Begin typing your search above and press return to search.

రూ.75కే 20 మంది ఎంపీలు.. లక్ అంటే ఎన్సీపీఐదే..

రాజకీయాలు చాలా కాస్ట్ లీగా మారిపోయారని అంటుంటారు. చిన్న వార్డు మెంబర్ అవ్వాలన్నా లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు.. ఇక ఎంపీ, ఎమ్మెల్యేలు అవ్వాలంటే లెక్క కోట్లలోనే ఉంటుంది.

By:  Tupaki Desk   |   17 Jun 2026 12:20 PM IST
రూ.75కే 20 మంది ఎంపీలు.. లక్ అంటే ఎన్సీపీఐదే..
X

రాజకీయాలు చాలా కాస్ట్ లీగా మారిపోయారని అంటుంటారు. చిన్న వార్డు మెంబర్ అవ్వాలన్నా లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితులు.. ఇక ఎంపీ, ఎమ్మెల్యేలు అవ్వాలంటే లెక్క కోట్లలోనే ఉంటుంది. కానీ, కేవలం రూ.75 బ్యాంకు బాలెన్స్ ఉన్న పార్టీకి 20 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారంటే నమ్మగలమా..? నిజంగా ఎన్నికల రాజకీయాల్లో పోరాడి గెలవాలంటే కష్టమే.. కానీ, ఫిరాయింపు రాజకీయాలతో కోల్ కతాకు చెందిన ఎన్సీపీఐ ఈ చరిత్ర సాధించింది. ఇంకా అధికారిక లాంఛనాలు పూర్తికాకపోయినా జాతీయ స్థాయిలో జరుగుతున్న ప్రచారంతో తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన 20 మంది పార్లమెంటు సభ్యులు నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ)లో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆసక్తి రేపుతోంది.

రాత్రికి రాత్రి 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో చేరాలని తీసుకున్న నిర్ణయంపై జాతీయస్థాయిలో హాట్ డిబేట్ జరుగుతోంది. తిరుగుబాటు నేతలు ఆ పార్టీనే ఎందుకు ఎంచుకున్నారనే చర్చ ఎక్కువగా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఫిరాయింపు నిరోధక చట్టానికి వ్యతిరేకంగా ఆవిర్భవించిన ఎన్సీపీఐలో ఒకేసారి 20 మంది ఫిరాయింపు ఎంపీలు చేరుతుండటం మరింత ఆసక్తికరంగా చెబుతున్నారు.

ఎన్నికల సంఘం రికార్డుల ప్రకారం నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా 2023 జనవరిలో నమోదైన ఒక చిన్న, గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీ. పశ్చిమ బెంగాల్‌లోని హౌరా జిల్లా సంక్రైల్ కేంద్రంగా ఇది నమోదైంది. ఈ పార్టీకి బెంగాల్, అస్సాం, త్రిపుర వంటి తూర్పు రాష్ట్రాల్లో స్వల్ప ఉనికి ఉందని చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ పార్టీ 2023 త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో 4 స్థానాల్లో పోటీ చేసింది. విచిత్రంగా, వీరు ప్రచారం చేసిన ముఖ్య నినాదం ‘పార్టీ ఫిరాయింపులు చేసే వారిని తిరస్కరించండి’ కానీ ఇప్పుడు అదే పార్టీ ఫిరాయింపుదారులకు ప్రధాన ఆశ్రయంగా మారడం రాజకీయ వైచిత్రిగా చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన కొన్ని స్థానాల్లో ఈ పార్టీకి నోటా కంటే తక్కువ ఓట్లు రావడం గమనార్హం.

ఇక ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికల ప్రకారం 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ పార్టీ బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం నగదు నిల్వ కేవలం రూ.75 మాత్రమే. ఆ తర్వాత 2023-24, 2024-25 నివేదికలు కూడా పెద్దగా అందుబాటులో లేవు. ఒక సాదాసీదా వార్డు సభ్యుడు కూడా లేని ఈ అత్యంత చిన్న పార్టీలోకి ఇప్పుడు 20 మంది లోక్‌సభ ఎంపీలు చేరారు. స్పీకర్ గనుక ఈ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తే, రాత్రికి రాత్రే లోక్‌సభలో అత్యధిక ఎంపీలు ఉన్న ఆరో అతిపెద్ద పార్టీగా అవతరించబోతోందని అంటున్నారు. అంతేకాకుండా ఎన్డీయే కూటమిలో బీజేపీ తర్వాత అత్యంత కీలక భాగస్వామిగా మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఎన్సీపీఐనే ఎందుకు ఎంచుకున్నారు?

కాగా, టీఎంసీ రెబెల్స్ కొత్త గ్రూపుగా ఏర్పడటమో లేదా బీజేపీలో చేరకుండా ఉనికే లేని ఎన్సీపీఐని ఎంచుకోవడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని అనుమానిస్తున్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఏదైనా పార్టీకి చెందిన 2/3 వంతు మంది ప్రజాప్రతినిధులు వేరే పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడే అవకాశం లేదని అంటున్నారు. అయితే టీఎంసీ తిరుగుబాటు ఎంపీల బలం 20 మంది కావడంతో, అది ఆ పార్టీ మొత్తం లోక్‌సభ బలానికి 2/3 వంతు కంటే ఎక్కువ. కాబట్టి వారు సురక్షితంగా బయటపడటానికి ఒక నమోదిత రాజకీయ పార్టీ అవసరమైందని అంటున్నారు. ప్రస్తుతానికి చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉండటానికి ఎన్సీపీఐలో విలీనం అవుతున్నారని చెబుతున్నారు. జూలైలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాక తామే 'అసలైన తృణమూల్ కాంగ్రెస్' అని స్పీకర్ ముందు క్లెయిమ్ చేయనున్నారని అంచనా వేస్తున్నారు.