Begin typing your search above and press return to search.

అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. తెలుగు కుటుంబం సజీవ దహనం

వెంకట్ కుటుంబం ఇటీవల డల్లాస్‌ నుంచి వెకేషన్ కోసం అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్లారు.

By:  Tupaki Desk   |   7 July 2025 10:06 PM IST
అమెరికాలో ఘోర రోడ్డుప్రమాదం.. తెలుగు కుటుంబం సజీవ దహనం
X

అమెరికాలో జరిగిన ఒక హృదయవిదారక సంఘటనతో ప్రవాస భారతీయ సమాజం శోకసంద్రంలో మునిగిపోయింది. అమెరికాలోని గ్రీన్ కౌంటీ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన శ్రీ వెంకట్, ఆయన భార్య తేజస్విని, వారి ఇద్దరు పిల్లలు సజీవ దహనమయ్యారు.

- వెకేషన్ విషాదాంతం

వెంకట్ కుటుంబం ఇటీవల డల్లాస్‌ నుంచి వెకేషన్ కోసం అట్లాంటాలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అట్లాంటా నుంచి తిరిగి డల్లాస్‌కి కారులో వస్తుండగా గ్రీన్ కౌంటీ వద్ద రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ మినీ ట్రక్కు వీరి కారును అతి వేగంగా ఢీకొంది. ట్రక్కు ఢీకొన్న వెంటనే కారులో మంటలు చెలరేగాయి. అక్కడి వారెవరూ కూడా సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కారు పూర్తిగా మంటల్లో చిక్కుకుని, వెంకట్ కుటుంబంలోని నలుగురూ అక్కడికక్కడే సజీవదహనమయ్యారు. కారు పూర్తిగా బూడిద కావడంతో మృతదేహాలను గుర్తించలేని స్థితి ఏర్పడింది. విషాద సంఘటన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, మిగిలిన ఎముకలను సేకరించి ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. మృతులను శ్రీ వెంకట్, తేజస్విని , వారి ఇద్దరు చిన్నారులుగా గుర్తించారు. వారు హైదరాబాద్‌కు చెందినవారని అధికారికంగా ధ్రువీకరించారు.

- తెలుగు సమాజంలో విషాదం

ఈ ఘటనతో అమెరికాలోని తెలుగు సమాజం , హైదరాబాద్‌ వాసుల్లో తీవ్ర విషాదం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో శోక సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక ఇండియన్ అసోసియేషన్ వారు మృతుల మృతదేహాలను స్వదేశానికి తరలించే ఏర్పాట్ల కోసం సన్నాహాలు చేస్తున్నారు.

ఈ విషాదకర సంఘటన ఎంతో మంది హృదయాలను కుదిపేసింది. ఒక కుటుంబం మొత్తాన్ని ఒక్కసారిగా కోల్పోవడం మాటలతో చెప్పలేనంత బాధాకరమైన విషయం. వారి ఆత్మలకు శాంతి చేకూరాలని, కుటుంబానికి సంఘీభావం తెలుపుతూ భారతీయ సమాజం ప్రార్థనలు చేస్తోంది.