Begin typing your search above and press return to search.

తగ్గేదేలే అంటున్న తమ్ముళ్లు.. కొలికిపూడి ఔటేనా?

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారింది.

By:  Tupaki Desk   |   6 April 2025 5:00 AM IST
తగ్గేదేలే అంటున్న తమ్ముళ్లు.. కొలికిపూడి ఔటేనా?
X

తిరువూరు రాజకీయాలు వేసవి ఎండలను మించిన హీటుగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తీరుతో విసిగిపోయిన ఆ పార్టీ కార్యకర్తలు భారీ సమావేశం నిర్వహించి, ఎమ్మెల్యే స్థానంలో తమకు కొత్త ఇన్ చార్జిని నియమించాలని పార్టీకి ఆల్టిమేటం జారీ చేశారు. 20 ఏళ్లుగా పార్టీకి ఎమ్మెల్యేలు లేకపోయినా గౌరవంగా బతికామని, కొలికపూడి గెలిచిన తర్వాత తలెత్తుకుని బతకలేకపోతున్నామని కార్యకర్తలు వాపోతున్నారు. కొలికపూడిని సాగనంపాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు.

తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పరిస్థితి ముందు నుయ్యి.. వెనక గొయ్యి అన్న చందంగా మారింది. ఇటు కార్యకర్తలతోనూ అటు పార్టీ అధిష్టానంతోనూ సంబంధాలు దెబ్బతినడంతో కొలికపూడి రాజకీయ భవిష్యత్ గందరగోళంగా మారిందంటున్నారు. గత ఎన్నికల్లో అనూహ్యంగా టికెట్ దక్కించుకున్న కొలికపూడి ఎమ్మెల్యేగా ఎన్నికైన రెండో రోజు నుంచి వివాదాలతో సహవాసం చేస్తున్నారు. పార్టీ నేతలతో గొడవలు, అధిష్టానంతో సమన్వయం లేకపోవడంతో కొలికపూడి తీవ్ర అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఆయన తీరు మార్చుకోవాలని అధిష్టానం ఎన్నిసార్లు చెప్పినా, పెద్దగా మార్పు లేకపోవడంతో కొలికపూడిని ఎలా వదిలించుకోవాలనే విషయమై టీడీపీ హైకమాండ్ ఆలోచన చేస్తుందని ప్రచారం జరుగుతోంది.

ఇక తిరువూరులో టీడీపీ సీనియర్ నేత రమేశ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాల్సిందిగా గత వారం డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కొలికపూడి పార్టీ హైకమాండ్ కు డెడ్ లైన్ విధించడం కూడా వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కొలికపూడిపై విచారణ జరిపిన జిల్లా టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురాం పార్టీ అధిష్టానానికి నివేదిక సమర్పించారు. అయితే పార్టీ నిర్ణయం ఏంటనేది కూడా ఎదురుచూడకుండా, ఇప్పుడు కార్యకర్తలు రోడ్డెక్కుతున్నారు. తిరువూరులో సాధారణ కార్యకర్తల సమావేశంగా నిర్వహించిన కార్యక్రమానికి నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి కార్యకర్తలు, నాయకులు తరలివచ్చి ఎమ్మెల్యే కొలికపూడితో వేగలేకపోతున్నామంటూ ఏకరువు పెట్టారు. తమకు ఎమ్మెల్యే కొలికపూడి వద్దని, కొత్త ఇన్ చార్జిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మాజీ ఇన్చార్జి దేవదత్ హాజరుకావడం చర్చనీయాంశమవుతోంది.

పార్టీ నిర్ణయం ఎలా ఉన్నా, తాము కొలికపూడితో కలిసి పనిచేసేది లేదని కార్యకర్తలు, నాయకులు తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యే రాజకీయ భవిష్యత్తుపై నీలి మేఘాలు కమ్ముకుంటున్నాయి. అధికార పార్టీలో ఉంటూ విపక్ష నేతలతో ఆయన స్నేహం చేస్తున్నారనే ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుండటం వల్ల ఇన్నాళ్లు కొలికపూడిపై కాస్త మెతక వైఖరి ప్రదర్శించిన టీడీపీ అధిష్టానం ఇక కఠిన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తుందని చెబుతున్నారు. మొత్తానికి కార్యకర్తల సమావేశంతో కొలికపూడి కథ కంచికి చేరినట్లే అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.