Begin typing your search above and press return to search.

ఆ దేశానికి డాక్టర్ చదువుకు వెళ్లి.. మంచులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు

తాజాగా అలాంటి విషాదమే అనకాపల్లి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థికి ఎదురైంది.

By:  Tupaki Desk   |   23 April 2024 6:30 AM GMT
ఆ దేశానికి డాక్టర్ చదువుకు వెళ్లి.. మంచులో ప్రాణాలు పోగొట్టుకున్నాడు
X

ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే మన పిల్లలు ఎక్కువ అవుతున్నారు. తమ ఆశలు.. ఆకాంక్షల్ని.. కెరీర్ కలల్ని తీర్చుకోవటానికి విదేశాలకు వెళ్లే వారంతా అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలు పొంచి ఉంటాయన్న విషయంలో ఏ చిన్నపాటి నిర్లక్ష్యం దొర్లినా.. ప్రాణాలు పోగొట్టుకోవటమే కాదు.. ఎవరూ తీర్చలేని కడుపుకోతను తల్లిదండ్రులకు మిగిల్చిన వారు అవుతారు. తాజాగా అలాంటి విషాదమే అనకాపల్లి జిల్లాకు చెందిన వైద్య విద్యార్థికి ఎదురైంది.

వైద్య విద్య కోసం కిర్గిజ్ స్థాన్ కు వెళ్లిన యువకుడు.. ఆటవిడుపులో భాగంగా జలపాతం వద్దకు వెళ్లి.. మంచులో కూరుకుపోయి ప్రాణాలు విడిచిన విషాద ఉదంతం అయ్యో అనిపించేలా మారింది. అనకాపల్లి జిల్లా మాడుగులకు చెందిన స్వీట్ల వ్యాపారి భీమరాజు రెండో కొడుకు చందు. ఏడాది క్రితం అతను వైద్య విద్య కోసం కిర్గిజ్ స్థాన్ కు వెళ్లాడు. ఇటీవల పరీక్షలు ముగిశాయి.

దీంతో.. తోటి విద్యార్థులతో కలిసి విశ్వవిద్యాలయ అధికారులు ఆదివారం స్టూడెంట్లను సమీపంలోని మంచు జలపాతం వద్దకు తీసుకెళ్లారు. అయితే.. అధికారులు వారిస్తున్నా పట్టించుకోని ఐదుగురు విద్యార్థులు జలపాతంలోకి దిగారు. ప్రమాదవశాత్తు.. అందులో చందు మంచులో కూరుకుపోయాడు. దీంతో.. అతడ్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.

దీంతో.. మంచులో కూరుకుపోయిన చందు మరణించాడు. అతడి డెడ్ బాడీని కిర్గిజ్ స్థాన్ నుంచి అనకాపల్లి జిల్లా మాడుగులకు తీసుకొచ్చేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని సంప్రదించారు. ఆయన ఆ దేశ భారత రాయబారి కార్యాలయం అధికారులతో మాట్లాడిన త్వరగా డెడ్ బాడీ మన దేశానికి వచ్చేలా ప్రయత్నిస్తున్నారు. అనకాపల్లి ఎంపీ సత్యవతి సైతం అధికారులతో మాట్లాడుతూ.. వీలైనంత త్వరగా డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు శ్రమిస్తున్నారు.