తిరువూరు పంచాయతీ తెగేదెన్నడు ..!
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి జనసేన నాయకుడు.. రోడ్డెక్కారు.
By: Tupaki Desk | 5 July 2025 4:00 PM ISTఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గం తిరువూరు మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఈసారి జనసేన నాయకుడు.. రోడ్డెక్కారు. స్థానికంగా విజయం దక్కించుకున్న టీడీపీ నాయకుడు, ఎమ్మెల్యే కొలిక పూడి శ్రీనివాసరావుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడంతోపాటు.. ఆయన వల్ల కూటమి దెబ్బతింటోందని కూడా విమర్శలు గుప్పించారు. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ కూడా అలెర్ట్ అయింది. ఇప్పటికే రెండు నుంచి మూడు సార్లు కొలిక పూడికి క్లాసు తీసుకున్నామని.. అయినా.. ఆయనలో మార్పు రావడం లేదని సీనియర్ నాయకుడు ఒకరు వ్యాఖ్యానించారు.
అసలేం జరిగింది ?
తిరువూరు నియోజకవర్గంలో జనసేన ఇంచార్జ్‌గా ఉన్న మనుబోలు శ్రీనివాసరావు.. తాజాగా కొలికపూడిపై ధ్వజమెత్తారు. కూటమి ధర్మానికి విరుద్ధంగా ఆయన వ్యవహరిస్తున్నారని చెప్పారు. జనసేన కార్యకర్తలు, నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నారన్నది మనుబోలు వాదన. అదేసమయంలో పార్టీ తరఫున కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా అనుమతులు రాకుండా చేస్తున్నారని చెబుతున్నారు. దీనిపై పెద్ద ఎత్తున మనుబోలు విమర్శలు గుప్పించారు.
అయితే.. వాస్తవానికి క్షేత్రస్థాయిలో కలిసి ఉండాలని అటు జనసేన, ఇటు టీడీపీ నాయకులు కూడా చెబు తున్నారు. చిన్న చిన్న విషయాలను కలిసి సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. కానీ.. తిరువూరులో గత నెల రోజుల నుంచి నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఇరు పార్టీల మధ్య వివాదాలు నెలకొన్నాయి. కొన్నాళ్ల కిందట మనుబోలు వర్గీయులు కొందరు.. చెరువుల్లో మట్టి తవ్వుతున్న వ్యక్తులను ఫొటోలు తీశారు. వీటిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
అంతేకాదు... వీరంతా కూటమిలోని ఓ పార్టీకి చెందిన నాయకులేనని.. పేర్కొంటూ వైరల్ చేశారు. ఆ తర్వాత.. ఇసుక వ్యవహారంలోనూ ఫొటోలు తీసి.. ఇవన్నీ.. వారివే.. అంటూ మరో ప్రచారానికి తెరదీశారు. అయితే.. దీనిపై ఇతమిత్తంగా వారు సమాధానం చెప్పకపోవడంతో ఎమ్మెల్యే వర్గీయులుగా ఉన్న కొందరు వారిని నిలదీశారు. ఈ వ్యవహారమే చినుకు చినుకు అన్నట్టుగా ఇప్పుడు పెద్ద దుమారం రేపే దశకు చేరింది. ఈ వ్యవహారంపై టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఎప్పటిలానే.. సర్దుబాటు చేసుకోవాలని చెబుతారో. లేక.. ఏం జరుగుతుందో చూడాలి.