Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనాన్ని అడ్డుకున్నదెవరు? రివీల్ చేసిన కేటీఆర్

తిరుగులేని రాజకీయ నేతగా మారిన కేటీఆర్.. అన్ని అనుకున్నట్లు జరిగితే 2014లోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. రిటైర్మెంట్ తీసుకొని ఉండేవారన్న షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు

By:  Tupaki Desk   |   14 Nov 2023 5:28 AM GMT
కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనాన్ని అడ్డుకున్నదెవరు? రివీల్ చేసిన కేటీఆర్
X

తండ్రి కేసీఆర్ తో పోల్చలేం కానీ.. రాజకీయ అధినేతల వారసుల్ని చూసినప్పుడు కేటీఆర్ మిగిలిన వారికి పూర్తి భిన్నంగా ఉండటమే కాదు.. తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి మాదిరే తియ్యటి మాటలు చెప్పే విషయంలో ఆయనకు నూటికి తొంభై మార్కులకు పైనే పడతాయి. ఇప్పటికే ఐటీ శాఖా మంత్రిగా అతడు డిస్టింక్షన్ లో పాస్ అయిన సంగతి తెలిసిందే. పదేళ్లు అధికారాన్ని చేపట్టి.. ముచ్చటగా మూడోసారి అధికారాన్ని చేపట్టేందుకు ఎన్నికల బరిలో నిలిచిన ఆయన.. ఒక ప్రముఖ టీవీ చానల్ అధినేతతో బిగ్ డిబేట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటివరకు బయటకు వెల్లడించని ఎన్నో అంశాల్ని షేర్ చేశారు.

తిరుగులేని రాజకీయ నేతగా మారిన కేటీఆర్.. అన్ని అనుకున్నట్లు జరిగితే 2014లోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి.. రిటైర్మెంట్ తీసుకొని ఉండేవారన్న షాకింగ్ నిజాన్ని చెప్పుకొచ్చారు. కేటీఆర్ రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాలనుకున్నారా? అన్న మాట జీర్ణించుకోలేనిదే అయినా.. ఆ నిర్ణయం అమలు కాకుండా చేసిందెవరు? ఆ మాటకు వస్తే.. ఆ నిర్ణయానికి కేటీఆర్ ఎందుకు రావాల్సి వచ్చింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మరింత ఆసక్తికరంగా అనిపించక మానదు.

అనుకోకుకండా 2006లో రాజకీయాల్లోకి వచ్చిన కేటీఆర్.. 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేయాలని కేసీఆర్ అనుకున్న వేళలో.. ఆ పార్టీలోకి టీఆర్ఎస్ విలీనం కావటాన్ని ఆయన ఇష్టపడలేదు. తన భార్య సైతం కాంగ్రెస్ విలీన అంశంలో తన మాదిరే ఆలోచించేదని చెప్పారు. అందుకే.. కేసీఆర్ టీఆర్ఎస్ ను విలీనం చేసినంతనే రాజకీయాల నుంచి రిటైర్ కావాలని డిసైడ్ అయినట్లుగా చెప్పుకొచ్చారు.

సోనియా ఇంటికి సకుటుంబ సమేతంగా లంచ్ కు వెళ్లే టైంలోనూ అన్యమనస్కంగానే తాను వెళ్లినట్లు చెప్పారు. ‘‘సోనియా ఇంటికి వెళ్లే టైంలో హరీశ్ తో నేనన్నా. బాస్.. ఇదే నా చివరి ప్రోగ్రాం అవుతుందేమో. నేను పార్టీ నుంచి రిటైర్ అవ్వాలనుకుంటున్నా. నాకు కాంగ్రెస్ లో విలీనం కావటం ఇష్టం లేదు. నా మనసు ఒప్పుకోవటం లేదు’ అని కూడా చెప్పా. సోనియా ఇంటికి వెళ్లిన తర్వాత లంచ్ అయ్యాక.. పార్టీ విలీనం గురించి ఆమె ఏమీ మాట్లాడలేదని.. చివరకు కేసీఆరే ఆ విషయాన్ని ప్రస్తావిస్తే.. ద్విగ్విజయ్ సింగ్ తో అన్నీ మాట్లాడాలని అన్నారు. ఆమె అలా మాట్లాడటం తనకేమీ తప్పుగా అనిపించలేదని.. కాకుంటే.. మాతో పాటు ఇన్నాళ్లు ఉన్న వారు.. కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత వారి భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం లభించలేదన్నారు.

రాహుల్ గాంధీతోనూ విలీనం గురించి మాట్లాడినప్పుడు.. దిగ్విజయ్ సింగ్ తో మాట్లాడాలన్న మాటనే చెప్పారని.. ఆయనతో మాట్లాడినప్పుడు చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏ రీతిలో అయితే విలీనం చేశారో.. అలానే టీఆర్ఎస్ ను విలీనం చేయాలని చెప్పారని.. పార్టీ విలీనం అయ్యాక తామేం చేయాలో అది చేస్తామని చెప్పటం జరిగిందని చెప్పారు. తాము ఢిల్లీలో ఉన్న టైంలోనే తెలంగాణ కాంగ్రెస్ నేతలు వీహెచ్ తదితరులు..టీఆర్ఎస్ కుక్కను సైతం గాంధీ భవన్ గడపను తొక్కనీయమంటూ మాట్లాడారన్నారు. అదే సమయంలో.. తెలంగాణ ఉద్యోగ సంఘాలు మొదలు పలువురు తెలంగాణ గొంతును నొక్కేయటం ఏమిటి? అన్న ప్రశ్నను లేవనెత్తారన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేతల వైఖరి పుణ్యమా అని.. కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకున్న నిర్ణయాన్నిపునరాలోచించేలా చేశారన్న కేటీఆర్.. ‘కాంగ్రెస్ లో టీఆర్ఎస్ విలీనం కాకపోవటానికి కారణం కేసీఆర్ కానే కాదు. కాంగ్రెస్ సీనియర్ నేతలకు థ్యాంక్స్ చెప్పాలి. అలా జరగకుండా వారే చేశారు’’ అంటూ సోనియా ఇంటికి లంచ్ కు వెళ్లిన సమయంలో ఏం జరిగిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పుకొచ్చారు కేటీఆర్.