Begin typing your search above and press return to search.

బొత్స ఝాన్సీకి బిగ్ ట్రబుల్స్...వైసీపీ ఎమ్మెల్సీ షాక్...!

విశాఖ పార్లమెంట్ పరిధిలో అంతా అర్బన్ ఏరియావే ఉంది. రూరల్ సెక్టార్ లో వైసీపీకి పట్టున్నది అని భావిస్తున్న చోట చూస్తే కీలక నేతలు పార్టీ కి షాక్ ఇస్తున్నారు.

By:  Tupaki Desk   |   6 March 2024 5:15 PM GMT
బొత్స ఝాన్సీకి బిగ్ ట్రబుల్స్...వైసీపీ ఎమ్మెల్సీ షాక్...!
X

విశాఖ నుంచి తన సతీమణి మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మిని గెలిపించుకునేదుకు మంత్రి బొత్స సత్యనారాయణ గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలే విశాఖ సిటీ అంతా తెలుగుదేశం జనసేన ప్రభావం ఉంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో అంతా అర్బన్ ఏరియావే ఉంది. రూరల్ సెక్టార్ లో వైసీపీకి పట్టున్నది అని భావిస్తున్న చోట చూస్తే కీలక నేతలు పార్టీ కి షాక్ ఇస్తున్నారు.

విశాఖ ఎంపీ సీటు పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అవన్నీ కూడా సిటీలోనే ఉండడం విశేషం. విశాఖ నార్త్, సౌత్, వెస్ట్, ఈస్ట్, గాజువాక ఇలా అయిదు అసెంబ్లీ సీట్లు అర్బన్ ఓటర్లతోనే నిండిపోయాయి. మరో రెండింటిలో భీమిలీ సెమీ అర్బన్ గా ఉంది. ఇందులో కొంత భాగం అర్బన్ ఉంటే కొంత రూరల్ ఉంది. ఏకైక రూరల్ సెక్టార్ గా ఎస్ కోట నియోజకవర్గం ఉంది.

ఇక వైసీపీ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే విశాఖ నార్త్, సౌత్ లలో మెజారిటీ తెచ్చుకుని తూర్పు పశ్చిమలలో టీడీపీని వీలైనంతవరకు నిలువరిస్తే తెలుగుదేశం పార్టీ విజయాన్ని ఆపగలమని భావిస్తున్నారు. అలాగే గాజువాక భీమీలీలలో కూటమిని ఎదిరిస్తే ఎస్ కోటలో వచ్చే మెజారిటీతో విశాఖ ఎంపీ సీటు తమ పరం అవుతుందని లెక్క వేస్తున్నారు.

అయితే ఇపుడు ఆ ఎస్ కోట సీటులోనే అగ్గి పుడుతోంది. ఎమ్మెల్సీగా ఉన్న ఇందుకూరి రఘురాజు తిరుగుబాటు జెండా ఎగరేస్తారు. మండల ఉపాధ్యక్షురాలిగా ఉన్న తన సతీమణిని కీలక నేతలను ఆయన టీడీపీలోకి పంపించేసారు. తాను కూడా సైకిలెక్కేందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నారు.

దీంతో బొత్స వర్గం కలవరపడుతోంది. ఇందుకూరి రఘురాజు బొత్స శిష్యుడే. ఆయన రాజకీయ ఎదుగుదల వెనక బొత్స ఉన్నారు. ఆయన 2009లో ఇండిపెండెంట్ గా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి 31 వేలు సాధించారు. దాంతో ఆయనను కాంగ్రెస్ లో చేర్చుకుని 2014లో టికెట్ ఇచ్చారు. అపుడు రెండవ సారి పోటీ చేసి 30 వేల ఓట్లను తెచ్చుకుని ఏపీలో విభజన తరువాత కాంగ్రెస్ లో ఎక్కువ ఓట్లు తెచ్చిన మూడవ నేతగా రఘురాజు రికార్డు సృష్టించారు.

ఇక ఆయనను బొత్స 2019లో తనతో పాటే వైసీపీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. ఆయన సతీమణికి కూడా వైఎస్ ఎంపీపీ పదవులతో పాటు క్యాడర్ కి కూడా కొన్ని పదవులు బొత్స కట్టబెట్టారు. ఇక 2024లో తనకు టికెట్ ఎమ్మెల్యే టికెట్ కావాలని రఘురాజు పట్టుబట్టారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావుకే మరోసారి హై కమాండ్ టికెట్ ఇచ్చింది ఆయన బొత్సకు బంధువు కాబట్టి అలా చేశారు అన్న ఆగ్రహంతో రఘురాజు ఇపుడు వైసీపీ మీద ఇంకా చెప్పాలంటే బొత్స మీద మంటతో పార్టీని వీడే యోచనలో ఉన్నారు.

ఇందుకూరి రఘురాజు బలం నియోజకవర్గంలో ముప్పయి వేలకు తగ్గని ఓటు బ్యాంక్ అని రెండు ఎన్నికల్లో రుజువు అయింది. అది వైసీపీ విజయానికి కీలకంగా 2019లో మారింది. 2024లో ఏమి జరుగుతుందో అన్న కంగారు అధికార పార్టీలో ఉంది. ఎస్ కోటలో ఈసారి ఎక్కువ మెజారిటీ తెచ్చుకుని ఆ మెజారిటీని ఎంపీకి మళ్ళిస్తే బొత్స ఝాన్సీ విజయం సాధ్యపడుతుందని మంత్రి వేసిన లెక్కలు ఇపుడు రఘురాజు షాక్ తో తారు మారు అవుతున్నాయని అంటున్నారు.

తాను అన్ని రకాలుగా ప్రోత్సహించిన శిష్యుడు కీలకమైన టైం లో దెబ్బ కొట్టడంతో బొత్సతో పాటు ఆయన అనుచరులు కూడా మధనపడుతున్నారు. ఈ పరిణామాలు టీడీపీకి అనుకూలం కాబోతున్నాయని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీని పనిచేసి వైసీపీని ఓడించేందుకు రఘురాజు కంకణం కట్టుకున్నారని ఆయన అభిమానులు చెబుతున్నారు. మరి విశాఖ ఎంపీగా బొత్స ఝాన్సీకి ఈ పరిణామాలు షాకింగ్ గా మారుతున్నాయని అంటున్నారు.