Begin typing your search above and press return to search.

ట్రక్కు డ్రైవర్ల సమ్మె పరేషాన్.. హైదరాబాద్ మహానగరం అతలాకుతలం

దీంతో.. లక్షలాదిగా ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరటం.. వారిని చూసిన వారు.. ముందస్తుజాగ్రత్తల్లో భాగంగా తాము కూడా క్యూలో భాగస్వామ్యం కావటంతో.. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు పెట్రోల్ బంకుల వద్ద దర్శనమిచ్చాయి.

By:  Tupaki Desk   |   3 Jan 2024 6:17 AM GMT
ట్రక్కు డ్రైవర్ల సమ్మె పరేషాన్.. హైదరాబాద్ మహానగరం అతలాకుతలం
X

ట్రక్కు డ్రైవర్లు సమ్మె చేస్తున్న అంశానికి సంబంధించి మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వెల్లువెత్తిన ‘పెట్రోల్.. డీజిల్ కొరత’ భయం హైదరాబాద్ మహానగరాన్ని అల్లకల్లోలంగా మార్చింది. పెట్రోల్.. డీజిల్ అవసరం లేని కుటుంబమే హైదరాబాద్ లో ఉండదన్నది తెలిసిందే. దీనికి తోడు మూడు రోజుల పాటు పెట్రోల్.. డీజిల్ దొరకదన్న భయం.. అప్పటివరకు చేస్తున్న పనుల్ని వదిలేసి.. పెట్రోల్ బంకుల వైపు వెళ్లేలా చేసింది.

దీంతో.. లక్షలాదిగా ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరటం.. వారిని చూసిన వారు.. ముందస్తుజాగ్రత్తల్లో భాగంగా తాము కూడా క్యూలో భాగస్వామ్యం కావటంతో.. కిలోమీటర్ల కొద్దీ క్యూలైన్లు పెట్రోల్ బంకుల వద్ద దర్శనమిచ్చాయి. దీనికి తోడు.. వందలాదిగా పెట్రోల్ బంకుల వద్ద వెయిట్ చేయాల్సిన దుస్థితి. దీంతో.. హైదరాబాద్ వ్యాప్తంగా భారీ ఎత్తున ట్రాఫిక్ జాం అయ్యింది. కొత్త ఏడాది రెండో రోజు కావటం.. డిసెంబరు 31న.. జనవరి 1న పండుగ వాతావరణం నెలకొనటంత.. అందరూ విందు.. వినోదాల్లో మునిగి తేలిన నేపథ్యంలో.. పెట్రోల్.. డీజిల్ కొట్టించే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్న వారికి.. తమ వాహనాల్లో తగినంత పెట్రోల్.. డీజిల్ ఉన్నప్పటికీ రానున్న మూడు రోజుల వరకు స్టాక్ ఉండదన్న ముందస్తు జాగ్రత్త పుణ్యమా అని దారుణ పరిస్థితులు నెలకొనేలా చేవాయి.

మళ్లీ పెట్రోల్.. డీజిల్ దొరకదేమో? సమ్మె మరో రెండు రోజులు పొడిగిస్తే తమ పరిస్థితి? ఏమిటి? లాంటి ఆలోచనలు పెట్రోల్ బంకుల వద్ద వందలాదిగా ఉండటంతో కిలోమీటర్ దూరానికి గంటల కొద్దీ సమయం తీసుకున్న పరిస్థితి. గంటలు గడిచే కొద్దీ.. ఈ రద్దీ పెరగటమే కానీ తగ్గింది లేదు.దీంతో.. నగరం మొత్తం ప్రభావితమైన పరిస్థితి. ఇదిలా ఉండగా.. తమ వద్ద స్టాక్ అయిపోయినట్లుగా పెట్రోల్ బంకులు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. దీంతో.. ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది ఏతావాతా పెట్రోల్.. డీజిల్ కోసం నగర జీవి పడిన ఆరాటం ఎంతన్నది రోడ్లమీదకు వచ్చినప్రతి ఒక్కరికి అనుభవంలోకి వచ్చింది.

సాయంత్రానికి సమ్మె విరమణ ప్రకటన వచ్చినప్పటికీ.. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో పెట్రోల్ బంకుల వద్దకు వెళ్లిన పరిస్థితి కారణంగా అర్థరాత్రి 12 గంటల వరకు బారులు తీరిన వాహనదారులు ఉన్న పరిస్థితి. మహానగరంలోని అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండాప్రతి ఒక్కచోట ఇదే ఇబ్బంది ఎదురైంది. మరోవైపు.. డెలివరీ బాయిస్ తో పాటు.. వాహన సేవల్ని అందించే డ్రైవర్లుసైతం పెట్రోల్ బంకుల వద్ద తమ కార్లు.. ఆటోలు.. బైకుల్ని తీసుకురావటంతో మరింత ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఇదంతా ఒక ఎత్తు అయితే పని చేసిన పెట్రోల్ బంకుల్లో డెబిట్.. క్రెడిట్ కార్డుల్ని ఒప్పుకోకపోవటం.. కేవలం క్యాష్ మాత్రమే తీసుకుంటామన్న పెట్రోల్ బంకుల సిబ్బంది మాటలు మరింత గందరగోళాన్ని.. ఆందోళనల్ని పెంచేలా చేసిందంటున్నారు. మొత్తంగా మంగళవారం మహా నగర ప్రజలు ట్రాఫిక్ నరకాన్ని చూశారని మాత్రం చెప్పక తప్పదు.