జారి పడిన ప్రయాణికుడి కోసం వెనక్కి వెళ్లిన రైలు.. ఎక్కడంటే?
ట్రైన్ లో నుంచి జారి పడిన వ్యక్తం కోసం సదరు ట్రైన్ వెనక్కి వెళ్లిన ఉదంతం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 3 Sept 2025 10:00 AM ISTట్రైన్ లో నుంచి జారి పడిన వ్యక్తం కోసం సదరు ట్రైన్ వెనక్కి వెళ్లిన ఉదంతం ఒకటి ఏపీలో చోటు చేసుకుంది. అరుదుగా చోటు చేసుకునే ఈ పరిణామంలో రైల్వే తీరును అందరిని ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ.. ఆ ఆనందం ఆవిరి అయ్యేలా సదరు జారి పడిన ప్రయాణికుడు మరణించిన వైనం విషాదంగా మారింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..
గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ కోడూరుకు చెందిన 35 ఏళ్ల హరిబాబు తన స్నేహితులైన మావోబాబు.. వెంకటేశ్వర్లు.. విమలరాజుతో కలిసి యలహంకలో భవన నిర్మాణ పనుల కోసం బయలుదేరారు. వీరంతా కోండవీడు ఎక్స్ ప్రెస్ ట్రైన్ ఎక్కారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం గజ్జల కొండ దాటిన తర్వాత భోజనం తిన్న హరిబాబు వాష్ బేసిన్ వద్ద చేతులు కడుక్కొని.. కాసేపు గేటువద్ద నిలుచున్నాడు.
అయితే.. అదే సమయంలో రైలు భారీ కుదుపునకు లోను కాగా.. హరిబాబు ట్రైన్ లో నుంచి జారిపడ్డాడు. ఈ పరిణామాన్ని గమనించిన తోటి ప్రయాణికులు హరిబాబు స్నేహితులకు ఈ విషయాన్ని తెలియజేవారు. అప్పటికే వేగంగా ఉన్న రైలు 1.5 కి.మీ. దాటి వెళ్లిపోయింది. అయితే.. అప్పటికప్పుడు చెయిన్ లాగటంతో ట్రైన్ ఆగింది. విషయాన్ని తెలియజేయగా.. ట్రైన్ లోకో పైలెట్ ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించారు.
వారి నుంచి అనుమతి తీసుకున్న లోకో పైలెట్ ట్రైన్ ను వెనక్కి మళ్లించారు. దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు వెనక్కి వెళ్లిన తర్వాత ట్రాక్ పక్కనే గాయాలతో పడి ఉన్న హరిబాబును గుర్తించారు. వెంటనే అతడ్ని ట్రైన్ లోకి ఎక్కించి ఆ సమాచారాన్ని అధికారులకు తెలియజేశారు. మార్కాపురం రైల్వే స్టేషన్ వద్ద హరిబాబుకు చికిత్స చేసేందుకు 108 వాహనాన్ని రెఢీగా ఉంచారు. అయితే.. ఆసుపత్రికి తీసుకెళ్లి.. చికిత్స చేస్తున్న వేళలోనే తీవ్ర గాయాలతో ఉన్న హరిబాబు ప్రాణాలు విడిచాడు. ఈ ఉదంతం అక్కడున్నోళ్లను కలిచివేసింది.
