Begin typing your search above and press return to search.

రేవంత్ సీఎం.. ఏక కాలంలో మూడు పదవుల్లో.. ఇంకో 2 కూడా!

కాంగ్రెస్ విజయంతో తెలంగాణ సీఎం రేసులో ముందుగా వినిపిస్తున్న పేరు ఎనుముల రేవంత్ రెడ్డి. మరో పేరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

By:  Tupaki Desk   |   3 Dec 2023 7:42 AM GMT
రేవంత్ సీఎం.. ఏక కాలంలో మూడు పదవుల్లో.. ఇంకో 2 కూడా!
X

తెలంగాణలో కాంగ్రెస్ విజయబావుటా ఎగురవేయడంతో మిగిలింది సీఎం ఎవరు అవుతారు అనేదే..? వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు కూడా దీనిపై ఇప్పటికే స్పష్టత ఉండి ఉండొచ్చు. కానీ.. పార్టీ సిద్ధాంతాల ప్రకారం.. ముందుగా ప్రకటించలేదు. దీనికితోడు అనేక సమీకరణాలను పరిశీలించాల్సి ఉంటుంది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటిస్తే.. అనేక ఇబ్బందులు తలెత్తుతాయి. అందులోనూ జాతీయ పార్టీలో ఇది సాధ్యం కాదు. స్వపక్షంలోనూ, అవతలి పక్షం నుంచి కూడా విమర్శలు ఎదురవుతాయి. అందుకనే పార్టీ మెజారిటీ సాధించాక మాత్రమే సీఎంను ఎమ్మెల్యేలు ఎన్నుకునేలా సమావేశం ఏర్పాటు చేస్తారు.

రేవంత్ ముఖ్యమంత్రి అయితే..

కాంగ్రెస్ విజయంతో తెలంగాణ సీఎం రేసులో ముందుగా వినిపిస్తున్న పేరు ఎనుముల రేవంత్ రెడ్డి. మరో పేరు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. వీరి తర్వాత మరికొందరి అభ్యర్థిత్వమూ చర్చకు వస్తోంది. అయితే, రేవంత్, భట్టినే ముందుంజలో ఉన్నారని చెప్పకతప్పదు. ఒకవేళ రేవంత్ రెడ్డి గనుక సీఎం అయితే మాత్రం పలు విధాలుగా అది సంచలనం కానుంది. ఇటు పదవుల పరంగానూ.. అటు రేవంత్ వ్యక్తిగతంగానూ రికార్డులకెక్కనుంది.

ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ చీఫ్

రేవంత్ సొంత నియోజకవర్గం కొడంగల్ అన్న సంగతి తెలిసిందే. అయితే, 2018 ఎన్నికల్లో ఆయనను పట్టుబట్టి మరీ ఓడించింది బీఆర్ఎస్. దీంతో వరుసగా రెండు సార్లు గెలిచిన సీటును కోల్పోయారు రేవంత్ రెడ్డి. రాజకీయ భవితవ్యం స్థిరంగా కొనసాగేందుకు 2019 లోక్ సభ ఎన్నికల్లో తప్పనిసరి అయి మల్కాజ్ గిరి నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆయనను అనూహ్యంగా విజయం వరించింది. దీన్ని సద్వినియోగం చేసుకున్న రేవంత్ పార్లమెంటులో తన వాణిని వినిపించారు. మరిప్పుడు ఆయన ఎంపీగానే ఉంటూ.. టీపీసీసీ అధ్యక్షుడి బాధ్యతలు మోస్తూ పార్టీని గెలిపించారు. ఇక కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా విజయం ఖాయం చేసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే కూడా అవుతున్నారు. అంటే ఏక కాలంలో పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఎంపీ మూడు పదవుల్లో ఉండనున్నారు.

సీఎం, సీఎల్పీ నేత కూడా

పీసీసీ చీఫ్ అనేది పార్టీ పదవి. ఇక ఎమ్మెల్యే, ఎంపీ అనేది చట్ట సభల సభ్యుడి హోదా. ఈ లెక్కన రేవంత్ కు మరో రెండు పదవులూ దక్కుతాయేమో? ఒకవేళ ఆయనను సీఎంగా చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి పదవి వస్తుంది. దీనికి ముందుగా కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) నాయకుడిగానూ ఎన్నికవుతారు కాబట్టి.. మరో రెండు పదవులూ జత అవుతాయి. మొత్తంగా చూస్తే అయిదు పదవులు అన్నమాట. ఏప్రిల్ లో లోక్ సభ సభ్యత్వం ముగుస్తుంది. 6 నెలలు కూడా లేదు కాబట్టి ఈలోగా రేవంత్ రాజీనామా చేయకపోవచ్చు. చేయొచ్చు. సీఎం అయ్యాక పీసీసీ అధ్యక్షుడి పదవిని వదిలేయొచ్చు.