1500 మంది బలి.. 113 ఏళ్ల నాటి భయానక కథ.. టైటానిక్ మునిగిపోవడానికి కారణాలేంటి?
113 ఏళ్ల క్రితం, 1912 ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ అనే భారీ ప్రయాణీకుల ఓడ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయింది.
By: Tupaki Desk | 15 April 2025 12:40 PM ISTప్రపంచాన్ని కుదిపేసిన విషాద గాథ! 113 ఏళ్ల క్రితం అట్లాంటిక్ మహాసముద్రంలో చోటుచేసుకున్న ఓ భయానక ప్రమాదం... చరిత్రలో అతిపెద్ద సముద్ర దుర్ఘటనగా నిలిచిపోయింది. 'ఎప్పటికీ మునగని ఓడ'గా పేరుగాంచిన టైటానిక్, తన తొలి ప్రయాణంలోనే మంచుకొండను ఢీకొని సముద్ర గర్భంలో కలిసిపోయింది. నిద్రలో ఉన్న వేలాది మంది ప్రయాణికులకు అది తీరని శోకాన్ని మిగిల్చింది. ఏప్రిల్ 15, 1912న జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.
113 ఏళ్ల క్రితం, 1912 ఏప్రిల్ 15న ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో టైటానిక్ అనే భారీ ప్రయాణీకుల ఓడ మంచుకొండను ఢీకొట్టి మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్ తన తొలి ప్రయాణాన్ని 1912 ఏప్రిల్ 10న ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ నుండి అమెరికాలోని న్యూయార్క్ నగరానికి ప్రారంభించింది.
1912 ఏప్రిల్ 14వ తేదీ రాత్రి టైటానిక్ ఒక పెద్ద మంచుకొండను ఢీకొట్టింది. దీని కారణంగా ఓడలో పెద్ద రంధ్రాలు ఏర్పడ్డాయి, నీరు వేగంగా లోపలికి రావడం మొదలైంది. దాదాపు 2 గంటల 40 నిమిషాల తర్వాత, 1912 ఏప్రిల్ 15వ తేదీ ఉదయం 2:20 గంటలకు టైటానిక్ పూర్తిగా సముద్రంలో మునిగిపోయింది. నేడు, ఏప్రిల్ 15న ఈ విషాదానికి 113 ఏళ్లు పూర్తయ్యాయి.
1517 మంది దుర్మరణం
టైటానిక్ ఓడను 'అజేయమైనది'గా భావించారు. కానీ ప్రపంచంలోనే అతిపెద్దదైన ఈ బ్రిటిష్ ఓడ అట్లాంటిక్ మహాసముద్రంలో 14 ఏప్రిల్ నాడు మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 1517 మంది మరణించారు. ఇది చరిత్రలో అత్యంత ఘోరమైన సముద్ర ప్రమాదాలలో ఒకటిగా నిలిచింది. ఈ ఓడ ఎప్పటికీ మునగదని చాలామంది నమ్మారు. కానీ విధి మరోలా తలచింది.
టైటానిక్ పరిమాణం
ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు చెందిన హార్లాండ్ అండ్ వూల్ఫ్ అనే సంస్థ ఈ ఓడను నిర్మించింది. దీని పొడవు 269 మీటర్లు, వెడల్పు 28 మీటర్లు మరియు ఎత్తు 53 మీటర్లు. ఈ ఓడలో మూడు ఇంజన్లు ఉండేవి. వాటిని నడపడానికి రోజుకు 600 టన్నుల బొగ్గును ఉపయోగించేవారు. ఆ కాలంలో ఈ ఓడను నిర్మించడానికి 1.5 మిలియన్ పౌండ్లు ఖర్చు అయింది. దీని నిర్మాణం కోసం మూడు సంవత్సరాలు పట్టింది. ఈ ఓడలో ఒకేసారి 3300 మంది ప్రయాణించగలరు.
మొదటి ప్రయాణంలో సుమారు 1300 మంది ప్రయాణికులు, 900 మంది సిబ్బంది ఉన్నారు. ఆ సమయంలో టిక్కెట్ల ధరలు చాలా ఎక్కువగా ఉండేవి. మొదటి తరగతి టిక్కెట్టు ధర 30 పౌండ్లు, రెండవ తరగతి టిక్కెట్టు ధర 13 పౌండ్లు, మూడవ తరగతి టిక్కెట్టు ధర 7 పౌండ్లు.
ఎక్కడ లభించింది శిథిలాలు?
టైటానిక్ ఓడ శిథిలాలు 1985లో అట్లాంటిక్ మహాసముద్రంలో 2600 అడుగుల లోతులో కనుగొన్నారు. ఈ పనిని అమెరికా, ఫ్రాన్స్ సంయుక్తంగా చేశాయి. ఇందులో యూఎస్ నేవీ కీలక పాత్ర పోషించింది. శిథిలాలు కనుగొనబడిన ప్రాంతం కెనడాలోని సెయింట్ జాన్స్కు దక్షిణంగా 700 కిలోమీటర్ల దూరంలో, అమెరికాలోని హాలిఫాక్స్కు 595 కిలోమీటర్ల ఆగ్నేయంలో ఉంది. టైటానిక్ రెండు ముక్కలుగా విరిగిపోయి.. ఒకదానికొకటి 800 మీటర్ల దూరంలో ఉన్నాయి.
శిథిలాలు చూడటానికి వెళ్లిన వారి మృతి
ఆధునిక చరిత్రలో అత్యంత విషాదకరమైన సంఘటనలలో ఇది ఒకటి. ఈ దుర్ఘటన అనేక కథలు, సినిమాలు, సంగీతానికి ప్రేరణగా నిలిచింది. నేటికీ ఈ ఓడ అనేక శిథిలాలు సముద్ర గర్భంలో ఉన్నాయి. ఇటీవల, అమెరికన్ సంస్థ ఓషన్ గేట్ టైటానిక్ టూరిజంను ప్రారంభించింది. దీనిని చూడటానికి వెళ్లిన ఒక జలాంతర్గామి మునిగిపోవడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.