Begin typing your search above and press return to search.

జడ్జిపై ట్రోల్స్... ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ అరెస్ట్!

ఇతడు విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు! దీంతో నంద్యాల పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

By:  Tupaki Desk   |   28 Sep 2023 4:30 AM GMT
జడ్జిపై ట్రోల్స్... ప్రైవేట్  కాలేజీ లెక్చరర్  అరెస్ట్!
X

ప్రస్తుతం చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆయన దాఖలు చేస్తున్న బెయిల్ పిటిషన్లు వరుసగా వాయిదాలు పడుతున్నాయి! మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో తాజాగా లోకేష్ ను ఏ14 గా చేర్చించి సీఐడీ. ఆ సంగతి అలా ఉంటే... టీడీపీ నేతలకు మరో సమస్య ఎదురైంది.. ఇది అత్యంత పెద్ద సమస్య అని అంటున్నారు.

అవును... రాజకీయాల్లో ఆరోపణలు చేసుకున్నట్లు, ట్రోల్ చేసుకున్నట్లుగా, తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నట్లుగా... తమకు అనుకూలంగా తీర్పు రాలేదనో ఏమో, గౌరవనీయులైన న్యాయమూర్తులపై కూడా ట్రోల్స్ చేశారు కొంతమంది టీడీపీ నేతలు, కార్యకర్తలు! అయితే ఈ విషయాన్ని న్యాయవాదులు సీరియస్ గా తీసుకున్నారు. ఇంతకు మించిన విష సంస్కృతి మరొకటి ఉండదని భావించారు.

ఇదే సమయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్ కు లేఖ పంపారు. దీంతో మేటర్ మరింత సీరియస్ అయ్యింది. ఈ సమయంలో జడ్జిలపై అనుచిత పోస్టులు, ట్రోలింగ్‌ వ్యవహారంపై ఏపీ ప్రభుత్వం, హైకోర్టులో క్రిమినల్‌ కంటెంప్ట్‌ పిటిషన్‌ వేసింది.

దీంతో... సోషల్‌ మీడియాలో పోస్టులు చేసిన 26 మంది అకౌంట్లను పరిశీలించి.. నోటీసులు జారీ చేయాలని ఏపీ డీజీపీకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలో... స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబుకి రిమాండ్‌ విధించిన ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందును అవమానిస్తూ పోస్టులు పెట్టాడు ఓ వ్యక్తి. అయితే అతన్ని ట్రేస్‌ చేసిన పోలీసులు.. తాజాగా అరెస్ట్‌ చేశారు.

సదరు వ్యక్తి టీడీపీ సోషల్ మీడియా (ఐ టీడీపీ) రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అని చెబుతున్నారు. ఈయన్ని ముల్లా ఖాజా హుస్సేన్‌ గా ధృవీకరించారు. ఇతను ఓ ప్రైవేట్‌ కాలేజీలో లెక్చరర్‌ గా పని చేస్తున్నాడని అంటున్నారు. ఇతడు విజయవాడ ఏసీబీ న్యాయమూర్తి హిమబిందును టార్గెట్‌ చేసి సోషల్‌ మీడియాలో అనుచిత పోస్టులు చేశాడు! దీంతో నంద్యాల పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు. ఇవాళ కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉందని తెలుస్తుంది.

కాగా... స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాం కేసులో చంద్రబాబు అరెస్ట్‌ అనంతరం రిమాండ్ కు పంపడంతో సోషల్‌ మీడియాలో ఒక బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఆయనకు సంబంధించి పలు పిటిషన్లపై దర్యాప్తు చేపట్టిన జడ్జిలపైనా అనుచిత పోస్టులు చేసింది. ఈ నేపథ్యం లోనే వారిలో ఒకరు అరెస్ట్ అయ్యారు!!