Begin typing your search above and press return to search.

ఏ చెట్టులో ఏ మృత్యువు నక్కి ఉందో !

చావుకు సవాలక్ష రూపాలు. అది నీడలా జీవిని వెంటాడుతుంది. ఎపుడైనా కబలించే అధికారంతో ఉంటుంది.

By:  Tupaki Desk   |   5 May 2025 3:50 PM
ఏ చెట్టులో ఏ మృత్యువు నక్కి ఉందో !
X

చావుకు సవాలక్ష రూపాలు. అది నీడలా జీవిని వెంటాడుతుంది. ఎపుడైనా కబలించే అధికారంతో ఉంటుంది. జీవుల సంగతి ఎలా ఉన్నా పాపం మనిషి మాత్రం మెదడు ఉండడం వల్ల చావు మాటకు చల్లబడతాడు. చిత్రమేంటి అంటే జీవితంలో అత్యంత వాస్తవం అయిన చావు గురించి అనుక్షణం మరచిపోవాలని అనుకుంటాడు.

ఎంతటి విద్వత్తు సంపాదించినా మరెంతటి ఘన పాండిత్యం మెదడులో జొప్పించుకున్నా చావు విషయానికి వస్తే ఎవరైనా బెదిరి పోవాల్సిందే. పైకి చెప్పే మాటలు ఎలా ఉన్నా లోలోపల చావు భయం ప్రతీ మనిషినీ వెంటాడుతూనే ఉంటుంది. దానిని అధిగమించేందుకు హిపోక్రసీ తో మాట్లాడే మాటలు చాలా మందిని మేధావులుగా చూపిస్తాయి కానీ వారిలోనూ అంతర్లీనంగా చావు భయం నిండుగా మెండుగా ఉంటుంది.

ఇక ఈ ఉపోద్ఘాతం ఎందుకు అంటే ఏ మనిషి అయినా చావు ఎపుడో వస్తుంది అనుకుంటాడు. అది ఈ రోజుకు రాదు రేపటికీ రాదు కనుచూపు మీరలో అసలు దాని జాడ కనిపించదని నిబ్బరం పోతాడు. కానీ మృత్యువు అలా కాదు, పొంచి ఉంటూనే ఠక్కున కాటేస్తుంది. దానికి బహు రూపాలు. అది ఎలాగైనా రాగలదు. మంచిగా కనిపించే వాటిలోనూ నక్కి ఉంటుంది.

తలచుకుంటే నీడ నించే చెట్టు కూడా చావు రూపాన్ని ధరిస్తుంది. విశాఖలో అదే జరిగింది. ఒక నాలుగు పదుల వయసు కలిగిన గృహిణి తన ఇంటి పనులు చేసుకుని స్కూటీ మీద నక్కవానిపాలెం లోని తన ఇంటికి వెళ్ళేందుకు చేసిన ప్రయత్నాన్ని చెట్టు రూపంలో వచ్చి చావు అడ్డుకుంది అంటే విధిని తక్కువ అంచనా వేయగలమా అనిపిస్తుంది. భర్త గోదావరి జిల్లాలో బ్యాంకు ఉద్యోగి, ఇద్దరు బిడ్డలు. చక్కని సంసారం చల్లని సంసారంగా సాగిపోతున్న ఆమె జీవితంలో విధి ఆడిన బంతాటగానే దీనిని చూస్తున్నారు.

తమాషా ఏమిటి అంటే ఒకేసారి ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఆ చెట్టు వైపుగా వస్తున్నారు. జస్ట్ అడుగు దూరమే. స్కూటీ మీద ఉన్న ఆ మహిళని నిలువెత్తు చెట్టు మీద పడి బలితీసుకుంది. ఆమె స్కూటీకి అడుగు దూరంలో ఉన్న బైకర్ ఈ ఘోరాన్ని చూసి షాక్ కి గురి రెండు అడుగులు వెనక్కి వెళ్ళి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో నిక్షిప్తం అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

కేవలం ఆమెని తీసుకునిపోవడానికే ఈ విధంగా చెట్టు మృత్యు వికట్టహాసం చేసింది అనిపిస్తోంది. అంతవరకూ గాలికి ఊగుతూ నీడను ఇస్తూ గాలిని పంచుతూ ఉల్లాసంగా ఉన్న ఆ చెట్టు ఆమె రావడంతోనే ఒక్కసారిగా ఎవరో కూకటి వేళ్ళతో పెకలించినట్లుగా నేల కూలడమేంటి ఆమెని మొత్తంగా కప్పేసి మరణ మృదంగాన్ని వినిపించడమేంటి. ఇదంతా చూసిన వారికి ఏ పుట్టలో ఏ పాము ఉందో అన్న పాత ముతక సామెత కాదు ఏ చెట్టులో ఏ మృత్యువు నక్కి ఉందో అన్న కొత్త సామెతను గుర్తు చేసుకోవాలమో అనిపిస్తుంది.

ఏది ఏమైనా విధిని నమ్మేవారు మాత్రం జరగాల్సిన సమయానికి ఏది అయినా జరిగిపోతుంది అంటారు. భౌతిక వాదులు అయితే ఆ చెట్టు బలహీనమై ఆ సమయానికి అలా కూలిపోయిందని అంటారు. ఎవరెన్ని చెప్పినా ఒక నిండు ప్రాణం పచ్చని చెట్టు బలి కొని ఆ చక్కని కుటుంబంలో చిచ్చు పెట్టింది. దాంతో విశాఖవాసులంతా దీని మీదనే చర్చించుకుంటున్నారు.