తిరువూరు వైసీపీలో జగన్ ధిక్కార స్వరం..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్‌కే ఎదురు తిరిగిన సందర్భం తెరమీదికి వచ్చింది.
By: Tupaki Desk | 19 April 2025 10:32 AMఉమ్మడి కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ అధినేత జగన్‌కే ఎదురు తిరిగిన సందర్భం తెరమీదికి వచ్చింది. ప్రస్తుతం తిరువూరు మునిసిపాలిటీ వైసీపీ చేతిలో ఉంది. అయితే.. కొందరు కౌన్సిలర్లు కూటమికి మద్దతు ప్రకటించారు. దీంతో చైర్ పర్సన్‌గా ఉన్న వైసీపీ నాయకురాలు కస్తూరిబాయికి మద్దతు కొరవడింది. దీంతో ఆమెపై అవిశ్వాసం ప్రకటించారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించి.. నిర్ణయం తీసుకోవాలని భావించారు.
ఇక, ఈవిషయంలో వైసీపీ అధినేత జగన్ కూడా.. గతంలో రెండు సార్లు పంచాయితీ పెట్టారు. ``మనకు మెజారిటీ తగ్గినప్పుడు మనం చేసేది ఏం లేదు. అవిశ్వాసం ఎదుర్కొని గెలిస్తే.. ఓకే. లేకపోతే రాజీనామా చేయండి`` అని కస్తూరిబాయికి తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికి రెండు సార్లు కస్తూరిబాయికి వ్యతిరేకంగా అవిశ్వాసం ప్రకటిస్తూ.. తీర్మానాన్నిఆమోదించేందుకు కౌన్సిల్ రెడీ అయింది. ఇదే జరిగితే.. తన అధికారాలు.. హవా కూడా.. పోతాయని భావించిన కస్తూరిబాయి వ్యూహాత్మకంగా రివర్స్ అయ్యారు.
గతంలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆమె.. డుమ్మా కొట్టారు. అనారోగ్య కారణాలతో సమావేశానికి రాలేక పోతున్నట్టు చెప్పారు. దీంతో మలివిడత గురువారం సమావేశం నిర్వహించారు. అజెండాలో నాలుగో అంశంగా అవిశ్వాసం విషయాన్ని చేర్చారు. అయితే.. ఇప్పుడు కూడా.. ఫస్ట్‌లో ఉన్న మూడు అంశాలు చర్చించేవరకు కౌన్సిల్‌కు నేతృత్వం వహించిన కస్తూరిబాయి.. తన విషయం వచ్చే సరికి వడివడిగా బయటకు వచ్చేశారు. దీంతో మరోసారి ఈ చర్చ వాయిదా పడింది.
వైసీపీకి దెబ్బ..
కౌన్సిల్ చైర్ పర్సన్‌పై అవిశ్వాసం ప్రకటించిన నేపథ్యంలో నిధులు రావు. వచ్చినా.. వినియోగించే హక్కు అధికారం ఆమెకు ఉండదు. దీంతో పనులు నిలిచిపోయి.. వైసీపీ హయాంలో ఏమీ చేయడం లేదన్న వాదన బలంగా ప్రజల మధ్యకు చేరుతుంది. తద్వారా.. పార్టీకి క్షేత్రస్థాయిలో ఇబ్బందులు వచ్చి.. ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుంది. పైగా.. వైసీపీ అధినేత జగన్ చెప్పిన తర్వాత.. కూడా కస్తూరిబాయి ఆయన మాటను లెక్క చేయకుండా తిరుగుబాటు జెండా ఎగరేసినట్టు అయింది.