హోం మంత్రి పదవి మీద ఆశ పడిన టీఎన్ శేషన్
ఇప్పటి తరానికి టీఎన్ శేషన్ పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ.. ఇప్పటికి నలభైల్లో ఉన్న వారికి టీఎన్ శేషన్ సుపరిచితుడే.
By: Tupaki Desk | 18 April 2025 1:12 PM ISTఇప్పటి తరానికి టీఎన్ శేషన్ పెద్దగా పరిచయం లేకపోవచ్చు. కానీ.. ఇప్పటికి నలభైల్లో ఉన్న వారికి టీఎన్ శేషన్ సుపరిచితుడే. అప్పటివరకు సాగిన ఎన్నికల ప్రక్రియను సమూలంగా మార్చేయటమే కాదు.. కేంద్ర ఎన్నికల సంఘం ఎంత పవర్ ఫుల్ అన్న విషయాన్ని దేశం మొత్తానికి తెలిసేలా చేసిన ఘనుడు. అంతేకాదు.. విధినిర్వహణలో ముక్కుసూటిగా వ్యవహరిస్తారన్న పేరుతో పాటు.. ఎవరికి తలవంచరన్న పేరు ఆయన సొంతం. అయితే.. ఆయనకు సంబంధించి ఇప్పటివరకు ఎప్పుడూ బయటకు రాని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి.
అదెలానంటే.. దివంగత మాజీ రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ వద్ద సంయుక్త కార్యదర్శిగా పని చేసిన గోపాలక్రిష్ణ గాంధీ తాజాగా ఒక పుస్తకం రాశారు. ‘ద అన్ డైయింగ్ లైట్: ఎ పర్సనల్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా’ పేరుతో రాసిన పుస్తకాన్ని తాజాగా ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. ఆయన మాటల్లో నాటి కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రధాన కమిషనర్ గా వ్యవహరించిన టీఎన్ శేషన్ కు సంబంధించిన అంశాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆయనేం చెప్పారన్నది గోపాలక్రిష్ణ గాంధీ మాటల్లోనే చదివితే.. ‘‘1991 మే 21న మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య జరిగింది. అదే రోజు రాత్రి శేషన్ ఉరుకులు పరుగుల మీద రాష్ట్రపతి భవన్ కు వచ్చారు. రాష్ట్రపతికి కేవలం 12 అడుగుల దూరంలో నుంచున్నారు. ముకుళిత హస్తాలతో కళ్లు పెద్దవి చేసుకొని పరిస్థితిని గుసగుసగా వినిపించటం మొదలుపెట్టారు. రాజీవ్ గాంధీ హత్య జరిగినందున.. ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని సూచన చేశారు. దేశంలో శాంతిభద్రతలను వెంటనే అదుపులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తాను సీఈసీ బాధ్యతలను దాటి అదనపు సేవలనూ అందిస్తానని చెప్పారు. ఒకవేళ మీరు అంగీకరిస్తే.. దేశ హోం మంత్రిగా పని చేస్తానని ప్రతిపాదించారు’’ అని అప్పట్లో జరిగిన విషయాల్ని గుర్తు చేసుకున్నారు.
ఆ తర్వాతేం జరిగిందన్న విషయాన్ని ఆయన చెబుతూ.. ‘శేషన్ వెళ్లిన కాసేపటికి అప్పటి ప్రధానమంత్రి చంద్రశేఖర్.. కేబినెట్ సెక్రటరీ నరేశ్ చంద్ర రాష్ట్రపతిని కలిశారు.శాంతి భద్రతలు అదుపులోకి తెస్తామన్నారు. ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలని విన్నవించారు. ఎన్నికలు వాయిదా పడవని అర్థమైన శేషన్.. ఆ తర్వాత జరగాల్సిన ఎన్నికల దశల్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో జూన్ 15న వీకే సింగ్.. ఐకే గుజ్రాల్ లు.. రాష్ట్రపతిని కలిసి ఎన్నికల సంఘం తీరుపై కంప్లైంట్ చేశారు’ అని వెల్లడించారు.
ఈ సందర్భంగా దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. తనకు తెలిసి.. దేశంలో ఆఖరి స్టేట్స్ పర్సన్ మన్మోహన్ సింగ్ గా గోపాల క్రిష్ణ గాంధీ పేర్కొనటం గమనార్హం. ‘ఆయన చిన్న డెస్కు ముందు కూర్చునేవారు. అది బ్యాటిల్ (యుద్ధ) బోర్డు కాదు. ఆయన పెన్ను రాసేది. కాకుంటే అది డిక్రీ కాదు. రాజకీయాల్లో ఇంకా విలువలు ఉన్నాయని ఆయన నిరూపించారు’’ అన్న వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి
