చేసినట్లు వైట్‌హౌస్ వెల్లడించింది. వీరిలో కొందరిని ఇప్పటికే వారి స్వదేశాలకు పంపించగా, మరికొందరు జైళ్లలోనూ, ఇంకొందరు నిర్బంధ కేంద్రాల్లోనూ ఉన్నారు.

ఇదిలా ఉండగా అమెరికాలోని కొందరు విదేశీ విద్యార్థులు జాతి వ్యతిరేక ప్రచారానికి పాల్పడుతున్నట్లు గుర్తించిన విదేశాంగ శాఖ, వారిని స్వచ్ఛందంగా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ మెయిల్స్ పంపింది. కేవలం ఆందోళనల్లో పాల్గొన్నవారికే కాకుండా, అక్కడ జరిగిన దృశ్యాలను, జాతి వ్యతిరేక సందేశాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసిన విద్యార్థులకు కూడా ఈ హెచ్చరిక సందేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. యునైటెడ్ స్టేట్స్ ఇమిగ్రేషన్, అమెరికా జాతీయ చట్టంలోని సెక్షన్ 221(i) ప్రకారం వారి వీసాలు రద్దు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.

మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తోందని, సహకరించని దేశాల పౌరులపై చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడటం లేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ చర్యల వల్ల అమెరికాలో నివసిస్తున్న ఆయా దేశాల పౌరులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. భవిష్యత్తులో ఈ విధానాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాలి.