ఆకాశాన్ని ఎవరు శాసిస్తారో తెలుసా?... భారత్ స్థానం ఇదే!
అవును... ప్రపంచంలో శక్తివంతమైన సైనిక విమాన సముదాయాలను కలిగి ఉన్న దేశాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది.
By: Tupaki Desk | 18 July 2025 12:37 PM ISTఈ ప్రపంచంలో శక్తివంతమైన దేశాలుగా నిలవాలంటే ప్రధానంగా బలమైన వైమానిక దళం, అప్ డేటెడ్ సాంకేతిక సామర్థ్యం, ఖచ్చితత్వంతో కూడిన ప్రభావం ఉండాలని చెబుతారు. ఈ సమయంలో... గ్లోబల్ ఫైర్ పవర్ - 2025 నివేదిక ఆధారంగా ఈ ప్రపంచంలో శక్తివంతమైన సైనిక విమాన సముదాయాలను కలిగి ఉన్న టాప్ 10 దేశాలు ఏవనేది ఇప్పుడు చూద్దామ్..!
అవును... ప్రపంచంలో శక్తివంతమైన సైనిక విమాన సముదాయాలను కలిగి ఉన్న దేశాల జాబితా తాజాగా తెరపైకి వచ్చింది. ఈ జాబితాలో సుమారు 1,000 సైనిక విమాన సముదాయంతో ఫ్రాన్స్ దేశం 10వ స్థానంలో ఉంది. ఈ దేశంలో అధునాతన ఫైటర్ జెట్ లు.. డస్సాల్ట్ రాఫెల్, మిరాజ్ 2000, ఎయిర్ బస్ ఏ 330, సీ-130 పెర్క్యులస్ లు ఉన్నాయి.
* ఈ జాబితాలో 1,083 విమానాలతో టర్కీ 9వ స్థానంలో ఉంది. నాటో సభ్యుడిగా ఉన్న ఈ దేశం దగ్గరగా అత్యంత అధునాతన ఫైటర్ జెట్ టీఎఫ్ కాన్ ఉంది. ఇది టర్కిష్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ (టీఏఐ) అభివృద్ధి చేస్తున్న ఐదవ తరం ట్విన్ ఇంజన్, మల్టీ రోల్ స్టెల్త్ ఫైటర్ జెట్. కాగా.. పశ్చిమాసియా, మధ్యధరా ప్రాంతాలలో ప్రాంతీయ స్థిరత్వంలో టర్కీ కీలక పాత్ర పోషిస్తుంది.
* ఇదే క్రమంలో... మొత్తం 1,093 విమానాలతో ఈజిప్ట్ వైమానిక దళం ఈ జాబితాలో ఎనిమిదవ స్థానంలో ఉంది. ఇందులో అమెరికన్ ఎఫ్-16లు, ఫ్రెంచ్ రాఫెల్ యుద్ధ విమానాలు, రష్యన్ విమానాలు ఉన్నాయి. ఈజిప్ట్ వైమానిక శక్తి ప్రాంతీయ రక్షణ, శాంతి పరిరక్షక కార్యకలాపాలకు ఎంతగానో దోహదపడుతుందని అంటున్నారు.
* ఈ జాబితాలో దాదాపు 1,399 సైనిక విమానాలతో ప్రపంచంలో ఏడవ స్థానంలో ఉంది పాకిస్తాన్. ఈ దేశ వైమానిక దళం ప్రధానంగా... వివిధ రకాల విమానాలను రక్షించడానికి, నిరోధించడానికి, సరిహద్దు ప్రాంతాలను రక్షించడానికి, పొరుగు దేశం భారత్ యొక్క అధునాతన ఆయుధాలను ఎదుర్కోవడానికి నిర్వహించబడుతుంది.
* 1,443 విమానాలతో జపాన్ ప్రపంచంలో ఆరో స్థానంలో ఉంది. జపాన్ వైమానిక దళం ప్రాంతీయ స్థిరత్వాన్ని కాపాడుకోవడంతోపాటు ముఖ్యంగా అమెరికాతో రక్షణ భాగస్వామ్యాలకు మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జపాన్ లో దేశీయంగా ఉత్పత్తి చేయబడిన బహుళ పాత్ర యుద్ధ విమానం మిత్సుబిషి ఎఫ్-2, ఐదవ తరం స్టెల్త్ యుద్ధ విమానం లాక్ హీడ్ మార్టిన్ ఎఫ్-35 లైట్నింగ్ ప్రత్యేకంగా ఉన్నాయి.
* దక్షిణ కొరియా వద్ద సుమారు 1,592 సైనిక విమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తర కొరియా నుండి వచ్చే బెదిరింపులకు ప్రతిస్పందనగా.. వాయు రక్షణ విషయానికి ఆ దేశం బలమైన ప్రాధాన్యతనిస్తుంది. దేశీయంగా తయారు చేయబడిన మొట్టమొదటి ఫైటర్ జెట్ అయిన కేఎఫ్-21 ను స్టెల్త్ ఫైటర్ గా అప్ గ్రేడ్ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
* గ్లోబల్ ఫైర్ పవర్ - 2025లో భారతదేశం నాల్గవ స్థానంలో నిలిచింది. 2,229 సైనిక విమానాలతో భారత వైమానిక దళం నిరంతర అప్ డేట్ అవుతూనే ఉంది. కొత్త యుద్ధ విమానాలు, వాయు రక్షణ వ్యవస్థలను జోడిస్తోంది. ఇది.. డస్సాల్ట్ రాఫెల్, సుఖోయ్, తేజస్, మిరాజ్ 2000 వంటి ఆధునిక విమానాలను కలిగి ఉంది.
* ఇదే సమయంలో... చైనా వైమానిక దళం వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం దాని విమానాల సంఖ్య 3,309 గా ఉంది. ఈ క్రమంలో అధునాతన బాంబర్లు, ఫైటర్ జెట్ లు, డ్రోన్ లపై దృష్టి సారించి.. ప్రాంతీయ ఆధిపత్యాన్ని నొక్కి చెప్పడంతో పాటు ప్రపంచ సైనిక ప్రభావాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో మూడో స్థానంలో నిలిచింది.
* ఇక.. ఉక్రెయిన్ తో అవిరామంగా పోరాడుతున్న రష్యా వైమానిక దళంలో 4,200 విమానాలు ఉన్నాయి. దీంతో... పరిమాణం, సామర్థ్యం పరంగా రష్యా ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. రష్యా అంబులపొదిలో అత్యంత అధునాతన యుద్ధ విమానాలలో ఐదవ తరం సుఖోయ్ -57, 4.5 తరం సుఖోయ్ 35 ఎస్ ఉన్నాయి.
* ఈ జాబితాలో 13,043 యుద్ధ విమానాలతో యునైటెడ్ స్టేట్స్ అగ్రస్థానంలో ఉంది. వీటిలో ఫైటర్ జెట్ లు, బాంబర్లు, రవాణా విమానాలు, నిఘా విమానాలు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ విమానాలు అత్యంత నవీకరించబడిన సాంకేతికతను కలిగి ఉన్నాయి. ఫలితంగా ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన వైమానిక దళంగా నిలిచింది.
