Begin typing your search above and press return to search.

టీపీసీసీ చీఫ్‌ మార్పు... తెరపైకి రెండు ఫార్ములాలు!

అయితే ఈ మార్పు లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఉంటుందా.. తర్వాత ఉంటుందా అనేది తెలియదు కానీ.. మార్పు తథ్యం అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   31 Dec 2023 3:30 PM GMT
టీపీసీసీ చీఫ్‌  మార్పు... తెరపైకి రెండు ఫార్ములాలు!
X

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10ఏళ్లకు కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమయంలో తెలంగాణ పీసీసీ చీఫ్‌ మార్పుపై అధిష్టానం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ మార్పు లోక్‌ సభ ఎన్నికలకు ముందు ఉంటుందా.. తర్వాత ఉంటుందా అనేది తెలియదు కానీ.. మార్పు తథ్యం అని అంటున్నారు. ఈ సమయంలో రెండు ఫార్ములాలు తెరపైకి వస్తున్నాయి.

అవును... తెలంగాణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన అనంతరం ఆ పదవికి మరో వ్యక్తిని కేటాయించాలని కాంగ్రెస్ అధిష్టాణం భావిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా రెండు ఫార్ములాలపై చర్చ జరుగుతుందని తెలుస్తుంది. ఇందులో ఒకటి ఎస్సీ - రెడ్డి కాంబినేషన్ కాగా.. మరొకటి బీసీ - రెడ్డి కాంబినేషన్! దీంతో పీసీసీ చీఫ్ పదవికి సంబంధించి పెద్ద లిస్టే తెరపైకి వస్తుంది.

ఇందులో భాగంగా ముందుగా బీసీ - రెడ్డి కాంబినేషన్ విషయానికొస్తే ఇది ఉమ్మడి రాష్ట్రంలో సక్సెస్ అయిన ఫార్ములానే. ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉన్న బీసీ - రెడ్డి కాంబినేషన్‌ సక్సెస్ అయ్యింది. 2004లో బీసీ నేత డి.శ్రీనివాస్ పీసీసీ చీఫ్‌ గా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎల్పీ లీడర్‌ గా ఉండగా... 2009లోనూ బీసీ - రెడ్డి కాంబినేషన్‌ లో ఎన్నికలకు వెళ్లి వరుసగా రెండోసారి కాంగ్రెస్‌ విజయం సాధించింది.

ఈసారి కూడా అదే సూత్రాన్ని అప్లై చేయాలని భావిస్తే పలువురు సీనియర్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా... టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కి గౌడ్‌, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీనియర్ నేత వీ హనుమంత రావు, మాజీ ఎంపీ అంజన్‌ కుమార్‌ యాదవ్‌, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌ కుమార్ గౌడ్‌ వంటివారు రేసులో ఉన్నారని తెలుస్తుంది.

ఇక ఎస్సీ - రెడ్డి కాంబినేషన్ విషయనికొస్తే... ఈ జాబితాలో ప్రధానంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డి.కె.శివకుమార్ పీసీసీ చీఫ్‌ గా ఉన్న విషయాన్ని ఉదహరిస్తున్న పలువురు శ్రేణులు... తెలంగాణలో దళితులు - రెడ్డి కలయికలో తొలిసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అంటున్నారు.

ప్రధానంగా ఈ రెండు ఫార్ములాలపై డిస్కషన్ ఇలా ఉండగా... రెడ్డి - రెడ్డి కాంబినేషన్ కూడా చర్చకు వస్తుంది. ఇందులో భాగంగా... రెడ్డి సామాజికవర్గం నుంచి కూడా పలువురు నేతలు పీసీసీ చీఫ్ రేసులో ఉన్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా... కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, జగ్గారెడ్డి, మరోసారి ఉత్తం కుమార్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరూ బహిరంగంగా వ్యాఖ్యానించనప్పటికీ... అనుచరులనుంచి వాయిస్ వినిపిస్తుందని తెలుస్తుంది.

మరి ఈ విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది.. తీసుకునే నిర్ణయం లోక్ సభ ఎన్నికలకు ముందు తీసుకుంటుందా.. ఆ ఎన్నికల అనంతరమే ఆ ఆలోచన చేస్తుందా అనేది వేచి చూడాలి!