Begin typing your search above and press return to search.

అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరిందట.. భారత్ దే విజయం

ఇదిలా ఉండగా భారత సైన్యం ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం, ఈ సైనిక చర్యలో పాకిస్థాన్‌కు చెందిన 35-40 మంది సైనికులు మరణించారు.

By:  Tupaki Desk   |   14 May 2025 9:34 PM IST
అందుకే పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరిందట.. భారత్ దే విజయం
X

భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఇటీవల జరిగిన సైనిక ఘర్షణలో భారత్‌కు స్పష్టమైన ఆధిక్యం లభించిందని, అందుకే పాకిస్థాన్ కాల్పుల విరమణ కోరిందని ఆస్ట్రియన్ సైనిక చరిత్రకారుడు, విశ్లేషకుడు టామ్ కూపర్ పేర్కొన్నారు. టైమ్స్ నౌతో మాట్లాడుతూ కూపర్, పాకిస్థాన్ తన ఓటమిని అంగీకరించిందని, పరిస్థితిని మరింత తీవ్రతరం చేయలేమని గ్రహించిందని అన్నారు. భారత్ తన దాడులను ఆపాలని పాకిస్థాన్ కోరిందని ఆయన తెలిపారు.

కూపర్ విశ్లేషణ ప్రకారం, ఇండియా కచ్చితమైన.. సమన్వయ దాడులు పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేశాయి. పాకిస్థాన్ నిరోధక శక్తి, వైమానిక రక్షణ విఫలమయ్యాయని, ఇది చివరికి పాకిస్థాన్‌ను కాల్పుల విరమణ కోరడానికి బలవంతం చేసిందని ఆయన అన్నారు. వైమానిక యుద్ధ చరిత్రలో నిపుణుడైన కూపర్, అనేక పుస్తకాలకు సహ రచయితగా ఉన్నారు.

ఇదిలా ఉండగా భారత సైన్యం ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం, ఈ సైనిక చర్యలో పాకిస్థాన్‌కు చెందిన 35-40 మంది సైనికులు మరణించారు. భారత్ తన లక్ష్యాలను విజయవంతంగా చేరుకుందని, పాకిస్థాన్ మళ్ళీ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని భారత సైన్యం హెచ్చరించింది.

గత వారం జరిగిన వైమానిక దాడుల్లో భారత క్షిపణులు .. డ్రోన్‌లు కనీసం ఎనిమిది పాకిస్థాన్ వైమానిక దళ స్థావరాలపై భారీ విధ్వంసం సృష్టించాయి. పలు రాడార్ , వైమానిక రక్షణ యూనిట్లు కూడా ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు నిలిచిపోయినప్పటికీ, దాని వైమానిక దాడులు భారత వైమానిక రక్షణ వ్యవస్థలను ఛేదించలేకపోయాయి.

పాకిస్థాన్ కూడా ఇటీవల ఈ నష్టాన్ని అంగీకరించింది. పాకిస్థాన్ ఆర్మీ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి మాట్లాడుతూ పాకిస్థాన్‌కు చెందిన "కేవలం ఒక విమానం"కు "చిన్నపాటి నష్టం" జరిగిందని, అయితే ఆ విమానం గురించిన వివరాలు వెల్లడించలేదని తెలిపారు. తమ కస్టడీలో ఏ భారత పైలట్ లేరని, అలాంటి వార్తలన్నీ "నకిలీ సోషల్ మీడియా నివేదికలు" ఆధారంగా వచ్చాయని ఆయన అన్నారు.

అదమ్ పూర్ ఎయిర్ బేస్ నుండి ప్రధాని నరేంద్ర మోడీ పాకిస్థాన్‌కు బలమైన సందేశం ఇచ్చారు. ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ను ఛేధించలేకపోయారని.. భారత సైనిక స్థావరాలకు ఎటువంటి హాని చేయడంలో మీరు విఫలమవ్వడమే కాకుండా, మీ గడ్డపై నుండి ఉగ్రవాదం కొనసాగితే మీరు సర్వనాశనం అవుతారని మోడీ హెచ్చరించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సాయుధ బలగాలనుద్దేశించి మోడీ తన మొదటి ప్రసంగంలో " ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశపు లక్ష్మణ రేఖ ఇప్పుడు పూర్తిగా స్పష్టంగా ఉంది. ఇప్పుడు మళ్ళీ ఏదైనా ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుంది అని అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ సైనిక చర్యలో తొమ్మిది ఉగ్ర స్థావరాలు ధ్వంసమయ్యాయని, 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని, పాకిస్థాన్‌కు చెందిన ఎనిమిది సైనిక స్థావరాలకు నష్టం వాటిల్లిందని మోడీ సైన్యాన్ని ప్రశంసించారు.