బీజేపీతో పెట్టుకుంటే అంతే.. మమత, కేజ్రీవాల్, ఉద్దవ్ ఎవరైనా ఒకటే..!
ఇలాంటి పరిస్థితులే గతంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లో చోటుచేసుకోవడంతో బీజేపీ రాజకీయ వ్యూహాలను తట్టుకోవడం అంత సులువు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
By: Tupaki Political Desk | 5 Jun 2026 8:00 PM ISTబెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ పరిణామాలు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. దాదాపు ఐదు దశాబ్దాల రాజకీయ అనుభవం, 28 ఏళ్లుగా పార్టీని నడిపిన మాజీ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన కేవలం నెల రోజులకే తృణమూల్ లో నెలకొన్న పరిణామాలు పరిశీలిస్తే, రాష్ట్రంలో బలమైన ప్రత్యర్థి లేకుండా చేయాలనే అధికార బీజేపీ వ్యూహమే గట్టిగా పనిచేస్తుందని విశ్లేషిస్తున్నారు. దాదాపు పదేళ్లుగా బెంగాల్ గద్దెపై కన్నేసిన బీజేపీ.. ఎట్టకేలకు ఆ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక మమత తర్వాత పార్టీలో సరైన నాయకత్వం లేకపోవడంతో ఆ పార్టీని రెండుగా చీల్చాలని వ్యూహాన్ని రచించిందని అంటున్నారు. దీనికి తగ్గట్టే ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకోగా, ఎంపీలు కూడా బీజేపీతో చేతులు కలిపేందుకు రెడీ అవుతున్నారన్న ప్రచారం హీట్ పుట్టిస్తోంది. ఇలాంటి పరిస్థితులే గతంలో మహారాష్ట్ర, ఢిల్లీల్లో చోటుచేసుకోవడంతో బీజేపీ రాజకీయ వ్యూహాలను తట్టుకోవడం అంత సులువు కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించేందుకు మమత చేసిన ప్రయత్నాలే నేడు ఆమె ఎదుర్కొంటున్నా పరిణామాలా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కమ్యూనిస్టుల కోటగా భావించిన పశ్చిమ బెంగాల్ లో ఆ పార్టీని ఓడించి జెండా పాతిన దీదీ.. ఇప్పుడు ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. దీనికి ప్రధాన కారణంగా గత ఐదేళ్ల పాలనలో ఆమె అనుసరించిన రాజకీయ విధానాలు కూడా కారణమని అంటున్నారు. సొంత పార్టీలో కూడా నేతలకు స్వేచ్ఛ ఇవ్వకుండా తాను ఆదేశిస్తే, పాటించాల్సిందే అన్నట్లు మమత రాజకీయం చేయడంతో ఇప్పుడు ఆమెను ఒంటరిని చేసి వెళ్లిపోతున్నారని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం మమతను కాదని 58 మంది ఎమ్మెల్యేలు వేరుకుంపటి పెట్టుకున్నారు. వీరు సూచించిన నాయకుడినే ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటించారు. అయితే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి రితబ్రత బెనర్జీని విపక్ష నాయకుడిగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు ప్రజాగ్రహానికి గురికాకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. తాము మమత నిర్ణయాన్ని వ్యతిరేకించినా, తమ నాయకురాలు దీదీ అంటూ ఎమ్మెల్యేలు చేస్తున్న ప్రకటనలు ఆసక్తి రేపుతున్నాయి. ముందుగా ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు సువేంధు అధికారిని కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తుండటంతో టీఎంసీలో పరిణామాలకు బీజేపీయే కారణమన్న అనుమానాలకు తావిస్తోందని అంటున్నారు.
ఇక ఇదే సమయంలో పార్టీకి చెందిన 20 మంది ఎంపీలు వేరుకుంపటి పెట్టుకోవాలనే ప్రయత్నాలు కూడా అనేక సందేహాలకు తావిస్తున్నాయి. ఇదంతా గతంలో మహారాష్ట్ర, ఢిల్లీలో చోటుచేసుకున్న రాజకీయాన్ని గుర్తు చేస్తోందని అంటున్నారు. బీజేపీతో విభేదించిన శివసేన పార్టీని నిట్టనిలువునా చీల్చినట్లే.. ఇప్పుడు తృణమూల్ పార్టీని దెబ్బతీయాలని పావులు కదుపుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అదేవిధంగా మరాఠా కురువృద్ధుడు శరద్ పవార్ కు చెందిన ఎన్సీపీని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆప్ రాజ్యసభ సభ్యులను వేరుచేసిన బీజేపీ.. ఇప్పుడు వ్యూహాత్మకంగా తృణమూల్ పై రాజకీయ దాడి చేస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతకాలం అధికారం చేతిలో ఉండటంతో బీజేపీని నిలువరించిన మమత ఇప్పుడు ఏమీ చేయలేకపోవడం కూడా విస్తృత చర్చకు దారితీస్తోంది. ఈ పరిణామాలతోనే ఆమె జాతీయ రాజకీయాలకు వెళ్లాలని ఆలోచన చేస్తున్నారని అంటున్నారు.
