ఏపీ కేబినెట్ లోని 25 మందిలో ఈ ఇద్దరు మంత్రులూ స్పెషల్!
ఇందులో ఫ్రెషర్స్ ఉన్నారు, మోస్ట్ సీనియర్లూ ఉన్నారు.
By: Tupaki Desk | 9 July 2025 9:37 PM ISTఎంత సీనియారిటీ ఉంది, ఎంత పెద్ద అవకాశం ఉంది, ఎంత పెద్ద పదవి ఉంది, ఎంత పెద్ద పలుకుబడి ఉంది అన్నది ముఖ్యం కాదు.. ప్రజాసేవపై ఎంత పెద్ద కమిట్మెంట్ ఉందనేది ముఖ్యం అని అంటారు. ఇందులో ఫస్ట్ టైం మంత్రులు అయిన వారూ సూపర్ పెర్ఫార్మెన్స్ చేస్తుంటారు.. ఎన్నోసార్లు మంత్రులు అయినవారూ కొన్నిసార్లు చతికిలబడుతుంటారని అంటారు. ఈ సమయంలో ఏపీలో ఇద్దరు మంత్రులు మాత్రం బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.
అవును... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ లో 25 మంది మంత్రులు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో ఫ్రెషర్స్ ఉన్నారు, మోస్ట్ సీనియర్లూ ఉన్నారు. వీరిలో ప్రధానంగా ఇద్దరు మంత్రుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. వారి కమెంట్మెంట్ కు ఇటు ప్రజలు సంతృప్తిగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వారు ఎవరు అనేది ఇప్పుడు చూద్దామ్...!
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గం నుంచి వరుసగా గెలుపొందుతున్న ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ శాఖ మంత్రిగా ఆయన కమిట్మెంట్ పై చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లో ఆయన చేసిన పనులే ఇందుకు కారణం అని చెబుతున్నారు. ఎన్నికల సమయంలోనూ తనదైన ప్రచారంతో పేరు సంపాదించుకుని ఘన విజయం సాధించారు.
ఈ క్రమంలో ఇటీవల విజయవాడలో వరదలు సంభవించినప్పుడు బుడమేరు వద్ద కట్ట వేయించే పనిని చేపట్టిన నిమ్మల రామానాయుడు కమిట్మెంట్ వేరే లెవెల్ అని చెబుతుంటారు. నాడు ఆయన తీవ్రమైన జ్వరంతో ఉండి కూడా ఆయన బుడమేరు కట్టను నిర్మించేలాగా పగలూ రాత్రి అనే తేడా లేకుండా అక్కడే ఉండి పనులు చేయించారు. ఇటీవల అసెంబ్లీ సెషన్స్ సమయంలో చేతికి ఉన్న సిలైన్ స్టిక్కర్ తోనే సభకు వచ్చిన పరిస్థితి!
ఇక నియోజకవర్గ విషయానికి వస్తే.. చంద్రబాబు పిలుపునిచ్చిన "ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమాన్ని ఆయన సక్సెస్ ఫుల్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల ప్రచార సమయంలో ఎంత శ్రద్ధగా తిరుగుతారో.. తనను గెలిపించిన ప్రజల వద్దకు ఇప్పుడు మంత్రిగానూ వెళ్లి వారి సమస్యలు తెలుసుకొంటున్నారు. వారి వినతులు స్వీకరిస్తున్నారు! ఈ క్రమంలో చంద్రబాబు వద్ద మంచి పేరు తెచ్చుకోవడంలో ఇవి మచ్చుకు కొన్ని ఉదహారణలు మాత్రమే!
ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా.. ప్రభుత్వ పథకాలకు నిధులు కేటాయిస్తూ చంద్రబాబు మనసును చూరగొంటున్నారనే పేరు సంపాదించుకున్న మరో మంత్రి పయ్యావుల కేశవ్. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరే సమయానికి ఆర్థిక పరిస్థితి అత్యంత అధ్వాన్నంగా ఉందని చెబుతున్న వేళ.. ముఖ్యంగా ఆదాయ మార్గాలను అన్వేషించే క్రమంలో పయ్యావుల కేశవ్ పెర్ఫార్మెన్స్ అద్భుతం అని అంటారు.
ఇందులో ప్రధానంగా... పన్నుల ఎగవేతపై కీలక దృష్టి సారించడంతో పాటు అటు నియోజకవర్గంలోనూ, ఇటు రాష్ట్ర వ్యాప్తంగానూ కీలకమైన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు సమకూర్చే విషయంలో కీలక ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. ఇక తాజాగా సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా... నేలపై కూర్చుని సమస్యలు వింటూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు!
ఈ విధంగా అటు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యతల్లోనూ, మరోవైపు మంత్రులుగా రాష్ట్రం మొత్తం ఆయా శాఖల బాధ్యతలను నిర్వహించడంతోనూ ఈ ఇద్దరు మంత్రులూ బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తూ, సీఎం చంద్రబాబు వద్ద మంచి పేరు తెచ్చుకుంటున్నారని చెబుతున్నారు!
