డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు.. ప్రపంచ యాత్రికుడు అన్వేష్ పై కేసు
ప్రపంచ యాత్రికుడు ట్యాగ్ తో దేశ దేశాలు తిరుగుతూ.. తనదైన విలక్షణ మాడ్యులేషన్ తో స్వల్ప వ్యవధిలోనే పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న యూట్యూబర్ అన్వేష్.
By: Tupaki Desk | 4 May 2025 2:00 PM ISTకాలం మారింది. ప్రజలు ఎంచుకునే మాధ్యమాలు మారుతున్నాయి. మీడియాను హైజాక్ చేసిన సోషల్ మీడియా ఎంట్రీ తర్వాత.. వెలుగులోకి వస్తున్న సమాచారం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మన చుట్టూ జరిగే చాలా అంశాలకు సంబంధించిన వివరాల కంటే వ్యాఖ్యానాలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాఖ్యానం తప్పు కాదు. కాకుంటే.. నోటికి వచ్చినట్లుగా చెబుతూ.. చెప్పాల్సిన సమచారానికి భిన్నంగా వివరాలు అందించటంతోనే అసలు చిక్కంతా. ప్రపంచ యాత్రికుడు ట్యాగ్ తో దేశ దేశాలు తిరుగుతూ.. తనదైన విలక్షణ మాడ్యులేషన్ తో స్వల్ప వ్యవధిలోనే పేరు ప్రఖ్యాతుల్ని సొంతం చేసుకున్న యూట్యూబర్ అన్వేష్.
ఇటీవల కాలంలో ఇతగాడు చేస్తున్న వ్యాఖ్యలు.. తనకు తెలిసిన సమాచారాన్ని తెలిసినట్లుగా కాకుండా.. నోటికి వచ్చినట్లుగా వివరాలు అందిస్తున్న తీరు విమర్శలకు గురి చేస్తోంది. అదే సమయంలో అతడిపై కేసులు నమోదు చేసేలా చేస్తోంది. తాజాగా అలాంటి ఉదంతమే మరొకటి చోటు చేసుకుంది. అన్వేష్ పై తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ డీజీపీ జితేందర్.. మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.. ఐఏఎస్ అధికారులు శాంతకుమారి.. దానకిశోర్.. వికాస్ రాజు తదితరులు హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ల ప్రచారం పేరుతో రూ.300 కోట్లు కొట్టేశారంటూ ఓ వీడియో ద్వారా తప్పుడు ప్రచారం చేసిన వైనంపై సైబర్ పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ప్రజల్లో గందరగోళాన్ని క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ అధికారుల చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బ తీయటం.. పరువుకు భంగం వాటిల్లేలా వీడియోలు చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ.. కేసు నమోదు చేశారు. తప్పుడు సమాచారానని వ్యాప్తి చేసేలా వీడియో కంటెంట్ క్రియేటర్ మీద చర్యలు తీసుకోవటానికి సైబర్ పోలీసులు సమాయుత్తమవుతున్నారు.
