Begin typing your search above and press return to search.

₹500 కోట్ల ప్యాకేజీతో భారత టాలెంట్‌కు మెటా గౌరవం

కానీ ఇప్పుడు ఒక సాధారణ మధ్య తరగతి భారతీయ యువకుడు తనదైన మార్గంలో వెళ్లి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

By:  Tupaki Desk   |   3 July 2025 9:32 AM IST
₹500 కోట్ల ప్యాకేజీతో భారత టాలెంట్‌కు మెటా గౌరవం
X

ఒకప్పుడు అమెరికాకు వలస వెళ్లడం, పెద్ద కంపెనీల్లో ఉద్యోగం సంపాదించడం భారతీయ యువతకు ఒక కల.. జీవిత విజయానికి తొలి మెట్టు. కానీ ఇప్పుడు ఒక సాధారణ మధ్య తరగతి భారతీయ యువకుడు తనదైన మార్గంలో వెళ్లి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఐఐటీ కాన్పూర్ నుంచి మొదలై, ఓపెన్‌ఎఐలో ప్రయాణం చేసి.. చివరకు మెటా (Meta) కంపెనీ నుంచి ₹500 కోట్లకు పైగా ప్యాకేజీ అందుకున్న ఈ యువకుడి పేరు త్రపిత్ బన్సల్.

- సప్లై-డిమాండ్ సిద్ధాంతాన్ని నిలబెట్టిన విజయగాథ

ఆర్థిక విధానాల్లో ఒక శాశ్వత సూత్రం ఉంది. డిమాండ్ ఎక్కువైతే, విలువ పెరుగుతుంది. అదే సూత్రాన్ని త్రపిత్ బన్సల్ తన జీవితంలో అన్వయించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో ప్రతిభావంతుల డిమాండ్ పెరుగుతోంటే.., త్రపిత్ తన సాంకేతిక మేధస్సుతో ఆ స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం త్రపిత్‌కు మెటా అందించిన ఆఫర్ మొత్తం 60 మిలియన్ డాలర్లు.. అంటే దాదాపు ₹500 కోట్లు. ఇందులో 50 మిలియన్ డాలర్లు బోనస్, 10 మిలియన్ డాలర్లు వార్షిక ప్యాకేజీ.

- త్రపిత్ బన్సల్.. విద్యా నుంచి విజయానికి

త్రపిత్ పంజాబ్‌లో పుట్టి పెరిగారు. కానీ విద్యా మార్గంలో అత్యున్నత స్థాయిని అందుకోవాలన్న పట్టుదలతో ఐఐటీ కాన్పూర్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో ఉన్నత విద్యను అభ్యసించాడు. అక్కడే తాను AI రంగంలో అన్వేషణ ప్రారంభించాడు. 2022లో ఓపెన్‌ఎఐలో రీసెర్చర్‌గా చేరిన త్రపిత్, తన వైజ్ఞానిక విశ్లేషణతో అనేక ప్రయోగాలు విజయవంతంగా నిర్వహించాడు. ఇదే అతన్ని మెటా దృష్టిలో నేడు విలువైన ఆస్తిగా నిలిపింది.

- ఏఐ అంటే భయం కాదు.. అవకాశాల మార్గం

చాలామంది భావన AI వలన ఉద్యోగాలు పోతున్నాయనే భయం. కానీ వాస్తవంగా చూస్తే AIను నేర్చుకున్న వారికి ఉద్యోగాలు కాదు, అవకాశాలే వస్తున్నాయి. త్రపిత్ విజయమే దీనికి గొప్ప ఉదాహరణ. పాత టెక్నాలజీకి ఆసక్తి తగ్గుతోందంటే, కొత్త టెక్నాలజీకి అవకాశాల మోత మోగుతోందన్న మాట. ఇదే విషయాన్ని ఐటీ నిపుణులు, పరిశ్రమ వేత్తలు చెప్పుకొస్తున్నారు.

- భవిష్యత్తు లక్ష్యం.. సొంత కంపెనీ?

త్రపిత్ బన్సల్‌కు ఇప్పుడు పరిశ్రమల నుంచి లభిస్తున్న గుర్తింపు చూస్తే, ఆయన ప్రయాణం ఇంకా ఎక్కువ దూరం వెళ్లనుంది. అందిన సమాచారం ప్రకారం... ఆయన త్వరలో తన సొంత స్టార్టప్ ప్రారంభించే ఆలోచనలో ఉన్నాడు. ప్రత్యేకంగా AI పరిశోధనలపై దృష్టి పెట్టనున్నారట. అంటే భారత టెక్నాలజీ సత్తా అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందే అవకాశం ఇంకొంత పెరిగిందన్నమాట.

త్రపిత్ బన్సల్ కథ AIతో కూడిన భవిష్యత్తును సూచిస్తుంది. ఉద్యోగ భద్రతకు, భారీ సాలరీలకు రహదారి AIలో ఉందని స్పష్టంగా చెబుతుంది. పాత ఆలోచనలను వదిలి, కొత్త టెక్నాలజీని స్వీకరించగలిగితే ప్రతి ఒక్కరికి అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. త్రపిత్ లాంటి యువకుల విజయాలు దేశం మొత్తానికి గర్వకారణం.