Begin typing your search above and press return to search.

65.. 42.. 37.. 32.. 22.. 19: ఏపీ ఎన్నికలు మొత్తం వీటి చుట్టూనే!

ఏమిటీ అంకెలు. ఒక పద్దతి పాడు లేకుండా.. వరుస క్రమం లేని అంకెల అర్థం ఏమిటి? అంటే.. చాలానే ఉందని చెప్పక తప్పదు.

By:  Tupaki Desk   |   26 April 2024 5:15 AM GMT
65.. 42.. 37.. 32.. 22.. 19: ఏపీ ఎన్నికలు మొత్తం వీటి చుట్టూనే!
X

ఏమిటీ అంకెలు. ఒక పద్దతి పాడు లేకుండా.. వరుస క్రమం లేని అంకెల అర్థం ఏమిటి? అంటే.. చాలానే ఉందని చెప్పక తప్పదు. ‘‘65.. 42.. 37.. 32.. 22.. 19’’ ఈ అంకెల అసలు లెక్క తెలిసిన తర్వాత.. వీటి మీద ఆసక్తి మాత్రమే కాదు.. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు వీటితోనే ఏపీ ప్రజలంతా మమేకం అవుతారనటంలో సందేహం లేదు. ఆ మాటకు వస్తే.. ఏపీ ఎన్నికలు మొత్తం వీటి చుట్టూనే తిరగనుంది. రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాన్ని డిసైడ్ చేసేది ఈ అంకెలేనని చెప్పక తప్పదు. ఇంతకూ ఈ అంకెలు ఏంటి? వాటి లెక్కేంటి? అన్న విషయంలోకి వెళితే..

ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ.. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే వారరెందరు ఉన్నప్పటికీ కొన్ని స్థానాల మీదనే అందరి చూపు ఉంటుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. విపక్ష నేత చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల.. చంద్రబాబు కుమారుడు కం మాజీ మంత్రి లోకేశ్.. చంద్రబాబు బావమరిది కం వియ్యంకుడైన బాలక్రిష్ణ.. ఏపీ బీజేపీ బాధ్యురాలిగా వ్యవహరిస్తున్న పురంధేశ్వరి పోటీ చేస్తున్న స్థానాల ఫలితాలేమిటన్నది అందరిలోనూ ఆసక్తే.

ఏపీలో నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసాయి. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు.. 25 లోక్ సభ స్థానాలకు సంబంధించిన నామినేషన్ల విషయానికి వస్తే భారీగా దాఖలయ్యాయి. 175 అసెంబ్లీ స్థానాలకు మొత్తం 3084 మంది అభ్యర్థులు 4265 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. అదే సమయంలో 25 లోక్ సభా స్థానాలకు 555 మంది అభ్యర్థులు 747 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

ఏపీలో జరిగే ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు నడుస్తున్నా.. కొన్ని స్థానాల మీద మాత్రం ప్రాంతాలతో సంబంధం లేకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోని వారికి మాత్రమే కాదు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగోళ్లంతా ఫోకస్ పెట్టిన పరిస్థితి. ఇందులో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఆయన పరిస్థితేంటి? మాజీ మంత్రి లోకేశ్ కు గత ఎన్నికల్లో షాకిచ్చిన మంగళగిరి ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పును ఇవ్వనున్నారు? బాలక్రిష్ణను వరుస పెట్టి గెలిపిస్తున్న హిందూపురం ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారు? పురంధేశ్వరికి ఈసారి ఎన్నికలు కలిసి వస్తాయా? తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన వైఎస్ షర్మిల ఎలాంటి ప్రభావాన్ని చూపనున్నారు? లాంటి ప్రశ్నలతో పాటు.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బరిలో నిలిచిన పులివెందులతో గత ఎన్నికల కంటే ఎంత మెజార్టీ పెరుగుతుంది? కుప్పం అసెంబ్లీని తన కంచుకోటగా భావించే చంద్రబాబు.. ఈసారి ఆయనకు ఎలాంటి తీర్పును ఇవ్వనున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

మరి.. ఈ అగ్రనేతలు పోటీ చేసే స్థానాల్లో ఎంత మంది ప్రత్యర్థులు పోటీ చేస్తున్నారన్నది ఆసక్తికరమైన అంశం. ఈ అంశాన్ని చూస్తే.. అత్యధికంగా నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి స్థానం నుంచి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తాజా లెక్కల ప్రకారం మొత్తం 65 మంది బరిలో ఉన్నారు. అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉండటంతో ఎంతమంది విత్ డ్రా అవుతారన్నది ఆసక్తికర అంశం.

అగ్రనేతల్లో లోకేశ్ తర్వాత ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన నియోజకవర్గంగా ఏపీ పీసీసీ రథసారధిగా వ్యవహరిస్తున్న వైఎస్ షర్మిల బరిలో ఉన్న కడప లోక్ సభ స్థానం నుంచి 42 మంది నామినేషన్లు దాఖలు చేశారు. ఆ తర్వాత అత్యధికంగానామినేషన్లు దాఖలైన నియోజకవర్గంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నుంచి 37 మంది నామినేషన్లు దాఖలు చేస్తే.. తర్వాతి స్థానంలో చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నిలుస్తుంది. అక్కడ మొత్తం 32 మంది నామినేషన్లు దాఖలు చేశారు.

రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరి మీద 22 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అగ్రనేతలు బరిలో ఉన్న స్థానాల్లో మిగిలిన వారి కంటే తక్కువ మందిని ఎదుర్కొంటున్న వారిగా జనసేన అధినేత పవన్ కల్యాణ్.. చంద్రబాబు వియ్యంకుడు నందమూరి బాలక్రిష్ణ నిలుస్తారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుంటే.. నందమూరి బాలక్రిష్ణ హిందూపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. వీరిద్దరు పోటీ చేస్తున్న ఈ రెండు స్థానాల్లోనూ 19 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం నామినేషన్లను పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరు తేదీ ఏప్రిల్ 29. ఆ రోజున ఫైనల్ గా ఎంతమంది బరిలో ఉన్నారన్నది స్పష్టం కానుంది.